Welfare Hostels: సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచాలి
ABN, Publish Date - Sep 24 , 2024 | 04:08 AM
పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించింది.
ఇతర సమస్యలను పరిష్కరించాలి
సంక్షేమ భవన్ ముందు కేవీపీఎస్ ధర్నా
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించింది. రాష్ట్రంలో 810 హాస్టళ్లల్లో 64,834 మంది విద్యార్థులు అరకొర సౌకర్యాల మధ్య చదువుకుంటున్నారని సంఘం నేతలు టి.స్కైలాబ్‌బాబు, మాణిక్యం అన్నారు. విద్యార్థుల పాకెట్ మనీ, కాస్మెటిక్ చార్జీలను పెంచాలని, దీపావళిలోపు దుస్తులు, దుప్పట్ల కోసం టెండర్లు పిలిచి పిల్లలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ టీకే శ్రీదేవికి కేవీపీఎస్ నేతలు వినతి పత్రం సమర్పించారు.
సీఎ్‌సకు గురుకుల విద్యాసంస్థల జేఏసీ వినతిపత్రం
రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ గురుకులాల్లో (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్) ఉన్న ఉమ్మడి టైమ్ టేబుల్‌లో మార్పుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకుల విద్యాసంస్థల జేఏసీ తరఫున స్టీరింగ్ కమిటీ సభ్యులు సీఎస్ శాంతికుమారితో పాటు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఈ నెల 28న చాక్ డౌన్/పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించారు.
గురుకులాల సమస్యలపై 28న చలో హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న ‘చలో హైదరాబాద్’కు పిలుపునిస్తున్నట్లు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య తెలిపారు. మొత్తం 1,022 గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులున్నారని.. మౌలిక వసతులు లేక వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాము 25 సమస్యలతో కూడిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రూపొందించి ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పరిష్కారం కాలేదన్నారు. అందుకే యూటీఎఫ్, గురుకుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చామన్నారు.
గురుకుల సంఘాల జేఏసీ నేతలు మామిడి నారాయణ, మధుసూధన్ మాట్లాడుతూ.. గురుకులాలను కామన్ డైరెక్టరేట్ పరిధిలోని తెస్తేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. అన్ని గురుకులాల్లో క్యాడర్ విభజన సమాన నిష్పత్తిలో పంచాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఽధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను సంఘాల నేతలు ఆవిష్కరించారు.
Updated Date - Sep 24 , 2024 | 04:08 AM