Kishan Reddy: పేదల ఇళ్లపైకి వస్తే తీవ్ర పరిణామాలే!
ABN, Publish Date - Oct 03 , 2024 | 04:07 AM
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సుందరీకరణ పేరుతో ఇళ్లను కూలుస్తామంటే ఊరుకోం
రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
గోల్నాక డివిజన్‌లో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన
గోల్నాక, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేద ప్రజల పక్షాన నిలబడతామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. బుధవారం అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్‌లోని మూసీ పరివాక ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటించి, బాధితులను పరామర్శించారు. ఇళ్లను కూల్చేసి, తమను రోడ్డున పడేస్తామంటున్నారంటూ బాధితులు కేంద్ర మంత్రితో చెప్పుకొన్నారు. ఇదేం న్యాయమని వాపోయారు.
వారి బాధలు విన్న కిషన్‌రెడ్డి.. ‘మీరెవరూ అధైర్యపడొద్దు. మీ ఇళ్లు కూల్చివేయకుండా నేను మీకు అండగా ఉంటా’ అని భరోసా ఇచ్చారు. మూసీ సుందరీకరణను ఎవరు కోరుకున్నారని ఆయన సీఎంను ప్రశ్నించారు. సుందరీకరణ చేయాలంటే పేదల ఇళ్లను కూల్చనక్కర్లేదన్నారు. రూ.1.50 లక్షల కోట్లు వెచ్చించి సుందరీకరణ చేయాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న మూసీకి ప్రహారీ గోడలను నిర్మించి సుందరీకరణ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిక్కుమాలిన చర్యను విరమించుకోవాలన్నారు. మూసీ పరివాక ప్రాంతాల్లో మూడు తరాల వారు నివాసం ఉంటున్నారని, ఇప్పుడు వారి ఇళ్లను కూల్చాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
పేదల ఇళ్లను కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రూ.50 వేల కోట్లు వెచ్చించి గూడు లేని పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదవాడి ఇంటిపైకి బుల్డోజర్ వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. పేదల సమాధులపై మొక్కలు పెట్టి సుందరీకరణ చేయాలనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. కాగా, వేరొక కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్వచ్ఛభారత్ దివస్ సందర్భంగా వేదుల స్ఫూర్తి దియా తీసిన ‘టుమారో విల్‌నాట్ కేర్ ఇట్ సెల్ఫ్’ అనే షార్ట్ ఫిల్మ్‌ను బుధవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. పర్యావరణం పట్ల అలసత్వం వహిస్తే భవిష్యత్తులో తలెత్తే పరిణామాలపై స్ఫూర్తి దియా షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Oct 03 , 2024 | 04:07 AM