ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR Budget Criticism: బడ్జెట్‌పై చీల్చి చెండాడతాం

ABN, Publish Date - Jul 26 , 2024 | 04:36 AM

‘‘బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని వంచించింది. వృత్తి కార్మికుల్ని వంచించింది. అంతా ట్రాష్‌. గ్యాస్‌. ఈస్ట్‌మన్‌ కలర్‌ మాదిరిగా చెప్పారు. ఓ కథ చెప్పినట్లు ఉంది.

  • అంతా ట్రాష్‌.. గ్యాస్‌.. ఓ పాలసీ అంటూ లేదు

  • ప్రస్తావన కూడా లేని గొర్రెల పథకం.. దళిత బంధు

  • ఇది రైతు శత్రు ప్రభుత్వం.. పొగుడుతూనే వెన్నుపోటు

  • రైతు బంధు, భరోసాలో ఆంక్షలతో మోసం చేశారు

  • బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శలు

  • పదేళ్లలో తొలిసారి మీడియా పాయింట్‌కు మాజీ సీఎం

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ‘‘బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని వంచించింది. వృత్తి కార్మికుల్ని వంచించింది. అంతా ట్రాష్‌. గ్యాస్‌. ఈస్ట్‌మన్‌ కలర్‌ మాదిరిగా చెప్పారు. ఓ కథ చెప్పినట్లు ఉంది. చిల్లర మల్లర స్పీచ్‌లా ఉంది. బడ్జెట్‌ ప్రసంగంలా లేదు. పారిశ్రామిక పాలసీ లేదు. ఐటీ పాలసీ లేదు. పేదలకు సంబంధించి ఈ సర్కారుకు ఓ పాలసీ అంటూ లేదు. ఇది పేదల బడ్జెట్‌ కాదు. రైతు బడ్జెట్‌ కాదు. ఎవరి బడ్జెట్‌ అనేది విశ్లేషణలో తెలుస్తుంది. భవిష్యత్తులో దీన్ని చీల్చి చెండాడతాం’’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అంకెలను ఒత్తి ఒత్తి పలకడం తప్ప ఆర్థిక మంత్రి కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు. శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్‌ ప్రసంగం 12:02 గంటలకు ప్రారంభం కాగా.. 25 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 12:04 గంటల సమయంలో ఆయన సభలోకి అడుగుపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం 1:50 గంటలకు ముగియగా.. దానికంటే రెండు నిమిషాల ముందే బయటికి వెళ్లిపోయారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.


‘‘బడ్జెట్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. ఏ ఒక్క వర్గానికి స్పష్టమైన హామీ లేదు. రైతులను పొగుడుతున్నట్లు పొగుడుతూనే వెన్నుపోటు పొడిచింది. రైతు బంధు, భరోసాలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్లు చెప్పి రైతుల్ని మోసం చేశారు. గతంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టాం. ఒక్క పథకంపై కూడా ఇప్పుడు స్పష్టత లేదు. యాదవులకు గొర్రెల పెంపకం పథకం మూసివేసినట్లు అర్థమవుతోంది. దళిత బంధు పథకం ప్రస్తావన లేదు. దళిత సమాజంపై నిర్లక్ష్యానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరం లేదు. మత్స్యకారులకు మాత్రమే కాదు.. ఎవరికీ చెప్పుకోదగ్గ భరోసా లేదు’’ అని దుయ్యబట్టారు. ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని, మహిళల పథకాలపైనా స్పష్టత లేదని విమర్శించారు. ‘‘దురదృష్టం ఏమిటంటే.. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 నెలలు సమయం ఇవ్వాలనుకున్నాం. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణకు రెండు దఫాలు రైతు బంధు ఇచ్చాం. వీరు ఎగ్గొడతామంటున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసినట్లు దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది రైతు శత్రు ప్రభుత్వం’’ అని మండిపడ్డారు. ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, విద్యుత్తు, నీరు సరఫరా చేయ డం లేదని, చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రైతు బంధు, రైతు భరోసా ఎప్పు డు ఇస్తారని అడిగితే కనీసం సమాధానం చెప్ప డం లేదని విమర్శించారు. మీడియా కేసీఆర్‌ను పలు అంశాలపై ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు.


పదేళ్లలో తొలిసారి మీడియా పాయింట్‌కు...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో తొలిసారి కేసీఆర్‌ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లు సీఎం హోదాలో ఉన్న ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడే సందర్భం రాలేదు. గత ఏడాది డిసెంబరులో అధికారం కోల్పోయి.. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చినా.. మీడియాతో మాట్లాడలేదు. అంతకుముందు ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలోకి వచ్చిన కేసీఆర్‌కు పార్టీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి నేరుగా ఆయన తన కొత్త చాంబర్‌కు చేరుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రభుత్వం అసెంబ్లీ ఆవరణలోని ఔటర్‌ లాబీలో ప్రత్యేక చాంబర్‌ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, ఇన్నర్‌ లాబీలోని చాంబర్‌ను తమకు కేటాయించాలని బీఆర్‌ఎస్‌ కోరినా ప్రయోజనం లేకుండాపోయింది. ప్రస్తుత చాంబర్‌ చిన్నదిగా ఉందని, గతంలో ఉన్నట్లు ఇన్నర్‌ లాబీలోనే కేటాయించాలని బీఏసీ సమావేశంలో కూడా కోరారు. ఈ నేపథ్యంలో, తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌ పది నిమిషాలపాటు కొత్త చాంబర్‌లో ఉన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 04:36 AM

Advertising
Advertising
<