KCR: కాంగ్రెస్ సర్కార్‌ను చీల్చి చెండాడుతాం.. బడ్జెట్‌పై కేసీఆర్
ABN, Publish Date - Jul 25 , 2024 | 02:21 PM
తెలంగాణ బడ్జెట్ 2024-25పై(Telangana Budget 2024) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ 2024-25పై(Telangana Budget 2024) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అందరినీ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు.
"ఇది రైతు శత్రు ప్రభుత్వం. బడ్జెట్‌లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదు. గొర్రెల పంపిణీ పథకం, దళితబంధు, రైతు భరోసా తదితర పథకాలకు కేటాయింపులే లేవు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారు. కథ చెప్పినట్లే ఉంది తప్పా.. బడ్జెట్ పెట్టినట్లు లేదు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక సమయమివ్వాలని 6 నెలలపాటు అసెంబ్లీకి రాలేదు.
రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉంది. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని రూపొందించలేదు. ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదు. ఏ ఒక్క దానిపైనా క్లారిటీ లేదు. మహిళలకూ ఇచ్చిందేమి లేదు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరడతారు. కాంగ్రెస్ మోసపూరిత ఎన్నికల వాగ్ధానాలు అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదు" అని కేసీఆర్ స్పష్టం చేశారు.
తొలిసారి ప్రతిపక్ష నేతగా..
మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) వచ్చారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది.
అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వరత్వరగా జరిగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల తర్వాత ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్ కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.
అయితే ఈ నెల 23 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసలు కేసీఆర్ సమావేశాలకు హాజరు అవుతారా?... లేదా? అనే దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది. చివరకు అనుకున్న విధంగానే కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.
నేడు అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో సమావేశాలు మొదలైన తర్వాత మూడవ రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. అయితే... బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు వస్తారని.. తరువాత సభకు దూరంగా ఉండనన్నట్లు సమాచారం. మరి మరికొద్దిరోజుల పాటు జరిగే సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా?.. లేరా..? అనేది వేచి చూడాలి.
Updated Date - Jul 25 , 2024 | 02:45 PM