ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pharma Village: లగచర్ల దాడిలో.. కేటీఆర్‌ ప్రమేయం!

ABN, Publish Date - Nov 14 , 2024 | 03:47 AM

లగచర్ల ఫార్మా విలేజ్‌ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడితో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ప్రమేయముందని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. ఘటనకు ముందు.. ఆ తర్వాత కేటీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు.

  • రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టం చేసిన పోలీసులు

  • ఫోన్‌ ఆడియో రికార్డుల్లో ఎంత ఖర్చయినా

  • ముందుకెళ్లాలని కేటీఆర్‌ ఆదేశాలు?

  • ఆ ఆదేశాలతోనే రంగంలోకి పట్నం నరేందర్‌రెడ్డి

  • వ్యూహాన్ని అమలు చేసిన సురేశ్‌రాజ్‌

  • ఏ-1గా పట్నం.. ప్రధాన కుట్రదారు ఆయనే: ఐజీ

  • నిందితుడు సురేశ్‌రాజ్‌ను ఉసిగొల్పినట్లు వెల్లడి

  • కేబీఆర్‌ పార్క్‌లో వాహ్యాళిలో ఉండగా పట్నం అరెస్టు

  • వికారాబాద్‌లో విచారణ.. తర్వాత కొడంగల్‌ కోర్టుకు

  • 14 రోజుల రిమాండ్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు

  • ఏ-2గా సురేశ్‌రాజ్‌.. నరేందర్‌రెడ్డి కాల్‌ డేటాపై ఆరా

  • కేటీఆర్‌ని నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలు!!

హైదరాబాద్‌, వికారాబాద్‌, కొడంగల్‌, బొంరా్‌సపేట్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): లగచర్ల ఫార్మా విలేజ్‌ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడితో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ప్రమేయముందని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. ఘటనకు ముందు.. ఆ తర్వాత కేటీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. న్యాయనిపుణుల సలహాతో.. ఈ కేసులో కేటీఆర్‌ను కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నరేందర్‌రెడ్డి ఐఫోన్‌-14ప్రోను సీజ్‌ చేశామని చెబుతున్న పోలీసులు.. ఫోరెన్సిక్‌ విశ్లేషణ తర్వాత లగచర్ల కేసులో ఇంకా ఎవరెవరున్నారనేది తేలుతుందంటున్నారు. తొలుత ఈ దాడి వెనక ప్రధాన సూత్రధారి బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సురేశ్‌రాజ్‌ అని పేర్కొన్న పోలీసులు.. అనూహ్యంగా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ఏ-1గా చూపించారు. సురేశ్‌ వెనక ఉంటూ.. కేటీఆర్‌ ఆదేశాలతో దాడికి కుట్ర చేసింది, కథ నడిపించింది నరేందర్‌రెడ్డి అని స్పష్టం చేశారు. పట్నం నరేందర్‌రెడ్డిపై భారత శిక్షా స్మృతి(బీఎన్‌ఎ్‌స), భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత(బీఎన్‌ఎ్‌సఎ్‌స), పీడీపీపీ చట్టాల కింద.. హత్యాయత్నం, దాడి, అధికారిక విధుల అడ్డగింత తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కేటీఆర్‌ ఆదేశాలతోనే ఈ కుట్రను అమలు చేశారని స్పష్టం చేశారు.


  • హైదరాబాద్‌లో అరెస్టు..

