Komatireddy Venkat Reddy: మూసీ ప్రక్షాళనకు హరీశ్, కేటీఆర్ మోకాలడ్డు
ABN, Publish Date - Oct 08 , 2024 | 04:07 AM
మూసీని ప్రక్షాళన చేసి రోగాల బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లు అడ్డుపడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.
వారిద్దరూ మూసీ వద్ద నెల రోజులు కిరాయికి ఉంటే పేదల బాధలు తెలుస్తాయి
రోడ్లు, భవనాలశాఖ మంత్రి వెంకట్‌రెడ్డి
దేవరకొండ, అక్టోబరు 7: మూసీని ప్రక్షాళన చేసి రోగాల బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లు అడ్డుపడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వారిద్దరూ నెల రోజులు మూసీ వద్ద ఇల్లు కిరాయి తీసుకుని ఉంటే పేదలు పడే బాధలు తెలుస్తాయని విమర్శించారు. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరతామన్నారు. హరీశ్‌రావు మూసీని అడ్డుకునేందుకు ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీ ఇంటి వద్ద ధర్నా చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు.
సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ, మాల్ నూతన మార్కెట్‌కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పదేళ్లలో శ్రీశైలం సొరంగమార్గాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. రూ.2వేల కోట్లు కేటాయిస్తే సొరంగమార్గం ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు కేటాయించారని, సొరంగమార్గానికి నిధులు కేటాయించాలని అడిగినా పట్టించుకోని దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. తమ ప్రభుత్వం 30 నెలల్లో శ్రీశైలం సొరంగమార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లా ప్రజలకు సాగునీరు అందిస్తుందని చెప్పారు. వారంలోగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
Updated Date - Oct 08 , 2024 | 04:07 AM