Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులు నవంబరులో ప్రారంభం
ABN, Publish Date - Aug 22 , 2024 | 03:28 AM
హైదరాబాద్ - విజయవాడ (ఎన్‌హెచ్- 65) రోడ్డు పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపిందని.. రెండు నెలల్లో టెండర్లు పిలిచి నవంబరు నాటికి పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ - విజయవాడ (ఎన్‌హెచ్- 65) రోడ్డు పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపిందని.. రెండు నెలల్లో టెండర్లు పిలిచి నవంబరు నాటికి పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ దాదాపు పూర్తయ్యిందని, మిగిలిన కాస్త భూసేకరణ వచ్చేనెల 15 నాటికి పూర్తిచేసి కేంద్రానికి పంపిస్తామని, ఆ వెంటనే టెండర్లకు నోటిఫికేషన్ వస్తుందని పేర్కొన్నారు.
దక్షిణ భాగానికి సంబంధించి భూసేకరణను ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా అలైన్‌మెంట్ ఉండాలని అధికారులకు సీఎం సూచించారని చెప్పారు. ఇకనుంచి ఉత్తర, దక్షిణ భాగానికి సంబంధించిన ఆర్‌ఆర్‌ఆర్ పనులపై రోజువారీగా సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రంలో చేపట్టిన అన్ని జాతీయ రహదారుల పనులను ముందుకు తీసుకెళ్లేలా సహకరించాలని కోరుతామన్నారు.
Updated Date - Aug 22 , 2024 | 03:28 AM