ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam Floods: కోలుకుంటున్న ఖమ్మం..

ABN, Publish Date - Sep 06 , 2024 | 04:13 AM

ప్రాణాలు అరచేత పట్టుకుని.. కట్టుబట్టలతో వెళ్లిపోయినవారంతా తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. వరద మిగిల్చిన నష్టాన్ని దిగమింగుకుని.. తమకు మిగిలిందేమిటో చూసుకుంటున్నారు.

  • నివాసాలకు చేరుతున్న బాధితులు.. వరద నష్టంపై ఇంటింటి సర్వే

  • ఇంటికే నిత్యావసరాలు.. బ్యాంకు ఖాతాల సేకరణ.. నేడు 10 వేల సాయం

ఖమ్మం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రాణాలు అరచేత పట్టుకుని.. కట్టుబట్టలతో వెళ్లిపోయినవారంతా తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. వరద మిగిల్చిన నష్టాన్ని దిగమింగుకుని.. తమకు మిగిలిందేమిటో చూసుకుంటున్నారు. కాలూచేయీ కూడదీసుకుని నివాసాలను శుభ్రం చేసుకుంటున్నారు..! మున్నేరు ఉప్పెనతో కకావికలమైన ఖమ్మం క్రమంగా కుదుటపడుతోంది. బాధితులు కోలుకుంటున్నారు. వరద దెబ్బకు వేల ఇళ్లు నేలమట్టం కాగా, అదే స్థాయిలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. సామగ్రి సర్వం కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు మునిగాయి. గత ఆదివారం పునరావాస కేంద్రాలకు వెళ్లినవారంతా ఇళ్లకు తిరిగి వచ్చారు. మున్నేరుకు ఆనుకుని ఉన్న బొక్కలగడ్డ, పద్మావతినగర్‌, వెంకటేశ్వరనగర్‌, మంచికంటినగర్‌, మోతీనగర్‌, కాల్వొడ్డు, ధంసలాపురం, రామన్నపేట, దానవాయిగూడెం, ప్రకా్‌షనగర్‌, ఖమ్మం రూరల్‌ మండలం పెద్ద తండా, జలగం నగర్‌, కరుణిగిరి, రాజీవ్‌ గృహకల్ప తదితర కాలనీలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇవి బురదలోనే ఉన్నాయి.


మిగిలిన కాలనీలు శుభ్రం కావడంతో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు చేరాయి. బాధితులను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు సాగుతున్నాయి. ఇంటింటి సర్వే ముమ్మరంగా సాగుతోంది. 7,500 ఇళ్లు ముంపునకు గురైనట్లు సర్వేలో గుర్తించారు. 15వేల నిత్యావసర కిట్లు, 10వేల దుస్తుల కిట్ల్లు అందిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వెయ్యి మంది పారిశుధ్య సిబ్బంది బురద, చెత్తను తొలగిస్తున్నారు. పారిశుధ్య పనులు 80 శాతం పూర్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అగ్నిమాపక వాహనాలతో రోడ్లు, ఇళ్లల్లో పేరుకున్న బురదను శుభ్రం చేయిస్తున్నారు. ముంపు కాలనీల్లో 90 శాతం వరకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. జిల్లాలో 15వేల కుటుంబాలు ముంపు బారిన పడ్డట్లు భావిస్తున్నారు. సర్వే తర్వాత పూర్తి లెక్క తేలనుంది. కాగా, సర్వేలో వరద బాధిత కుటుంబాలకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుంటున్నారు. శుక్రవారం నుంచి వరదసాయం రూ.10వేలు జమ చేయనున్నారు.


  • కొత్తవారు కనిపిస్తే సాయం కోసం పరుగులు

ముంపు కాలనీల్లోకి కొత్తవారు ఎవరు వెళ్లినా.. సాయం చేసేందుకు వచ్చారేమోననే ఆశతో బాధితులు పరుగులు తీస్తున్నారు. ఏమైనా ఇస్తారేమోనని, సర్వే వారు వచ్చారేమో... తమ పేర్లు ఎక్కడ నమోదు కాకుండా పోతాయోనని కంగారు పడుతున్నారు. ఆధార్‌, రేషన్‌ కార్డులు తీసుకొచ్చి ‘మాపేర్లు రాయండి’ అంటూ మహిళలు అభ్యర్థిస్తున్నారు.


  • ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటి

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు.. వరద ముంపునకు గురైన నాటి నుంచి తమతమ నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గోదావరి వరదలు-సహాయ చర్యలను పర్యవేక్షించిన అనుభవం ఉన్న తుమ్మల.. దానిని మున్నేరు వరద సహాయ కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నారు. అధికార యంత్రాగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. పొంగులేటి పాలేరు నియోజకవర్గ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యకమాలను ముమ్మరం చేస్తున్నారు.


  • నామరూపాల్లేని కోళ్ల ఫారం

నేలకొండపల్లి: పాలేరు వరద ఆ మాజీ సైనికుడిని నిలువునా ముంచింది.. రెండోసారి తీవ్రంగా నష్టపరిచింది. మాజీ సైనికుడు యడవల్లి ఉపేందర్‌ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలోని సొంత భూమిలో కోళ్లఫారం ఏర్పాటు చేసుకున్నాడు. ఆర్మీలో పనిచేసినందుకు వచ్చిన పింఛను, ఇతర డబ్బుతో దీనిని నిర్మించాడు. ఇటీవలి వరదతో 2షెడ్లు, 12 టన్నుల మొక్కజొన్న, 2,400 కోళ్లు, రూ.2 లక్షల విలువైన సోలార్‌ సిస్టం సహా మొత్తం సామగ్రి కొట్టుకుపోయాయి. రూ.25 లక్షల దాకా నష్టపోయాడు. గత వరదల్లోనూ భారీగా దెబ్బతిన్నానని.. సాయం చేసి ఆదుకోవాలని ఉపేందర్‌ అధికారులను కోరుతున్నాడు. ఖమ్మం కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశాడు.

Updated Date - Sep 06 , 2024 | 04:13 AM

Advertising
Advertising