నరేందర్‌రెడ్డి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో వాహ్యాళిలో ఉండగా.. వికారాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, ప్రత్యేక పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. అక్కడి నుంచి నేరుగా వికారాబాద్‌లోని పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించాయి. ఉదయం 8.30 నుంచి 1.30 వరకు.. ఐదుగంటల పాటు నరేందర్‌రెడ్డిని డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని దర్యాప్తు బృందం విచారించింది. ఆ తర్వాత తమ వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలను ఆయన ముందు పెట్టి.. పలు ప్రశ్నలు సంధించింది. అదే సమయంలో.. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, ఆ తర్వాత మల్టీజోన్‌-2 ఐజీ సత్యనారాయణ కూడా నరేందర్‌రెడ్డిని విడివిడిగా విచారించారు. ‘‘అధికారులపై దాడికి ముందు బోనగాని సురేశ్‌రాజ్‌తో ఏం మాట్లాడారు? కర్రలు, కారంపొడిని సిద్ధం చేసుకోవాలని గ్రామస్థులను ప్రోత్సహించారా? దాడి జరిగిన తర్వాత సురేశ్‌ కాల్‌ చేశాడా? ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు?’’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే.. నరేందర్‌రెడ్డి విచారణకు సహకరించలేదని తెలిసింది. పలు ప్రశ్నలకు ‘‘తెలియదు’’.. ‘‘నాకు సంబంధం లేదు’’.. ‘‘కాదు’’.. అని ముక్తసరి సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ‘‘ఎమ్మెల్యేగా పనిచేశాను. కార్యకర్తలు ఫోన్‌ చేస్తుంటారు. ప్రతి ఒక్కరి ఫోన్‌ను ఆన్సర్‌ చేస్తాను’’ అని పేర్కొన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దర్యాప్తునకు సహకరించకపోవడంతో.. తమ వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలను ముందు పెట్టిన పోలీసులు.. నరేందర్‌రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నరేందర్‌రెడ్డిని పరిగి మీదుగా కొడంగల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక.. కొడంగల్‌ కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే పోలీసులు అక్కడ రిజర్వ్‌ బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నరేందర్‌రెడ్డి తరఫున బీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ న్యాయవాదులు వాదనలను వినిపించారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న జడ్జి.. నరేందర్‌రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో మంగళవారం 16 మంది రిమాండ్‌కు వెళ్లగా.. బుధవారం నరేందర్‌రెడ్డితోపాటు శివ(ఏ-3), బోగమోని మహేశ్‌(ఏ-21), బేగరి విశాల్‌(ఏ-22), నీరటి సాయిలు(ఏ-24), నీరటి రమేశ్‌(ఏ-27)లను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కాగా.. కొడంగల్‌ కోర్టు వద్ద పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. కుట్రపూరితంగా నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు. అటు కొడంగల్‌ నియోజకవర్గంలో ఇంటర్నెట్‌ సేవల బంద్‌ కొనసాగుతోంది. దీంతో.. మంగళవారం కూడా మీసేవా కేంద్రాలు, బ్యాంకులు పనిచేయలేదు.


  • మైనర్‌ బాలికపై అత్యాచారం చేసినట్టుగా సురేశ్‌పై అభియోగం

ఈ కేసులో ప్రధాన నిందితుడు బోనగాని సురేశ్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అతను పొరుగు రాష్ట్రంలో ఉన్నట్లు తెలుసుకుని, రెండు బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఒకట్రెండు రోజుల్లో సురేశ్‌ అరెస్టుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చిన్నతనం నుంచే సురేశ్‌పై వివాదాస్పదుడనే ముద్ర ఉంది. 15 ఏళ్ల క్రితం అతను ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం చేశాడనే అభియోగముంది. అప్పట్లో పెద్దలు పంచాయితీ పెట్టి, జరిమానాతో సరిపెట్టినట్లు సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాంమార్చి.. అక్కడే పెళ్లి చేసుకుని, స్థిరపడ్డాడు. పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్‌కు వచ్చాక.. సురేశ్‌ ఈ ప్రాంతంలో రాకపోకలను పెంచుకున్నాడు. నరేందర్‌రెడ్డికి అనుచరుడిగా ఉంటూ.. దుద్యాల మండల బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్నాడు.


  • సూత్రధారి నరేందర్‌రెడ్డి: ఐజీ సత్యనారాయణ

లగచర్ల ఘటన వెనక సూత్రధారి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అని మల్టీజోన్‌-2 ఐజీ వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌ వద్ద ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘తొలుత సురేశ్‌ ప్రధాన సూత్రధారి అని భావించాం. కానీ, సాంకేతిక ఆధారాలను సేకరించిన తర్వాత.. పట్నం నరేందర్‌రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడికి ఉసిగొల్పింది ఆయనే. ఆయన ఆదేశాలతోనే సురేశ్‌ స్థానికులతో కలిసి దాడికి పాల్పడ్డాడు’’ అని వివరించారు. ఇంకా ఈ కేసులో సురేశ్‌రాజ్‌, దేవదాస్‌, గోపాల్‌నాయక్‌, విఠల్‌ కీలక నిందితులని, వారిని అరెస్టు చేసేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ‘‘ప్రత్యక్ష సాక్షులు, ప్రాథమిక ఆధారాల మేరకు.. ఇప్పటి వరకు గురించిన నిందితుల్లో 19 మందికి ఈ ప్రాంతంలో అసలు భూములే లేవు. ఫార్మా క్లస్టర్‌ భూసేకరణతో వారికి ఎలాంటి నష్టం జరగదు. భూసేకరణ నోటిఫికేషన్‌లోనూ వారి పేర్లు లేవు. ఉద్దేశపూర్వకంగా కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి, లగచర్లకు తీసుకువచ్చిన సురేశ్‌, అతని సోదరుడు మహేశ్‌కు కూడా భూముల్లేవు. అసలు సురేశ్‌, దేవదాస్‌ అనే వ్యక్తులు స్థానికంగా ఉండనేఉండరు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం కుట్రను అమలు చేసి, అధికారులపై దాడి చేశారు. తొలుత 57మందిని అదుపులోకి తీసుకుని, విచారించాం. వారిలో చాలామంది అధికారులపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు’’ అని పేర్కొన్నారు. సురేశ్‌ ఓ మైనర్‌ బాలికపై లైంగిక దాడి చేశాడనే అభియోగాలపైనా దృష్టిసారిస్తామన్నారు. అమాయకులనెవరినీ అరెస్టు చేయడం లేదని వివరించారు. కాగా.. కలెక్టర్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోనూ ఈ అంశాలే ఉన్నాయి. అధికారులపై దాడి చేసిన వారిలో 17మందికి ఎలాంటి భూములు లేవని కలెక్టర్‌ వెల్లడించారు. వీరే ముందుండి దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నరేందర్‌రెడ్డి ఫోన్‌ను సీజ్‌చేసి, విశ్లేషణకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని వివరించారు.


