Regional Ring Road: ‘రింగు’కు కమిటీ.. ఇరువైపులా ఐటీ!
ABN, Publish Date - Sep 20 , 2024 | 03:13 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగంపై ఉన్నతస్థాయి కమిటీ
ఒక ఐఏఎస్, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు
మనమే నిర్మిద్దామా.. కేంద్రానికి ఇద్దామా?
అలైన్‌మెంట్, భూ సేకరణ, పరిహారం చెల్లింపుపై సర్కారు అధ్యయనం
రోడ్డుకిరువైపులా ఐటీ, పారిశ్రామిక హబ్‌లు సేకరించిన భూముల్లో రైతులకూ వాటా!
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రహదారి నిర్మాణంపై ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో రోడ్లు. భవనాలు, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్తు శాఖతో పాటు మరికొన్ని శాఖల అధికారులతో ఈ కమిటీని వేయనున్నారు. దక్షిణ భాగం రింగ్ రోడ్డును ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) తరహాలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ), హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హెచ్‌ఏఎం), బిల్డ్- ఆపరేట్- టోల్ (బీవోటీ) పద్ధతుల్లో నిర్మిస్తే ఎలా ఉంటుంది? ఈ మూడింటిలో ఏ పద్ధతి మేలు? అన్నదానిపై కమిటీ అధ్యయనం చేయనుంది.
మరోవైపు దక్షిణ భాగం రింగుకే ఐటీ, పారిశ్రామిక హంగులను కూడా అద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం రోడ్డు పొడవునా ఇరువైపులా భూములను సమీకరించి అభివృద్ధి చేసి అక్కడ ఐటీ, పారిశ్రామిక హబ్‌లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. రహదారి అలైన్‌మెంట్‌తో పాటు రోడ్డు నిర్మాణం కోసం సేకరించబోయే భూముల గుర్తింపు, పరిహారం అందజేత సహా వివిధ అంశాలపై ఈ కమిటీ లోతుగా అధ్యయనం చేయనుంది. అనంతరం రోడ్డు నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ, ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, బెంగళూరు హైవేలన్నీ అధిక భాగం ఈ మార్గంలోనే ఉండడంతో అలైన్‌మెంట్ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరించనున్నారు.
ఎలా నిర్మించాలి?
వాస్తవానికి 2017లో రాష్ట్రానికి ఆర్‌ఆర్‌ఆర్ మంజూరైనప్పుడు ఉత్తర, దక్షిణ భాగాలుగా కేంద్రం ఖరారు చేయగా.. ఇందులో తొలుత ఉత్తర భాగం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కానీ, రోడ్డు మంజూరై 6-7 ఏళ్లు గడుస్తున్నా వివిధ కారణాలతో ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. మంజూరైన ఉత్తర భాగాన్నే కేంద్రం ఆశించిన సమయానికి నిర్మించలేని కారణంగా.. దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే నిర్మిస్తే ఎలా ఉంటుందని కూడా సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాల్సి వస్తే తీసుకోవాల్సిన చర్యలు, రహదారి నిర్మాణంతో పాటు అభివృద్ధి అంశాలపైనా అధ్యయనం చేసేందుకే అధికారులతో కమిటీని నియమిస్తున్నట్లు సమాచారం. కాగా, దక్షిణ భాగం రహదారిని సొంతంగానే నిర్మిస్తే ఎలా ఉంటుంది? కేంద్రం నిర్మిస్తే ఎలా ఉండబోతుందన్న దానిపై శుక్రవారం నిర్వహించబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. రహదారిని ఎవరు నిర్మించినా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏళ్ల తరబడి రైతులు సాగు చేసుకుంటున్న భూములు లేకుండా వ్యవసాయేతర, అటవీయేతర భూములుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఈ దక్షిణ భాగంపై ప్రాఽథమికంగా ఒక రూట్‌మ్యాప్ ఉన్నా అది ఖరారు కాలేదు. దీంతో ఇప్పుడు తాజాగా మరో అలైన్‌మెంట్‌ను ప్రభుత్వం ఖరారు చేయనున్నట్లు సమాచారం. తాజా అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు ఉండనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఉన్న రూట్ మ్యాప్ ప్రకారం ఈ రహదారి చౌటుప్పల్ దగ్గర ప్రారంభమై ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డిలోని ఉత్తర భాగం రహదారికి అనుసంధానం కానుంది. ఇది మొత్తం 194 కిలోమీటర్ల పరిధిలో ఉండగా.. దీని నిర్మాణానికి దాదాపు 2 వేల హెక్టార్ల భూమి అవసరమవనుంది. భూ పరిహారం కింద రూ.6,500 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉండగా.. మొత్తం రోడ్డు నిర్మాణానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులు కావాలని అధికారుల ప్రాథమిక అంచనాల్లో తేలినట్లు సమాచారం.
పారిశ్రామిక కారిడార్లు.. రైతులకు వాటా!
దక్షిణ భాగం మంజూరు, ప్రాథమిక అలైన్‌మెంట్ నేపథ్యంలో ఈ రహదారికి ఇరువైపులా రెస్టారెంట్లు, బాంక్వెట్ హాళ్లు, స్టార్ హోటళ్లు సహా వాణిజ్య వ్యాపారాలకు అనుకూలంగా నిర్మించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అంతేకాకుండా రహదారికి ఇరువైపులా అభివృద్ధి కోసం సేకరించిన భూముల్లో రైతులకు కొంత వాటాను అందించాలని కూడా కేంద్రం భావించినట్లు సమాచారం. అదే సమయంలో జాతీయ రహదారుల నిబంఽధనల్లో వచ్చిన పలు మార్పుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు భూ సేకరణకు ముందుగానే పరిహారానికి సంబంధించిన నిధులను కేంద్రానికి డిపాజిట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే అసలు దక్షిణ భాగాన్ని సొంతంగా నిర్మిస్తే ఎలా ఉంటుందని సర్కారు అంచనా వేస్తోంది. రోడ్డు కోసం సేకరించే భూములు కాకుండా దానికి అదనంగా ఇరువైపులా మరికొన్ని భూములను సమీకరించాలనే భావనలో ఉంది.
ఫ్యూచర్‌సిటీ, ఎయిర్‌పోర్టు, బెంగళూరు ప్రధాన నగరాలకు వెళ్లేందుకు ఈ మార్గం అనుకూలంగా ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్ పార్కులు, శాటిలైట్ టౌన్‌షి్‌పలను ఏర్పాటు చేసే విధంగా ఆలోచనలు చేస్తోంది. భూములను సమీకరించి పెద్దపెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించేందుకు అవకాశం ఉంటుందని కూడా భావిస్తోంది. అంతేకాకుండా సమీకరించిన భూములను లే అవుట్‌లుగా మార్చి, ఎకరాల వారీగా వెంచర్ వేయనున్నారు. అలా వేసిన వెంచర్లలో భూమి యజమానికి కొంత వాటా ఇచ్చి, ప్రభుత్వం కొంత వాటా తీసుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ అంశాలన్నింటిపైనా కమిటీ అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.
Updated Date - Sep 20 , 2024 | 03:13 AM