Ramoji Rao: అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది..
ABN, Publish Date - Jun 09 , 2024 | 03:38 AM
రామోజీరావు మరణంతో ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్ధ అని తెలిపారు. ఆయన చేతలు, రాతలు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
రామోజీరావు ఓ శక్తి: కిషన్ రెడ్డి
వెనకడుగు వేయని వ్యక్తి: దత్తాత్రేయ
భారతరత్న ఇవ్వాలి: రాజమౌళి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రామోజీరావు మరణంతో ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్ధ అని తెలిపారు. ఆయన చేతలు, రాతలు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కాగా, పాత్రికేయ రంగంలో చెరగని ముద్రవేసిన రామోజీరావు..తన ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకంజ వేయలేదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలుగు భాష గురించి ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు ఓ వ్యక్తి కాదు శక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సీటు సహా ఎన్ని ఆఫర్లు వచ్చినా రామోజీరావు సున్నితంగా తిరస్కరించారని తెలిపారు. తెలుగు పత్రికారంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మక మార్పుకు బీజం వేసిన మహానుభావుడు రామోజీరావు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
అక్షరానికి కూడా ఓ సామాజిక బాధ్యత ఉంటుందని సమాజానికి చాటిన వ్యక్తి రామోజీరావు అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జర్నలిజం విలువలు, ఔన్నత్యాన్ని పెంచి, రక్షించిన వ్యక్తి రామోజీరావు అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేతలు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం తదితరలు తమ సంతాపం తెలియజేశారు. కాగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన రామోజీరావు చిత్రపటం వద్ద బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ వేర్వేరుగా నివాళులర్పించారు. రామోజీరావు మరణం బాధాకరమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజం ద్వారా తెలుగు భాష సమున్నతికి కృషి చేసిన రామోజీరావు మరణం తీరని లోటని ఓ ప్రకటన చేశారు.
రామోజీరావు మరణం మీడియా రంగానికి తీరని లోటని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే, రామోజీరావు మరణం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలి్‌స్ట్స, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తమ సంతాపం తెలియజేశాయి. కాగా, రామోజీరావు మరణం రెండు తెలుగు రాష్ర్టాలకు తీరని లోటని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాలను కోరారు. రామోజీరావు సినీ, పత్రికా రంగాలకు విశేష సేవలందించారని సినీనటుడు మురళీమోహన్ పేర్కొన్నారు. మహా వృక్షం నేలకొరిగిందని, రామోజీరావు మరణం అందరికీ తీరని లోటని గాయకుడు ఎస్పీ చరణ్ అన్నారు.
Updated Date - Jun 09 , 2024 | 03:38 AM