ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Land Mafia: నాగాహిల్స్‌లో కబ్జానాగులు!

ABN, Publish Date - Nov 23 , 2024 | 03:29 AM

హైదరాబాద్‌ నడిబొడ్డున రూ.2వేల కోట్ల విలువ చేసే భూమి. పైగా మధ్యతరగతికి చెందినవారి చేతిలో ఉంది. ఇంకేం..! భూ బకాసురులు కన్ను పడకుండా ఉంటుందా? రాయదుర్గంలోని నాగాహిల్స్‌ వెంచర్‌ విషయంలో ఇదే జరిగింది.

  • రూ.2 వేల కోట్ల విలువైన భూముల్లో పాగా

  • సుప్రీంలో కేసు గెలిచినా యజమానులకు దక్కని భూమి

  • ధరణి లొసుగులతో చెరబట్టిన మాఫియా

  • ఎల్‌ఆర్‌ఎస్‌ ఇచ్చిన ప్లాట్లకు పాస్‌బుక్‌ల జారీ

  • డెవలప్‌మెంట్‌ పేరుతో కబ్జాదారుల అధీనంలోకి ప్లాట్లు

  • సొసైటీలో కొందరిని లోబరుచుకొని అడ్డగోలుగా కబ్జా

  • మాట వినని సభ్యులకు బెదిరింపులు

  • లే అవుట్‌ ప్రాంతం ధ్వంసం.. బౌన్సర్లతో పహారా

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌ నడిబొడ్డున రూ.2వేల కోట్ల విలువ చేసే భూమి. పైగా మధ్యతరగతికి చెందినవారి చేతిలో ఉంది. ఇంకేం..! భూ బకాసురులు కన్ను పడకుండా ఉంటుందా? రాయదుర్గంలోని నాగాహిల్స్‌ వెంచర్‌ విషయంలో ఇదే జరిగింది. 33 ఏళ్ల క్రితం చేసిన ఈ వెంచర్‌లో కొనుక్కున్న ప్లాట్లను యజమానుల నుంచి లాగేసుకునేందుకు భూమాఫియా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. తొలుత గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండతో.. ఆ భూమి సర్కారుదేనని చెప్పించారు. కోర్టు తీర్పులతో ఆ ప్రయత్నం విఫలమవడంతో గతంలో భూమిని అమ్మినవారి వారసులను రంగంలోకి దించారు. అప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌ ఆమోదం పొంది, రోడ్డు విస్తరణలో కోల్పోయిన స్థలానికి ప్రభుత్వం టీడీఆర్‌ కూడా చెల్లించిన భూమికి.. ధరణిలోని లొసుగుల ఆధారంగా తిరిగి పాస్‌పుస్తకాలు సంపాదించారు. వాటి ఆధారంగా భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా.. బాధితులు దీనిని కూడా అడ్డుకున్నారు. దీంతో ఇప్పుడు డెవల్‌పమెంట్‌ పేరుతో ప్లాట్లను ఆక్రమించారు. పాస్‌పుస్తకాలను బూచిగా చూపిస్తూ.. ప్లాట్లను డెవల్‌పమెంట్‌కు ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నారు. అందులోనూ తమ ఇష్టం వచ్చినంత రేషియో మాత్రమే ఇస్తామంటున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ.. అసలు యజమానులనే అందులోకి వెళ్లకుండా రౌడీలు, బౌన్సర్లతో అడ్డుకుంటున్నారు.


  • 25 ఎకరాల్లో వెంచర్‌..

