Kuna Srisailam Goud: భాష మార్చుకోకపోతే ఉరికించి కొడతాం
ABN, Publish Date - Sep 18 , 2024 | 04:44 AM
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత కేపీ వివేకానంద్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌కు కూన శ్రీశైలం గౌడ్ హెచ్చరిక
మమ్మల్ని టచ్ చేస్తే ప్రజాక్షేత్రంలో
తిరగనివ్వం : బీఆర్‌ఎస్ శ్రేణుల కౌంటర్
దుండిగల్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత కేపీ వివేకానంద్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి విషయంలో తప్పుగా మాట్లాడితే కుత్బుల్లాపూర్ గల్లీలో ఉరికించి కొడతామని కేపీ వివేకానంద్‌ను హెచ్చరించారు. వివేకానంద్ తన భాష మార్చుకోవాలని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గాజులరామారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత శ్రీశైలం గౌడ్ విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి వివేకానంద్ మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీలో గెలిచి బీఆర్‌ఎ్‌సలో చేరిన వివేకానంద్‌కు ఫిరాయింపుల కోసం మాట్లాడే అర్హత లేదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేకానంద్ తనపై దాడి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివేకానంద్ భాష రైల్వేస్టేషన్‌లో పల్లీలు అమ్ముకునే వారికన్నా అధ్వానంగా ఉందని అన్నారు. భాష, పద్ధతి మార్చుకోకపోతే కుత్బుల్లాపూర్‌లో తిరగనీయమని హెచ్చరించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్ నేతలను టచ్ చేస్తే శ్రీశైలం గౌడ్‌ను ప్రజాక్షేత్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరే శ్రీశైలంగౌడ్‌కు ఫిరాయింపుల కోసం మాట్లాడేందుకు అనర్హుడిన మండిపడ్డారు.
Updated Date - Sep 18 , 2024 | 04:45 AM