రేవంత్, పొంగులేటి పదవులు ఊడతాయ్
ABN, Publish Date - Nov 13 , 2024 | 03:36 AM
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పదవులు త్వరలో ఊడిపోవడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
అమృత్ టెండర్లలో అవినీతిపై కేంద్రం చర్యలేవీ?
ఈ ఫిర్యాదు తొలిఎపిసోడే.. త్వరలో స్కాంలపై సీరియల్స్
పొంగులేటి.. అదానీ కాళ్లు పట్టుకున్నది నిజం కాదా?
ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై ప్రధాని మోదీ మౌనం ఎందుకు?
ఏ విచారణకైనా నేను సిద్ధం.. ఏం చేస్తారో చేసుకోండి
కలెక్టర్‌పై దాడి జరగడం ఎప్పుడైనా చూశామా?: కేటీఆర్
అల్లుడి కోసం ప్రజల భూముల్ని లాక్కుంటారా..అని ట్వీట్
న్యూఢిల్లీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పదవులు త్వరలో ఊడిపోవడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో అమృత్ టెండర్లలో అక్రమాలపై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు చేశామని, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కేసులో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయని తెలిపారు. ఇది కేవలం మొదటి ఎపిసోడ్ మాత్రమేనని, త్వరలో వివిధ కుంభకోణాలపై ధారావాహికలు ఉంటాయని చెప్పారు. అమృత్ పథకం టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎంపీలు సురేశ్‌రెడ్డి, రవిచంద్ర, దామోదర్‌రావుతో కలిసి కేటీఆర్ ఢిల్లీలో మాట్లాడారు. సీఎం రేవంత్ తన బావమరిది సృజన్‌రెడ్డికి అమృతం పంచి.. కొడంగల్ ప్రజలకు విషం పంచుతున్నారని మండిపడ్డారు. కేవలం రూ.2 కోట్ల లాభాల్లో ఉన్న సృజన్‌రెడ్డి కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రేవంత్‌రెడ్డి కొడంగల్ ప్రజలను బలిపెట్టి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్‌పై దాడి చేసే పరిస్థితి గతంలో తెలుగు రాష్ట్రంలో మనం ఎప్పుడైనా చూశామా? అని అన్నారు. పొలిటికల్ బాంబులు పేలుతాయంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఈడీ కేసులో ఏం చేశారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ వాళ్లు ముందుగా మంత్రి పొంగులేటి నివాసంపై ఈడీ దాడుల కేసు ఏమైందో చెప్పాలి. ఈడీ దాడుల నుంచి బయటపడేందుకు మంత్రి పొంగులేటి.. అదానీ కాళ్లు పట్టుకుంది వాస్తవాం కాదా?’’ అని కేటీఆర్ అన్నారు.
ఢిల్లీకి బరాబర్ వస్తా..
కాంగ్రెస్ అవినీతిని దేశ ప్రజల ముందు పెట్టేందుకు తాను బరాబర్ ఢిల్లీకి వస్తానని కేటీఆర్ తెలిపారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు 26 సార్లు ఢిల్లీ వచ్చారు. కానీ, 26 పైసలైనా తెచ్చారా? మేం వస్తే ఎందుకంత భయం?’’ అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయొద్దని, ప్రాంతీయ పార్టీలకు మద్దతివ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా డబ్బులు తీసుకెళుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్టులను మరింత పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కోరారు. కేసీఆర్ నామస్మరణ చేయకపోతే రేవంత్‌రెడ్డికి ఒక్కపూట కూడా గడవదన్నారు. రాష్ట్రంలో హామీలు అమలు చేయకుండా మహారాష్ట్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.300 కోట్ల ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. కుల గణనకు తాము వ్యతిరేకం కాదని, కానీ.. వ్యక్తిగత సమాచారాన్నిసేకరించడం సరికాదని అన్నారు. ప్రైవేటు వ్యక్తులతో సమాచారం సేకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ‘మాన్యువల్ పెగాసెస్’ అని కేటీఆర్ అభివర్ణించారు.
ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై చర్యలెందుకు తీసుకోరు?
తెలంగాణలో ఆర్‌ఆర్ (రాహుల్-రేవంత్) ట్యాక్స్ నడుస్తోందని స్వయంగా చెప్పిన ప్రధాని మోదీ.. దీనిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌కి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సంజయ్ రక్షణ కవచంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను గొర్రెల మాదిరిగా కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అంటున్నారని, కానీ.. దేశంలో పెద్ద గొర్రెల మండీ తెలంగాణయేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఖర్గే స్పందించాలని డిమాండ్ చేశారు. తనపై పదే పదే ఆరోపణలు చేయడం కాదని, ఏ విచారణకైనా సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ చేశారు.
Updated Date - Nov 13 , 2024 | 03:37 AM