Share News

ఎన్నికల తర్వాతే ఎల్‌ఆర్‌ఎస్‌!

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:32 AM

లేఅవుట్‌ క్రమబద్ధీకరణ ప్రక్రియ మరో మూడు నెలలకు వాయిదా పడింది. ప్రభుత్వ నిర ్ణయం కోసం దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్న తరుణంలో మార్చి 31లోపు రెగ్యులరైజ్‌ చేస్తామని నెల క్రితం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు.

ఎన్నికల తర్వాతే ఎల్‌ఆర్‌ఎస్‌!

నాలుగేళ్ల నిరీక్షణకు తెర దించుతూ నెల క్రితం ప్రకటన

పెండింగ్‌లో 25.44 లక్షల దరఖాస్తులు.. 31 వరకు గడువు

జూన్‌ 4న ఎన్నికల ఫలితాల తర్వాతే ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్ణయం

హైదరాబాద్‌, మార్చి21 (ఆంధ్రజ్యోతి): లేఅవుట్‌ క్రమబద్ధీకరణ ప్రక్రియ మరో మూడు నెలలకు వాయిదా పడింది. ప్రభుత్వ నిర ్ణయం కోసం దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్న తరుణంలో మార్చి 31లోపు రెగ్యులరైజ్‌ చేస్తామని నెల క్రితం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు. అధికారులు పాత విధానాల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఇచ్చిన గడువుకు పది రోజులే మిగిలి ఉండటం, దీనిపై విధివిధానాలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ లోపే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న ఉండటంతో ఆ తర్వాతే ఈ అంశంపై ప్రభుత్వం దృష్టిసారించనుందని అధికారులు తెలిపారు.

కనీసం నెల రోజుల ప్రక్రియ

ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ముందుకు సాగాలంటే మూడు దశల్లో పని చేయాల్సి ఉంటుంది. తొలుత దరఖాస్తులను పరిశీలించాలి. అనంతరం ఆ దరఖాస్తుల్లోని కొలతల పరిశీలనకు క్షేత్ర స్థాయి పర్యటన చేస్తారు. అన్నీ నిర్ధారించుకున్న తర్వాత నిబంధనల ప్రకారం దరఖాస్తుదారు చెల్లించాల్సిన ఫీజును నిర్ణయిస్తారు. ఆ మేరకు దరఖాస్తుదారులకు నోటీసులు పంపుతారు. ఈ నోటీసులను మునిసిపాలిటీలో అయితే అక్కడి అధికారులు, గ్రామ పంచాయతీల్లో అయితే పంచాయతీ కార్యదర్శులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా నోటీసులు ఇచ్చేందుకు కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. అదే సమయంలో ఆ నోటీసుల ప్రకారం ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులకు కొంత సమయమివ్వాలి. ఇది కూడా కనీసం 15 రోజులు ఉంటుంది. అంటే నోటీసులివ్వడం, అందులో పేర్కొన్న ఫీజులు లబ్ధిదారులు చెల్లించడానికి కనీసం నెల రోజుల సమయం కావాలి. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తయిన కొన్ని రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకున్నట్లుగా ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన నేపథ్యంలో ఈ ప్రక్రియ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక ఈ పక్రియను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 26న సీఎం ప్రకటన చేసినప్పటికీ.. తక్కువ వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటే వీలుకాని పరిస్థితి. దీంతో గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలను మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం గత మార్గదర్శకాలను కుదిస్తూ ముసాయిదా ప్రభుత్వానికి పంపారు. దీనిపై ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం జరిగింది. దీంతో ఈ ప్రక్రియను తొలుత ప్రకటించినట్లు మార్చి 31లోపు పూర్తి చేయడానికి వీలుకాదని ప్రభుత్వం భావించి ఎన్నికల తర్వాత ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తోంది.

2020 నుంచి నిరీక్షణ

బీఆర్‌ఎస్‌ హయాంలో 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. అప్పటి నుంచి నాలుగేళ్లుగా దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి కొంత మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల వల్ల న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. విధానాల రూపకల్పన, న్యాయపరమైన ఇబ్బందులన్నీ పరిశీలించి జూన్‌లో ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. రాష్ట్రంలో లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ పథకం(లేఅవుట్‌రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద 2020లో వచ్చిన దర ఖాస్తులపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫిబ్రవరి 26న క్రమబద్ధీకరణకు అనుమతిస్తూ ప్రకటన చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మున్సిపల్‌, రిజిస్ర్టేషన్‌ శాఖల అధికారులను ఆదేశించారు. 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలోని అన్నీ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 13 కార్పొరేషన్ల నుంచి 4.13 లక్షలు, 129 మునిసిపాలిటీల నుంచి 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు అందాయి.

Updated Date - Mar 22 , 2024 | 04:33 AM