Formula-E Racing: టార్గెట్ కేటీఆర్
ABN, Publish Date - Nov 07 , 2024 | 02:34 AM
ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అప్పటి మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్.. నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే విదేశీ కంపెనీలకు రూ.55 కోట్లు బదిలీ చేశామని చెప్పడం ఇప్పుడు కేటీఆర్‌కు చుట్టుకోనుందా?
ఫార్ములా-ఈ కేసులో బిగుస్తున్న ఉచ్చు!
మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే విదేశీ కంపెనీలకు నిధులు
రూ.55 కోట్లు బదిలీ చేసిన మునిసిపల్ శాఖ
గవర్నర్ అనుమతితో కేసులో ముందుకు అడుగులు!
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అప్పటి మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్.. నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే విదేశీ కంపెనీలకు రూ.55 కోట్లు బదిలీ చేశామని చెప్పడం ఇప్పుడు కేటీఆర్‌కు చుట్టుకోనుందా? నేడోరేపో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి, విచారిస్తారా? గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఈ ప్రశ్నలకు బుధవారం చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఔననే చెబుతున్నాయి. కాగా, ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్‌కు అంతర్జాతీయ బ్రాండింగ్ వస్తుందని గత ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. పెట్టుబడులు, అంతర్జాతీయ పర్యాటకం పెరుగుతుందని పేర్కొంది. 2023లో తొలిసారి రేస్ నిర్వహించిన ప్రభుత్వం.. 2024లో మరోసారి నిర్వహణకు విదేశీ సంస్థలతో రూ.100 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ క్రమంలో ముందస్తుగా రూ.55 కోట్లను రేస్ నిర్వహణలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించిన మునిసిపల్ శాఖ ద్వారా చెల్లించింది. గత ఏడాది డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలినాళ్లలోనే ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దాంతో.. ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి విదేశీ కంపెనీలతో ఉన్న ఒప్పందాలను రద్దుచేసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో మునిసిపల్ శాఖ ఈ వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయడానికి ఏసీబీ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరడం.. సర్కారు ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. రంగంలోకి దిగిన ఏసీబీ.. రెగ్యులర్ ఎంక్వైరీ(ఆర్‌ఈ)ని మొదలు పెట్టి, ఈ కేసుకు సంబంధించిన పత్రాలను, ఇతర భౌతిక, సాంకేతిక ఆధారాలను సేకరించింది. అయినా.. కేసు ఏ స్థాయిలోనూ వీగిపోకుండా ఉండేందుకు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటోంది. విదేశీ సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసి, ప్రశ్నించేందుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులను పరిశీలిస్తోంది.
గవర్నర్ అనుమతి కూడా..
సాధారణంగా.. శాసన సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు సభాహక్కుల కారణంగా ఎమ్మెల్యేలను దర్యాప్తు సంస్థలు విచారించడం కుదరదు. స్పీకర్ అనుమతి అవసరం ఉంటుంది. అయితే.. ఇతర సమయాల్లో ఎమ్మెల్యేను విచారించడానికి గవర్నర్, స్పీకర్ అనుమతులు అవసరం లేదు. అయినా.. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గవర్నర్ అనుమతికి ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గవర్నర్ అనుమతి రాగానే.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఎమ్మెల్యే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి, విచారించేందుకు సిద్ధమవుతున్నారు. కేటీఆర్ ఇచ్చే వాంగ్మూలం(స్టేట్‌మెంట్) మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అర్వింద్‌కుమార్ వివరణతోనే..
నిబంధనల ప్రకారం ప్రభుత్వం విదేశీ సంస్థకు నగదు చెల్లించాలంటే.. ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి. ఫార్ములా-ఈ వ్యవహారంలో అందుకు భిన్నంగా రూ.55 కోట్ల చెల్లింపులు జరపడంపై సీఎస్ శాంతికుమారి అప్పటి మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు మెమో జారీ చేశారు. దానికి అర్వింద్‌కుమార్ వివరణ ఇస్తూ.. ‘‘అప్పటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే విదేశీ సంస్థలకు చెల్లింపులు చేశాం’’ అని పేర్కొన్నారు. దీని ఆధారంగా కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించింది. కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత.. రోజుల వ్యవధిలోనే అరెస్టు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా ఎప్పటికప్పుడు తాను అరెస్టు కావడం ఖాయమని, అందుకు ఏ మాత్రం భయపడేది లేదని చెబుతున్నారు.
మంత్రులు సైతం బాంబులు పేలుతాయని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏసీబీ చర్యలు అత్యంత కీలకంగా మారుతాయని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఫార్ములా-ఈ రేస్‌కు అదే స్థాయిలో ప్రచారం కల్పించేందుకు గత ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులను ఖర్చు చేసింది. సినీ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రమోషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఎంత ఇచ్చారనే వివరాలను రాబట్టాలని ఏసీబీ నిర్ణయించింది. ఆ తర్వాత సెలబ్రిటీలను విచారించి, వారి వాంగ్మూలాలను సేకరించే అవకాశాలున్నాయి. అంతేకాదు.. విదేశీ కంపెనీలకు నిధులు అందజేయడంలో ఎవరైనా కమీషన్లు తీసుకున్నారా? డబ్బులు ఎలా చేతులు మారాయి? అనే కోణంపైనా ఏసీబీ దృష్టి సారించింది.
Updated Date - Nov 07 , 2024 | 02:34 AM