GHMC: 4 కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ విభజన
ABN, Publish Date - Oct 05 , 2024 | 03:27 AM
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను (జీహెచ్‌ఎంసీ) వచ్చే ఎన్నికల నాటికి నాలుగు కార్పొరేషన్లుగా విభజిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.
వచ్చే ఎన్నికల నాటికి.. మహా నగరానికి నలుగురు మేయర్లు!
రాజధాని దశ, దిశ మార్చేలా నిర్ణయాలు: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను (జీహెచ్‌ఎంసీ) వచ్చే ఎన్నికల నాటికి నాలుగు కార్పొరేషన్లుగా విభజిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల నాటికి హైదరాబాద్ మహా నగరంలో నలుగురు మేయర్లు ఉంటారని ఆయన తెలిపారు. అసోచాం ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో శుక్రవారం జరిగిన ‘‘అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్-2024’’కు ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి.. రాష్ట్ర సుస్థిరాభివృద్ధి దిశగా ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
గత పదేళ్ల తెలంగాణ విధ్వంసాన్ని సరిదిద్దేందుకు అహర్నిశలూ శ్రమిస్తూ సమ్మిళిత, సుస్థిరాభివృద్థి లక్ష్యాలవైపు సాగుతున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అర్బన్ కల్చర్‌కు అనుగుణంగా తెలంగాణలో కూడా పట్టణీకరణ జరగవలసిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డ ఆయన.. హైదరాబాద్ దశ, దిశను మార్చేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 40 శాతం ప్రస్తుతం ఓఆర్‌ఆర్ పరిధిలో నివసిస్తున్నదని.. 2028 నాటికి అది 50 శాతం దాటే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా హైదరాబాద్‌లో పట్టణ విస్తరణ, మౌళిక వసతులను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు స్పీడ్ (స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫీషీయంట్, ఎఫెక్టివ్ డెలివరీ)-19 పేరుతో మూసీ సుందరీకరణ, కొత్త విమానాశ్రయాల నిర్మాణం తదితర అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ప్రజలు, వివిధ సంస్థల భాగస్వామ్యంతో సమిష్టిగా శ్రమించి తెలంగాణను ప్రగతిపథంలో నడిపిస్తామని కోమటిరెడ్డి తెలిపారు. మూసీని ప్రక్షాళన చేస్తామని జైకా నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు.. అధికారం పోగానే మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఆనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. రాజకీయాలు చేయడం తగదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాగా.. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సుల్ జనరల్ (చీఫ్ పొలిటికల్- ఎకానమిక్ సెక్షన్) ఫ్రాంక్ పి టల్లూటో, ఫోనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి, అలార్డ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పూనమ్ కశ్యప్, రాంబాబు బూరుగు, అసోచాం రాష్ట్ర ప్రతినిధి దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 05 , 2024 | 03:27 AM