Lagacherla: ప్రాణాలు పోయినా భూములివ్వం
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:16 AM
ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములను మాత్రం ఇవ్వబోం, ఆస్తులను కాపాడుకుని తీరుతాం అని లగచర్ల కేసు నిందితులు స్పష్టం చేశారు. జీవితంలో జైలుకెళ్తామని ఊహించలేదంటూ కంటతడి పెట్టారు.
మేం ఎవరం అధికారులపై దాడి చేయలేదు..!
విడుదల అనంతరం లగచర్ల గ్రామస్థులు
కంది, బొంరా్‌సపేట, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములను మాత్రం ఇవ్వబోం, ఆస్తులను కాపాడుకుని తీరుతాం అని లగచర్ల కేసు నిందితులు స్పష్టం చేశారు. జీవితంలో జైలుకెళ్తామని ఊహించలేదంటూ కంటతడి పెట్టారు. గత నెల 11న వికారాబాద్ కలెక్టర్ మరికొందరు అధికారులపై దాడి చేశారనే ఆరోపణలతో కొడంగల్ మండలం లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండా, హకీంపేట గ్రామాలకు చెందిన 71 మందిపై కేసు నమోదైంది. వీరిలో 32 మందిని జ్యుడీషియల్ కస్టడీ కింద కందిలోని సంగారెడ్డి కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. 17 మందికి నాంపల్లి కోర్టు రూ.20 వేల పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గురువారం సాయంత్రం సంబంధిత పత్రాలు అందకపోవడంతో జైలు అధికారులు శుక్రవారం విడుదల చేశారు.
ఈ కేసులోని ఎ-2 సురేష్, మరో 14 మందికి బెయిల్ రాలేదు. కాగా, 37 రోజులు జైల్లో ఉన్న లగచర్ల కేసు నిందితులు విడుదల తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బయట ఉన్న కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. జైల్లో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యామని చెప్పుకొని రోదించారు. ‘మేం అధికారులపై దాడి చేయలేదు. భూములు ఇవ్వలేదనే నెపంతో అక్కడి రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేయించారు. కుటుంబసభ్యుల ఎదుటనే దూషిస్తూ ఇళ్లలోంచి లాక్కొచ్చి పోలీసులు అరాచకం సృష్టించారు. ఏం జరుగుతుందో ఊహించేలోపే అరెస్టు చేశారు. పరిగి ఠాణాలో ఇష్టారాజ్యంగా కొట్టారు. కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం ఇవ్వలేదు. సంగారెడ్డి జైలుకు వచ్చిన తర్వాతా పోలీసులు కొట్టిన దెబ్బల తాలూకు నొప్పులతో ఇబ్బందిపడ్డాం’’ అని వివరించారు.
విడుదలైనది వీరే..
పాత్లవత్ వినోద్, పాత్లవత్ శ్రీనునాయక్, రాథోడ్ వినోద్, పాత్లవత్ భాష్యానాయక్, జర్ఫ హీర్యానాయక్ (రోటిబండ తండా), మైలారం విష్ణువర్ధన్‌రెడ్డి, ఎదురింటి శివకుమార్, నీలి రవి, బసప్ప, బ్యాగరి యాదయ్య, లక్ష్మయ్య, కావలి రాఘవేందర్ (లగచర్ల), దోరమని రమేష్, మాణిక్య శ్రీశైలం, దోరమని బాలకృష్ణయ్య (హకీంపేట), జర్ఫ హీర్యానాయక్, పాత్లవత్ ప్రవీణ్ కుమార్ (పులిచెర్ల కుంట తండా).
Updated Date - Dec 21 , 2024 | 04:16 AM