Hyderabad: పట్టణ చెరువుల్ని కాపాడదాం..
ABN, Publish Date - Jun 22 , 2024 | 03:35 AM
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని చెరువులను సంరక్షించడానికి పురపాలక శాఖ సిద్ధమవుతోంది. చెరువులను కాపాడడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాలను సంరక్షించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది.
భూగర్భ జలాల్ని సంరక్షిద్దాం.. చెరువుల సమగ్ర వివరాలు ఇవ్వండి
జూలై 5లోగా అందజేయండి
మున్సిపల్ కమిషనర్లను ఆదేశించిన పురపాలక శాఖ సంచాలకురాలు
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని చెరువులను సంరక్షించడానికి పురపాలక శాఖ సిద్ధమవుతోంది. చెరువులను కాపాడడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాలను సంరక్షించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. చెరువుల రక్షణపై రేవంత్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఇటీవల పురపాలకశాఖ సంచాలకురాలు దివ్యాదేవరాజన్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు.
దేశంలో చెరువుల సంరక్షణకు అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకున్నారు. అందులో చర్చించిన అంశాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల పరిధిలో (జీహెచ్‌ఎంసీ మినహా)ని చెరువుల సంరక్షణకు సూచనలు చేశారు. జూలై 5లోపు చెరువుల భౌగోళిక సరిహద్దులు తెలిపే చిత్రాలు, విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్ వివరాలను పంపాలని ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్, ఆక్రమణలు వంటి పూర్తి వివరాలను పంపాలని సూచించారు.
ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుజ్జీవం
మున్సిపాలిటీల పరిధిలో ప్రస్తుతం ఉన్న చెరువులకు జీవం పోసేందుకు ఎన్జీవోలను, ప్రజలను, విద్యార్థులను భాగస్వాములను చేయాలని దివ్యదేవరాజన్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అన్ని నగరపాలక సంస్థలు, పెద్ద మున్సిపాలిటీల పరిధిలో కనీసం ఒక నర్సరీ అయినా పెంచడంతోపాటు చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలను చెరువుల్లో వేయకుండా చూడాలని ఆదేశించారు. మురుగు నీటిని ఎట్టి పరిస్థితుల్లో చెరువుల్లో చేరకుండా చూడాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులపై సీసీ కెమెరాల ఏర్పాటు, గ్రీన్‌ఫెన్సింగ్ కోసం వెదురు మొక్కల పెంపకం, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల నుంచి జూలై 5లోపు సూక్ష్మప్రణాళికను తయారు చేసి పంపాలని ఆదేశించారు.
48 అంశాలపై సర్వే నివేదిక ఇవ్వండి..
మున్సిపాలిటీల పరిధిలో ఉండే చెరువులకు సంబంధించి 48 అంశాల మీద నివేదిక పంపాలని దివ్యదేవరాజన్ కమిషనర్లను ఆదేశించారు. అందులో చెరువుల విస్తీర్ణం, ఆక్రమణలు, నీటి లభ్యత, సామర్థ్యం తదితర అంశాలపై సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించారు.
ఆ చెరువులను పునరుద్ధరిస్తాం: భట్టి
గ్రేటర్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 282 చెరువులు ఆక్రమణకు గురైనట్లు ‘తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీజీఆర్‌ఏసీ)’ రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ద్వారా గుర్తించింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 193 చెరువులు ఉండగా.. ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో 89 ఉన్నాయి. 2014 నుంచి 2023 వరకూ ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలకు సంబంధించి టీజీఆర్‌ఏసీ నివేదికను రూపొందించింది. డిప్యూటీ సీఎం భట్టి గ్రేటర్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో గల చెరువులు, కుంటలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చెరువులు, కుంటల ఆక్రమణలకు సంబంధించిన టోపోషీట్లను భట్టి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి.. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను పునరుద్ధరించడానికి కృషి చేస్తామని భట్టి తెలిపారు.
Updated Date - Jun 22 , 2024 | 03:35 AM