కేజ్రీ, సిసోడియాతో కవిత కుమ్మక్కు
ABN , Publish Date - Mar 19 , 2024 | 04:28 AM
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వంటి ఆప్ అగ్ర నేతలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కుమ్మక్కయ్యారని, ఢిల్లీ మద్యం విధానం(2021-22) రూపకల్పన, అమలు ద్వారా అక్రమంగా ప్రయోజనాలు పొందాలని చూశారని ఈడీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఓ పత్రికా
నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ
ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులిచ్చారు
డీలర్ల నుంచి వచ్చిన డబ్బు పంచుకున్నారు
ఆమె పాత్రను ధ్రువీకరించిన తర్వాతే అరెస్టు
తనిఖీలకు కవిత బంధువుల ఆటంకం
ప్రకటన విడుదల చేసిన ఈడీ
సుప్రీంలో విచారణ ఉండగానే అరెస్టు
నన్ను అరెస్టు చేయడం అక్రమం
సుప్రీంలో కవిత పిటిషన్.. నేడు విచారణ
న్యూఢిల్లీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వంటి ఆప్ అగ్ర నేతలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కుమ్మక్కయ్యారని, ఢిల్లీ మద్యం విధానం(2021-22) రూపకల్పన, అమలు ద్వారా అక్రమంగా ప్రయోజనాలు పొందాలని చూశారని ఈడీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు రూ.వంద కోట్ల ముడుపులు చెల్లించడంలో కవిత కీలక పాత్ర పోషించారని వివరించింది. ముడుపుల రూపేణా చెల్లించిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు, లాభాలు ఆర్జించేందుకు వీలుగా మొత్తం కుట్ర జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విధానం రూపొందించారని పేర్కొంది. హైదరాబాద్‌లో తాము సోదాలు నిర్వహిస్తున్నప్పుడు కవిత బంధువులు, సహచరులు తమను అడ్డుకున్నారని ఈడీ తెలిపింది. కాగా, మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ నెల 15న కవిత అరెస్టు తర్వాత మొదటిసారి ఈడీ అధికారికంగా స్పందించింది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని, రూ.128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశామని తెలిపింది. సిసోడియాతో పాటు సంజయ్‌సింగ్, విజయ్‌నాయర్ వంటి ఆప్ నేతలను ఆరెస్టు చేశామని పేర్కొంది. కుంభకోణంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. ఢిల్లీలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు కవితకు రిమాండ్ విధించడంతో పాటు విచారణ నిమిత్తం ఈడీ కస్టడీకి అప్పగించినట్లు పేర్కొంది.
సుప్రీంలో కవిత పిటిషన్‌పై నేడు విచారణ
ఢిల్లీ మద్యం కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ కవిత సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరగతుండగానే అరెస్ట్ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి, ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని కవిత తరఫున న్యాయవాది ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలిచి విచారించకుండా ఇంటివద్దనే విచారించాలని నిరుడు మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసింది. ఈ నెల 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఆ కేసును ఈ నెల 19 (మంగళవారాని)కి వాయిదా వేశారు. సోమవారం కవిత పిటిషన్ దాఖలు చేయగా, గత పిటిషన్‌తో కలిపి రెండింటినీ మంగళవారమే సుప్రీం ధర్మాసనం విచారించనుంది.