  • బీఆర్‌ఎస్‌ విధ్వంస రచనను అడ్డుకుంటాం: తిరుపతిరెడ్డి

కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ చేస్తున్న విధ్వంస రచనను అడ్డుకుని, అభివృద్ధిని కొనసాగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు, కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి అన్నారు. అధికారులపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ.. బుధవారం ఆయన లగచర్లలో విలేకరులతో మాట్లాడారు. దాడి వెనక ఉన్న కుట్రదారులు, సూత్రధారులు ఎంతటి వారైనా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ‘‘స్వాతంత్ర్యానంతర కాలం నుంచి కొడంగల్‌ అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే.. బీఆర్‌ఎస్‌ నాయకులు ఓర్వలేక, అల్లరిచిల్లరగా తిరిగే యువకులను పోగుచేసి, వారికి మద్యం తాగించి, అధికారులపై దాడులు చేయించారు. కొడంగల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నారు’’ అని తిరుపతిరెడ్డి ఆరోపించారు. ఈ ఘటనను కాంగ్రెస్‌ సర్కారు రాజకీయం చేయదలచుకోలేదని, పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. కొడంగల్‌ అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ హబ్‌ రాబోతుందని వివరించారు. కొడంగల్‌ ఇప్పుడు కాకుంటే.. ఇంకెప్పుడూ అభివృద్ధి చెందదన్నారు. అధికారులపై దాడి చేసిన వారిలో రైతులెవరూ లేరని, అంతా విధ్వంసకారులేనన్నారు. కలెక్టర్‌ కూడా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిపారు. మల్లన్నసాగర్‌ విషయంలో హరీశ్‌, కేటీఆర్‌ రాత్రికిరాత్రే ప్రజలను తరలించిన విషయాన్ని గుర్తుచేశారు.


  • రిమాండ్‌ రిపోర్టులో కేటీఆర్‌ పేరు

పట్నం మహేందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచినప్పుడు పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ పేరు ఉండడం సంచలనంగా మారింది. కేటీఆర్‌ ఆదేశాల మేరకే తాము పనిచేసినట్లు నిందితులు వాంగ్మూలమిచ్చినట్లు పోలీసులు ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ‘‘కేటీఆర్‌ ఆదేశిస్తే.. నరేందర్‌రెడ్డి పాటిస్తూ.. వ్యూహాన్ని అమలు చేశారు. కుట్రలో భాగంగానే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, తహసీల్దార్‌, కడా అధికారి, డీఎస్పీపై దాడి చేశారు. నిందితుల కుట్ర ప్రకారం.. అధికారులను హత్య చేయాలనుకున్నా.. ఆ పథకం పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అధికారులు గాయాలతో బయటపడ్డారు. ప్రాథమిక విచారణలో నరేందర్‌రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. కేటీఆర్‌, ఇతర నాయకుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే దాడి చేశారు. దాడికి ముందు నుంచి.. ఆ తర్వాత పలుమార్లు నరేందర్‌రెడ్డి, కుట్రను అమలు చేసిన సురేశ్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నారు’’ అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేశారు.


  • ఎంత ఖర్చయినా ముందుకెళ్లండి?

కేటీఆర్‌-నరేందర్‌రెడ్డి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డులను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. దాడికి ముందు.. ఆ తర్వాత వీరిద్దరూ నాలుగు సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసు శాఖలో విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ఎంత దూరమైనా వెళ్లండి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. దాడుల విషయంలో ముందుకు వెళ్లాలి’’ అని కేటీఆర్‌ ఆదేశించినట్లు పేర్కొంటున్నాయి. మొత్తం 47 మంది నిందితులను గుర్తించినట్లు చెబుతున్న పోలీసులు.. పేర్లను వెల్లడించడం లేదు. అయితే.. ఆడియో రికార్డింగ్‌ ఆధారాలను కూడా సంపాదించిన నేపథ్యంలో.. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత.. కేటీఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 14 , 2024 | 03:47 AM