Kiran Kumar Reddy: ‘అమరరాజా’కు సహకారం అందిస్తాం
ABN, Publish Date - Aug 13 , 2024 | 03:57 AM
రాష్ట్రానికి వస్తున్న కొత్త కంపెనీలతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న కంపెనీలకూ తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న కంపెనీలకూ మద్దతు
సీఎం రేవంత్ విదేశీ పర్యటన విజయవంతం.. కావడాన్ని ఓర్వలేకపోతున్న బీఆర్‌ఎస్: చామల
కేటీఆర్ ఒప్పందం చేసుకొచ్చిన కంపెనీలన్నీ
ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి: ఆది శ్రీనివాస్
హైదరాబాద్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి వస్తున్న కొత్త కంపెనీలతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న కంపెనీలకూ తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అమరరాజా కంపెనీకి ప్రభుత్వం నుంచి సహకారం అవసరమైతే అందజేస్తామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన విజయవంతమైందని తెలిపారు. దీనిని ఓర్వలేక బీఆర్‌ఎస్ నేతలు వారి సోషల్ మీడియా బృందాల ద్వారా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘‘కేసీఆర్ బిడ్డ కవితను ఈడీ అరెస్టు చేసినప్పటి నుంచి వారికి ఈడీ, సీబీఐ, మనీలాండరింగ్ తప్ప మరొకటి గుర్తుకు రావడం లేదు. చేసిన అవినీతి అక్రమాలకు జైలుపాలైనా వాళ్లకు సిగ్గు రావడంలేదు’’ అంటూ ధ్వజమెత్తారు. కాగా, కేటీఆర్ రాసిచ్చిన స్ర్కిప్టును చదువుతూ.. రేవంత్‌ను తక్కువ చేసి చూపించేందుకు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సీఎల్పీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో కేటీఆర్ ఎంవోయూ కుదుర్చుకొచ్చిన కంపెనీలకు సరైన వసతులు కల్పించకపోవడంతో అవి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. దుబాయి వెళ్లి సొంత బిల్డింగ్‌లు కొనుక్కున్న వారితో సీఎం రేవంత్‌కు పోలికా? అని ప్రశ్నించారు.
Updated Date - Aug 13 , 2024 | 03:57 AM