ముంబయి పాత జాతీయ రహదారితోపాటు రాయదుర్గం నుంచి ఓఆర్‌ఆర్‌కు వెళ్లే నాలుగు లేన్ల రహదారికి ఆనుకుని 25 ఎకరాల్లో ఈ వెంచర్‌ ఉంది. 1991లో రాయదుర్గం పాన్‌మక్తా సర్వే నంబరు 66/3లోని 25 ఎకరాల స్థలంలో నాగాహిల్స్‌-2 పేరుతో నారాయణస్వామి అనే వ్యక్తి ఈ వెంచర్‌ చేశారు. ఇందులో 295 ప్లాట్లు చేయగా.. అన్నీ అప్పట్లోనే అమ్ముడయ్యాయి. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా 1991లోనే సొసైటీగా ఏర్పడ్డారు. అయితే ప్లాట్లు కొనుగొలు చేసిన కొద్దిరోజులకే ఈ భూమిపై ప్రభుత్వానికి, ప్లాట్ల యజమానులకు మధ్య వివాదం రేగింది. ఈ భూములపై తమకు హక్కులు ఉన్నాయని ప్రభుత్వం వాదించింది. చివరకు ప్లాట్ల యజమానులకే ఈ భూమిపై హక్కులు ఉన్నాయని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఫ్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్కారు వాదనను సుప్రీం తిరస్కరించింది. ప్లాట్ల యజమానులకే హక్కులుంటాయన్న హైకోర్టు వాదనను సమర్థించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న సొసైటీ సభ్యులు సంబరపడ్డా.. ఆ సంతోషం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఈ భూములపై కన్నేసిన బడా వ్యక్తులు.. గతంలో ఈ భూములమ్మిన వారి వారసులను రంగంలో దింపారు. ధరణిలో లోపాలను అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన వారసుల పేరు మీద కొత్త పాస్‌బుక్‌లు జారీ చేయించారు. వాస్తవానికి వారసులుగా చెప్పుకొంటున్న వీరికి.. గతంలోనే ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ కోర్టుల్లో వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. 2010లో వీరు దొడ్డిదారిన ఆర్వోఆర్‌ పాస్‌బుక్‌లు కూడా తెచ్చుకున్నారు. దీనిపై ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేయడంతో తరువాత అధికారులు వీటిని కూడా రద్దు చేశారు. ప్లాట్ల యజమానులకు వ్యతిరేకంగా కేసులు వేసిన వారికి ఇలా దారులన్నీ మూసుకుపోయాయి. అయినా ఆ భూమిని వదలని బడాబాబులు.. గత ప్రభుత్వంలోని పెద్దల సహకారంతో ధరణి ద్వారా కొత్తపా్‌సబుక్‌లు సంపాదించారు. గతంలో ఈ ప్లాట్లకు యజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం చేసుకున్న దరఖాస్తులను ఆమోదించి ప్లాట్లను క్రమబద్ధీకరించిన అధికారులే వీరికి పాస్‌బుక్‌ ఇవ్వడం గమనార్హం.


  • ప్రభుత్వం మారాక కొత్త వ్యూహం..

రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో.. తమకు న్యాయం జరుగుతుందని ప్లాట్ల యజమానులు భావించగా.. బడాబాబులు వ్యూహం మార్చారు. ప్లాట్ల యజమానుల (సొసైటీ సభ్యుల) వద్దకు వెళ్లి మీరు ఇళ్లు నిర్మించుకుంటే అన్ని అనుమతులు రావడం కష్టమని, ఈ ప్లాట్లన్నీ తమకు డెవల్‌పమెంట్‌కు ఇస్తే ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని అపార్ట్‌మెంట్లు కడతామని చెప్పారు. దీనికి కొందరు సభ్యులు అంగీకరించకపోవడంతో సొసైటీలో పెద్దతలకాయలను తమవైపు తిప్పుకొని సొసైటీని నిట్టనిలువునా చీల్చారు. సొసైటీ సభ్యులంతా తమకు డెవల్‌పమెంట్‌ కోసం ప్లాట్లు ఇస్తున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి.. వీటి ద్వారా నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకునే యత్నం చేశారు. దీనిని కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. తామే సొంత ఇళ్లు కట్టుకుంటామన్నారు. దీంతో వీరిని కూడా బెదిరించి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాట వినని వారిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. వారికి దారి లేకుండా చుట్టూ భారీ ప్లాస్టిక్‌ షీట్లు ఏర్పాటు చేశారు. శ్రీహిల్స్‌ అనే పేరుతో బోర్డులు కూడా పెట్టారు. తమ మాట వినని ప్లాట్ల యజమానులను కనీసం స్థలాలు చూసుకునేందుకు కూడా వెళ్లనివ్వడం లేదు. పైగా, గతంలో వేసిన వెంచర్లలో రోడ్లన్నీ తొలగించి చదును చేస్తున్నారు. ఏ అనుమతులు లేకుండానే లేఅవుట్‌ను పూర్తిగా తొలగించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గట్టిగా ప్రశ్నించిన వారిలో కొందరు రహదారికి ఆనుకుని ఉన్న పాట్ల యజమానులు ఉన్నారు. వీరి ప్లాట్లను మినహాయించి ప్రహరీ షీట్లు వేశారు. అయితే తమకు డెవల్‌పమెంట్‌కు ఇవ్వడం లేదనే కక్షతో వీరినీ ఇబ్బందులు పెడుతున్నారు. ఫుట్‌పాత్‌ పేరు నిర్మాణం పేరుతో గుంతలు తవ్వించారు. అడ్డుపడిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.


