Krishna Basin: శ్రీశైలానికి భారీ వరద..
ABN, Publish Date - Aug 31 , 2024 | 04:15 AM
కృష్ణా పరివాహక ప్రధాన జలాశయాలన్నీ ఆకస్మిక భారీ వరదలతో ఉప్పొంగుతున్నాయి.
ఎగువ నుంచి మరో 5 రోజుల పాటు..
హెచ్చరించిన కేంద్ర జల సంఘం
సాగర్‌లో రెండో రోజూ గేట్లు ఓపెన్
రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ వర్షాలు
హైదరాబాద్, అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): కృష్ణా పరివాహక ప్రధాన జలాశయాలన్నీ ఆకస్మిక భారీ వరదలతో ఉప్పొంగుతున్నాయి. ఎగువన ఆలమట్టి నుంచి శ్రీశైలం జలాశయానికి భారీ ప్రవాహం వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్, పులిచింతల గరిష్ఠ మట్టానికి చేరాయి. ఆలమట్టిలో 129.72 టీఎంసీలకు గాను 122.1 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 1,66,760 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంటే.. కేంద్ర జల సంఘం హెచ్చరికల నేపథ్యంలో 1,76,540 క్యూసెక్కులను కిందకు వదిలేస్తున్నారు.
నాగార్జున సాగర్‌లోనూ వరుసగా రెండోరోజు మొత్తం 26 గేట్లనూ ఎత్తి ఉంచారు. ఎగువ నుంచి మరో ఐదు రోజులు భారీ వరద రానుందని కేంద్ర జల సంఘం అప్రమత్తం చేసింది. తుంగభద్ర నుంచి కూడా భారీగా వరద వస్తే పెను నష్టం సంభవిస్తుందని.. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహ వేగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపట్టకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
నేడు, రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో శని, ఆదివారాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ, మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లో.. ఆదివారం ఉమ్మడి ఖమ్మంలో.. అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సెప్టెంబరు 2, 3 తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.
శుక్రవారం ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంతో పాటు పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. బోనకల్లులో అత్యధికంగా 6.92 సెంమీ, మధిరలో 3.44 సెంమీ వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి 8.6, జగిత్యాలలో 8.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రాజెక్టు గరిష్ఠ నిల్వ ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో
ఆలమట్టి 129.72 122.10 1,75,000 1,75,000
నారాయణపూర్ 37.64 31.97 1,85,000 1,78,500
జూరాల 9.657 8.3 3,21,000 3,31,047
తుంగభద్ర 105.79 92.94 31,061 10,444
శ్రీశైలం 215.807 213.882 3,29,203 3,82,112
నాగార్జున సాగర్ 312.05 309.057 3,48,024 3,12,097
పులిచింతల 45.77 38.646 2,65,287 3,11,648
ప్రకాశం బ్యారేజీ 3.07 3.07 3,36,169 3,36,169
(గమనిక: నిల్వ టీఎంసీల్లో.. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో క్యూసెక్కుల్లో)
Updated Date - Aug 31 , 2024 | 04:15 AM