KTR: అవసరమైతే వారిపై చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Mar 01 , 2024 | 07:02 PM
మేడిగడ్డ బ్యారేజీలోని 86 పిల్లర్లలో ఒకటి కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. శుక్రవారం నాడు మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ బృందం సందర్శించింది. కుంగిన పిల్లర్ నెంబర్ 20ని కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.
జయశంకర్ భూపాలపల్లి : మేడిగడ్డ బ్యారేజీలోని 86 పిల్లర్లలో ఒకటి కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. శుక్రవారం నాడు మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ బృందం సందర్శించింది. కుంగిన పిల్లర్ నెంబర్ 20ని కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టుపైన జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలకు వివరించేందుకే చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. నల్లగొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే ఈరోజు ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ప్రజలకు కాంగ్రెస్ అసత్య ప్రచారాలను వివరిస్తున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించే, అసలు నిజాలను ప్రజలకు చెప్పే క్రమంలో ఈరోజు పర్యటన మొదటి అడుగు మాత్రమేనని తెలిపారు. దీని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మిగిలిన అన్ని ప్రాజెక్టులను, రిజర్వాయర్లను, కెనాళ్లను, టన్నెళ్లను కాలువలను ప్రజలకు వివరించేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తామని వివరించారు.
రైతులకు అన్యాయం చేయొద్దు
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో... ఒక్క మేడిగడ్డలో.. మూడు పిల్లర్లల్లో వచ్చిన సమస్యను పట్టుకొని లక్ష కోట్లు వృథా అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారాన్ని తిప్పి కొడతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రైతన్నల పంటలు ఎండవద్దు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే దిక్కని అన్నారు. తమతోపాటు వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 100 అంకాలలో మేడిగడ్డ బ్యారేజీ ఒకటి అని తెలిపారు. 1.6 కిలోమీటర్ల మేడిగడ్డలో చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయొచ్చని ఇంజనీర్లు చెబుతున్నారని అన్నారు. తమపై కోపం ఉంటే తమ మీదనే చూపాలని కానీ రైతులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ద రించాలని కోరారు. అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్‌లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులపై పగపట్టొద్దని.. వరదలు వచ్చేలోగా ప్రాజెక్టును పునరుద్దరించాలని కేటీఆర్ కోరారు.
ఇవి కూడా చదవండి..
TS NEWS: మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉద్రిక్తత.. కారణమిదే..?
TS Politics: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. ఆ కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరారంటే..?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి....
Updated Date - Mar 01 , 2024 | 08:53 PM