Share News

తెలంగాణలో రేవంత్‌ కుటుంబం దోపిడీ

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:19 AM

తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం దోచుకుంటోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అయ్యప్ప సొసైటీలో ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని, కమీషన్లు, సెటిల్‌మెంట్ల దందా

తెలంగాణలో రేవంత్‌ కుటుంబం దోపిడీ

రేవంత్‌ కుటుంబం దోపిడీ

కాంగ్రె్‌స పార్టీకి ఓటు వెయ్యలేదనే

కక్షతో పేదల ఇళ్ల కూల్చివేత

కేసీఆర్‌ రావాలని ప్రజలు కోరుతున్నారు

అరికెపూడికి కండువా కప్పిన సన్నాసెవరు?

ఏపీలో బాబు.. వారంలోనే పింఛన్ల పెంపు

ఇక్కడ పది నెలలైనా రేవంత్‌కు చేతకాలే

వైద్య ప్రవేశాలపై మొద్దునిద్ర వీడేదెప్పుడు?

రాష్ట్ర సర్కారుపై కేటీఆర్‌ ధ్వజం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం దోచుకుంటోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అయ్యప్ప సొసైటీలో ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని, కమీషన్లు, సెటిల్‌మెంట్ల దందా నడిపిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గతంలో తనతో చెప్పారని తెలిపారు. సీఎం, ఆయన బంధువులు చేస్తున్న దౌర్జన్యాలతో తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అయిందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ప్రజలు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గెలిపించారన్న కారణంతో వారిపై రేవంత్‌రెడ్డి సర్కారు పగబట్టినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. హైడ్రా పేరుతో పేదల బతుకులను రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘హైడ్రాకు అందరూ సమానమని చెబుతూనే.. సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డికి మాత్రం ముందుగా నోటీసులిచ్చారు. పేదల ఇళ్లను మాత్రం పిల్లలు పుస్తకాలు తెచ్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా కూలుస్తున్నారు’’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్‌ నేతలు పట్నం మహేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను కూలగొట్టాలని సవాల్‌ విసిరారు. పేదల ఇళ్లను కూల్చివేస్తే బీఆర్‌ఎస్‌ ఊరుకోదని, బాధితులకు అండగా పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్‌ కనిపిస్తూనే ఉంటారు. ఆయన ఆనవాళ్లు చెరిపేయడం మీ వల్లకాదు చిట్టినాయుడూ’’ అని వ్యాఖ్యానించారు.


ఆ ఎమ్మెల్యేల బతుకు బస్టాండే..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల బతుకు బస్టాండ్‌ అయిందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘మనం మనోడు కాదంటున్నాం. కాంగ్రెస్‌ వాళ్లూ మావాడు కాదంటున్నారు. దీంతో వాళ్లు ఎటూ కాకుండా పోయారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’’ అని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారన్న మంత్రి శ్రీధర్‌బాబు.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి, దౌర్భాగ్యుడు ఎవరో చెప్పాలన్నారు. వృద్ధులకు పింఛన్‌ పెంచుతామని ఇచ్చిన హామీని ఏపీలో సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే అమలు చేశారని కేటీఆర్‌ తెలిపారు. ఇక్కడ రేవంత్‌కు మాత్రం చేతెనైతలేదని విమర్శించారు. ఇక వైద్య విద్య ప్రవేశాలకు నిర్ణీత గడువు ముగుస్తోందని, ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడెదెప్పుడంటూ కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. కాగా, బండి సంజయ్‌ కేంద్ర హోంశాఖ సహాయమంత్రిననే విషయాన్ని మరిచిపోయారంటూ కేటీఆర్‌ విమర్శించారు. అమృత్‌లో అవినీతి జరిగిందని ముందుగా చెప్పింది బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అని, కానీ.. ఆయన ఇప్పుడు దొంగపిల్లిలా కళ్లు మూసుకున్నారని వ్యాఖ్యానించారు. తాము మొత్తం ఆధారాలతో బయటపెట్టాక చిల్లర మాటలెందుకని, సీవీసీకి సిఫారసు చేయడమెందుకని ప్రశ్నించారు.

Updated Date - Sep 25 , 2024 | 04:19 AM