  • అడ్డగోలుగా బేరాలు

ధరణి పాస్‌బుక్‌లు అడ్డుపెట్టుకుని చుట్టూ ప్లాస్టిక్‌ షీట్లు వేసిన భూ మాఫియా.. మరోవైపుప్లాట్ల యజమానులను బెదిరించి అతి తక్కువ రేషియో ఇస్తూ అడ్డగోలుగా డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎక్కడైనా ప్లాట్ల డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ విషయంలో 50:50 లేదా అంత కంటే ఎక్కువ రేషియోలో ప్లాట్ల యజమానులకు ఇస్తున్నారు. దీని ప్రకారం 300 గజాల ప్లాటు ఉన్న యజమానికి కనీసం 6వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల నిర్మాణ భవనంలో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ ప్లాట్ల యజమానులకు కేవలం 3వేల అడుగులు మాత్రమే ఇస్తున్నారు. ఇదేమంటే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ సొసైటీ ప్లాట్లపై కన్నేసిన వారిలో బడా నేతలు ఉన్నారు. తెర ముందు కొందరిని పెట్టి..వారు వెనుక ఉండి తతంగం నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఫ్రభుత్వ హయాంలో నగర, శివార్లలోని లొసుగులున్న భూములపై కొందరు బడా వ్యక్తులు కన్నేసి వాటిపై కొంత పెట్టుబడులు పెట్టి అసలు హక్కుదారులకు దక్కకుండా వివాదాలను జఠిలం చేశారు. ఇలా లిటిగేషన్‌ మాస్టర్‌ ఒకరు ఈ సొసైటీ వ్యవహారంలోనూ ముందుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పెద్దలకు సన్నిహితంగా మెలిగిన ఆయన.. ఇపుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ అలాగే చక్రం తిప్పాలనే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈయనకు ఓ ప్రముఖ కంపెనీ యజమాని ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండి పెట్టుబడులు పెడుతుంటారనే ప్రచారం ఉంది.


  • తప్పుడు కేసులు

తమ దారికి రాని సొసైటీ సభ్యులను పలువిధాలుగా ఇబ్బందులు పెడుతూ తప్పుడు కేసులు కూడా బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. విసిగి వేసారిన బాధితుల్లో 25 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీరిని కూడా ఇబ్బందులు పెట్టేందుకు ఆ బడా నేతలు ప్రయత్నిస్తున్నారు. రోడ్డు పక్కనే ప్లాట్‌ ఉన్న ఓ వ్యక్తిపై ఇటీవలే.. రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుకుంటున్నాడని తప్పుడు కేసును జీహెచ్‌ఎంసీ సిబ్బంతో తప్పుడు పెట్టించారు. రోడ్డు విస్తరణ చేస్తున్న ప్రాంతంలో మొక్కలు నాటుతుండగా అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఈ స్థలంలో 21,600 మొక్కలు నాటే యత్నం చేశామని దీనికి అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అక్కడ మొక్కలు నాటేందుకు ఎంపిక చేసిన భూమి 47 గజాలు మాత్రమే కానీ ఇందులో 21,600 మొక్కలు నాటుతున్నట్లు అధికారులు పేర్కొవడం గమనార్హం. ప్రస్తుతం ఇక్కడ ఎంతలేదన్నా గజం రూ.2.5 లక్షల పైనే ఉంటుంది. అంటే ఈ భూముల మొత్తం విలువ దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఉంటుంది.

Updated Date - Nov 23 , 2024 | 03:29 AM