Kishan Reddy: పేదల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు
ABN, Publish Date - Sep 27 , 2024 | 03:57 AM
పేదలు జీవిత కాల సంపాదనతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.
హఠాత్తుగా అక్రమ నిర్మాణం అంటే వాళ్లు ఎక్కడకు వెళ్లాలి
రూ.కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు ఎలా కల్పించారు?
జీహెచ్‌ఎంసీ అనుమతులను ‘హైడ్రా’ తప్పు పడుతుందా?
సీఎంరేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): పేదలు జీవిత కాల సంపాదనతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు ఇచ్చిన అనుమతులు తప్పని ‘హైడ్రా’ ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. ఒక సంస్థ అనుమతులిస్తే.. కొత్తగా మరో సంస్థను ఏర్పాటు చేసి, అక్రమమంటూ కూలగొట్టడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలో అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వాలైనా పేదలకు ఇళ్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజీలు, బ్రిడ్జ్జిలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలను నిర్మిస్తాయని, ఈ సర్కారు హైడ్రా పేరుతో.. నిర్మాణాలను తొలగిస్తూ ఏకపక్షంగా వెళ్తోందని తప్పుబట్టారు.
హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో బాధితులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, మేధావుల ఆలోచనలు, మీడియా ద్వారా తెలుసుకున్న అంశాలతో కిషన్‌రెడ్డి గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. పేదల ఆందోళన, ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. పైగా హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించడాన్ని తప్పుబట్టారు. ‘‘బీఆర్‌ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసింది. దీన్ని సాకుగా చూపి, మౌలిక వసతుల కల్పనకు డబ్బుల్లేవంటున్నారు. అక్రమ కట్టడాల పేరిట ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం.
అయితే, వాటిపై తీసుకునే చర్యలు న్యాయబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా.. పేద, మధ్య తరగతి ప్రజల విషయంలో వీటి ఆధారంగానే పని చేయాలి’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తప్పుడు లే అవుట్‌లతో మభ్యపెట్టి, పెట్టుబడులు పెట్టించి స్థలాలు, ఫ్లాట్లు అమ్మినవారిని కూడా బాధ్యులను చేసేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. పేదలపై ప్రతాపం చూపకుండా హైడ్రా తొలుత వారితో మాట్లాడాలన్నారు. ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
కోట్లు ఖర్చుపెట్టి వసతులు కల్పించారుగా?
ఇప్పుడు అక్రమ నిర్మాణాలుగా చెబుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి రోడ్లు, వీధి దీపాలు, తాగు నీరు, డ్రైనేజీ, విద్యుత్తు కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, చివరకు ఇంటి నంబర్లను కూడా ఇచ్చిందని కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. దశాబ్దాలుగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల ద్వారా పన్నులు తీసుకుంటూ హఠాత్తుగా అక్రమం అంటే పేద, మధ్య తరగతి ప్రజలు ఏమైపోవాలి? అని నిలదీశారు. అప్పులు చేసి, బ్యాంక్ రుణాలు పొంది.. ఫ్లాట్లు, అపార్టుమెంట్లు కొనుక్కున్నారని.. కొన్నిచోట్ల అన్ని అనుమతులున్న భవనాలనూ నేలమట్టం చేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పరివాహకంలో 15 వేలపైగా పేద, మధ్య తరగతి కుటుంబాలున్నాయని.. వారి నివాసాలను హైడ్రా ద్వారా కూల్చేముందు చర్చించాలని కోరారు. 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్, పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మోసానికి ప్రజలు బలయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ తీసుకునే నిర్ణయం.. అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.
Updated Date - Sep 27 , 2024 | 03:57 AM