ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: హై‘డ్రామా’లొద్దు..

ABN, Publish Date - Sep 26 , 2024 | 04:14 AM

హై‘డ్రామా’లు పక్కన పెట్టి హైదరాబాద్‌ బాగుచేసేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రభుత్వానికి సూచించారు.

హైదరాబాద్‌ను బాగుచేయండి

  • బాధితులకు బీఆర్‌ఎస్‌ న్యాయ సహాయం

  • మానవత్వం లేకుండా కూల్చేస్తున్నారు: కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/హైదర్‌నగర్‌/హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): హై‘డ్రామా’లు పక్కన పెట్టి హైదరాబాద్‌ బాగుచేసేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రభుత్వానికి సూచించారు. హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని, పార్టీ లీగల్‌ సెల్‌ ద్వారా న్యాయపరమైన సహకారం అందిస్తామన్నారు. బంజారాహిల్స్‌లోని బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలో బాధితులు సంప్రదించాలని పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్‌, ఖాజాకుంట వద్ద నిర్మించిన ఎస్‌టీపీలను మాజీ మంత్రులు సబిత, తలసాని, బీఆర్‌ఎస్‌ నగర ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. అనంతరం కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో విలేకరులతో, తెలంగాణభవన్‌లో హన్మకొండ జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగానూ కేటీఆర్‌ మాట్లాడారు. హైడ్రా కూల్చివేతలు అన్యాయమంటూ మండిపడ్డారు.


పేదల ఇళ్లను కూలుస్తూ నోటిసులిచ్చి పెద్దల నిర్మాణాలను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. దిక్కులేక, తెలిసీతెలియక నాలాలు, ఇతర ప్రాంతాల్లో గూడు నిర్మించుకున్న వారికి ఒక న్యాయం.. సీఎం అన్న, బడా బాబులకో న్యాయమా..? అని ప్రశ్నించారు. కనీసం సామాగ్రి తీసుకునే అవకాశం ఇవ్వకుండా అమానవీయంగా సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హైడ్రా బాధిత పేదలు కస్తూరిబాయి, వేదశ్రీ కుటుంబాలను పరామర్శిస్తామని చెప్పారు. మంచి ఉద్దేశంతో పనిచేస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు, శని, ఆదివారాల్లో జరుగుతున్న కూల్చివేతలను హైకోర్టు సూమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే వాళ్లను వెండింగ్‌ జోన్లు ఏర్పాటు చేసి తరలించాలని, ఉన్నపళంగా ఉపాధి కోల్పోతే ఆ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ అన్ని రంగాల్లో విఫలమైందని, జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా ఫంక్షన్‌ను సజావుగా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కూకట్‌పల్లిలో ఉన్న హెచ్‌ఎండీఏ భూముల్లో 1000 ఎకరాలు అమ్మకానికి పెట్టారని తెలిసిందని, వచ్చిన డబ్బులు నగరంలో ఖర్చు చేయాలన్నారు. మూసీ పేరుతో జరుగుతున్న భాగోతాన్ని త్వరలో బయటపెడతామని ఆయన హెచ్చరించారు.


  • ఐటీ హబ్‌ కాదు.. వరంగల్‌ను గబ్బు చేయకుంటే చాలు

వరంగల్‌ను ఐటీ హబ్‌ను చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని.. వరంగల్‌ను గబ్బు చేయకుంటే చాలని కేటీఆర్‌ అన్నారు. తమ ప్రభుత్వంలో రూ.వేలకోట్లు కేటాయిస్తే.. వరంగల్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, మంత్రులు కూడా అదే దారిలో ఎక్కడికక్కడ దోపీడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హన్మకొండసహా.. పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎందుకు ఓటమి చెందారో అర్థంకావడంలేదని, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజల్లో చెప్పుకోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. ఈ ఓటమికూడా తమకు మంచిదేనని, గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడుతున్న రేవంత్‌రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా ఉంటోందని ఆరోపించారు. కాగా, వికారాబాద్‌ నియోజకవర్గంలోని మర్పల్లిలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నవీన్‌, ప్రవీణ్‌లపై స్థానిక ఎస్సై, పోలీసులు దాడి చేయడం తగదని, కాంగ్రెస్‌ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బాధితులు, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. దాడికి కారణమైన ఎస్సై, పోలీసులను ప్రభుత్వం తక్షణం సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.


  • నల్లగొండ జిల్లా మంత్రుల అరాచకాలు ఎండగడదాం

ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు అధికార అహంకారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, వారి అరాచకాలను ఎండగడదామని కేటీఆర్‌ పేర్కొన్నారు. బుధవారం మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి నివాసంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇతర అంశాలపై చర్చించారు. కాగా, ఎత్తు కుర్చీల్లో కూర్చోవడం కాదు.. కన్నెత్తి రైతులగోస చూడు అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సూచించారు.

Updated Date - Sep 26 , 2024 | 04:14 AM