Ts Assembly: మమ్మల్ని రెచ్చగొట్టి, పార్టీని చీల్చే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలపై రాజగోపాల్ రెడ్డి విసుర్లు
ABN, Publish Date - Feb 14 , 2024 | 01:01 PM
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ్యులు కడియం శ్రీహరి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. మేడిగడ్డ సందర్శన నుంచి డైలాగ్ వార్ ప్రారంభమైంది. శాసన సభ్యులు కడియం శ్రీహరి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raja Gopal Reddy) ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జోక్యం కలుగుజేసుకుని సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలని చెప్పినప్పటికీ వినిపించుకోని పరిస్థితి నెలకొంది.
చీడ పురుగు- నాశనం చేశావు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రాజగోపాల్ రెడ్డి తన గురించి మాట్లాడటం సరికాదని శ్రీహరి సూచించారు. సబ్జెక్ట్ మాట్లాడాలని చెబుతూనే వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారని శ్రీహరి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చీడ పురుగు రాజగోపాల్ రెడ్డి అని మండిపడ్డారు. ఆ పార్టీని నాశనం చేసింది రాజగోపాల్ అని ఫైరయ్యారు. ఆ వెంటనే మైక్ అందుకున్న రాజగోపాల్ రెడ్డి దుమ్ము దులిపేశారు.
పార్టీ చీల్చే ప్రయత్నం
తనకు మంత్రి పదవి గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదని రాజగోపాల్ రెడ్డి స్టార్ట్ చేశారు. మొన్న హరీశ్ రావు అన్నారు.. ఈ రోజు కడియం శ్రీహరి అంటున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి అనేది పార్టీ అంతర్గత విషయం, పార్టీ, ముఖ్యమంత్రి కలిసి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని రెచ్చగొట్టి, పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని రాజగోపాల్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల్లో విషం దాగి ఉందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని అని, పదవుల కోసం ఏ రోజు పాకులాడలేదని తేల్చిచెప్పారు.
మంత్రి పదవి-టికెట్
తాటికొండ రాజయ్యను శ్రీహరి అవమానించారని రాజగోపాల్ స్పష్టంచేశారు. గతంలో మంత్రి పదవిని తీసి వేయించారు. ఇటీవల పార్టీ టికెట్ రాకుండా అడ్డుకున్నారని వివరించారు. పచ్చ కామెర్లు ఉన్న వ్యక్తి అలా మాట్లాడతారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడాన్ని కొందరు జీర్ణించుకోవడం లేదని రాజగోపాల్ విరుచుకుపడ్డారు. పదేళ్లలో ఆగమైన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నావని వివరించారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టిందని రాజగోపాల్ దుమ్మెత్తి పోశారు. తమది పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం రాష్ట్రంలో కొనసాగుతోందని స్పష్టంచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 14 , 2024 | 01:01 PM