KTR: లగచర్ల బాధితుల పక్షాన పోరాడతాం
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:57 AM
భూములివ్వబోమని చెప్పిన దళిత, బలహీనవర్గాల రైతులను రేవంత్ సర్కారు జైల్లో పెట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
చర్చ పెట్టకుండా సీఎం పారిపోయారు
రైతులకు క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): భూములివ్వబోమని చెప్పిన దళిత, బలహీనవర్గాల రైతులను రేవంత్ సర్కారు జైల్లో పెట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వారిపై కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమన్నారు. కొడంగల్ ప్రజల తరఫున బీఆర్‌ఎస్, కేసీఆర్ ఉన్నారని.. అక్కడి రైతుల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ, అరాచక తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. లగచర్ల రైతులు ముగ్గురు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని, ఓ రైతుకు గుండెపోటు వస్తే బేడీలతో చికిత్స చేయించారని ధ్వజమెత్తారు. కొడంగల్ మీ జాగీరా..? రైతుల భూములు గుంజుకుంటారా? అని నిలదీశారు. లగచర్ల రైతుల అంశంపై చర్చించాలని పట్టుబట్టినా చర్చ పెట్టలేదని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ జరపాల్సి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి సభను వాయిదా వేసుకొని పారిపోయారని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలను సేకరించి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వమే వద్దన్నదని, రైతులకు రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. లగచర్ల రైతుల అంశంపై చర్చించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో సభను వాయిదా వేశారు. దీంతో వారు శాసనసభ లోపలికి వెళ్లే దారిలో బైఠాయించి నిరసన తెలిపారు.
భట్టిపై హక్కుల ఉల్లంఘన నోటీసు
అప్పులపై సభను తప్పుదోవ పట్టించినందుకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ నోటీసుపై చర్చకు అనుమతించాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కోరినట్లు చెప్పారు. అప్పులపై తప్పుడు ప్రకటన చేసినందుకు మంత్రి భట్టిపై చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో వెళ్లి స్పీకర్‌ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. శాసనసభ నియమావళిలోని 168(1) నిబంధన ప్రకారం ఆర్థిక మంత్రికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ అప్పులు రూ.3.89 లక్షల కోట్లు అని ఆర్‌బీఐ చెబితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.7 లక్షల కోట్లు అంటూ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. అప్పులపై నెలకు రూ.6,500 కోట్లు వడ్డీ కడుతున్నట్లు సీఎం, భట్టి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. నెలకు రూ.2100 కోట్లు మిత్తి కడుతున్నట్లు కాగ్ చెబితే, రూ.2400 కోట్లని ఆర్‌బీఐ చెప్పిందని గుర్తుచేశారు. రేవంత్ సీఎం అయ్యాక ఢిల్లీలో పర్యాటక రంగం, రాష్ట్రంలో జైలు పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి 30 సార్లు, మిగతా మంత్రులంతా కలిసి 70సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారని, అందరూ కలిసి వందసార్లు వెళ్లినా వంద పైసలు కూడా తీసుకురాలేదని గుర్తుచేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో భట్టి విధానపరమైన ప్రకటన చేయడం బాధ్యతారాహిత్యమే అన్నారు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12వేలసాయం చేస్తామని సభలో కాకుండా మధిరలో ఎలా ప్రకటిస్తారని నిలదీశారు.
నేడు అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు
రైతులపై కేసులుపెట్టి, వారికి బేడీలు వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉదయం 11 గంటలకు అన్ని నియోజకవర్గాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు బీఆర్‌ఎస్ ప్రకటించింది. లగచర్లపై ఇచ్చిన వాయిదా తీర్మానం మీద చర్చకు అనుమతించాలంటూ బీఆర్‌ఎస్ సభ్యులు శాసనమండలిలో నినాదాలు చేశారు. గందరగోళం నెలకొనడంతో మండలిని మంగళవారానికి వాయిదా వేశారు. రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు మండలి చైర్మన్ చాంబర్ ఎదుట ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బీడీఎల్ సంస్థ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను అదానీ వైపు నడిపిందన్నారు. జనవరి మొదటి వారంలో కార్మికుల కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Updated Date - Dec 17 , 2024 | 03:57 AM