AV Ranganath: ఆరుగురు అధికారుల వాంగ్మూలాలు నమోదు!
ABN, Publish Date - Sep 12 , 2024 | 04:47 AM
నగరంలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలిసింది.
అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన వారిని
ప్రశ్నించిన పోలీసులు.. త్వరలో సీపీకి నివేదిక!
అనంతరం అధికారులపై చర్యలు!
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నగరంలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లు, అక్రమార్కులకు కొమ్ముకాసిన రెవెన్యూ, మునిసిపల్, హెచ్‌ఎండీఏ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అక్రమార్కుల చిట్టా బయటకు తీస్తున్నారు.
వారిని విచారించి సమగ్ర సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. నిజాంపేట మునిసిపల్ కమిషనర్ రామకృష్ణ, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాన్ష్, బాచుపల్లి ఎమ్మార్వో పూల్‌సింగ్, ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ అసిస్టెంట్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్, సిటీ ప్లానింగ్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌లపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఆదేశాలతో ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. ఆయా శాఖల అధికారులను విచారించి, వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలిసింది. ఒక్కో అధికారిని విడతలవారీగా విచారించారు.
అక్రమార్కులతో వారికున్న సంబంధాలు, వారిచ్చిన అక్రమ అనుమతులపై విచారించి, సమగ్ర వివరాలు రాబట్టినట్లు సమాచారం. రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్, హెచ్‌ఎండీఏ అధికారుల అక్రమాలు, అందుకు ప్రోత్సహించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు? తదితర అంశాలతో త్వరలోనే సీపీకి పూర్తిస్థాయి నివేదికను అందజేయడానికి ఈవోడబ్ల్యూ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. నివేదిక అందిన తర్వాత.. అక్రమాలకు పాల్పడిన అధికారులపై న్యాయపరంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది.
Updated Date - Sep 12 , 2024 | 04:48 AM