Maoists: ఎన్‌కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్
ABN, Publish Date - Oct 06 , 2024 | 04:20 AM
ఛత్తీస్‌గఢ్ అడవులు ఇక తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారా? ఇరవై ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు అక్కడే ఉంటే క్యాడర్‌ను మరింతగా నష్టపోతామనే అంచనానికొచ్చేశారా?
మొత్తం 31మంది మావోయిస్టుల మృతి
దంతెవాడకు మృతదేహాలు.. 15 గుర్తింపు
మృతుల్లో తెలంగాణ వారు లేరు: బస్తర్ ఐజీ
మావోయిస్టుల చూపు తెలంగాణ వైపు.. వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో యోచన
వరంగల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ అడవులు ఇక తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారా? ఇరవై ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు అక్కడే ఉంటే క్యాడర్‌ను మరింతగా నష్టపోతామనే అంచనానికొచ్చేశారా? ప్రస్తుతం వారు తెలంగాణ వైపు చూస్తున్నారా? కొన్నాళ్లుగా దండకారణ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టడం.. పలు విభాగాలకు చెందిన కేంద్ర బలగాలతో విరామం లేకుండా కూంబింగ్ నిర్వహిస్తుండటం.. తరచూ భారీ ఎన్‌కౌంటర్లు జరుగుతుండటం.. పెద్ద ఎత్తున ఉద్యమకారులను కోల్పోతుండటంతో మావోయిస్టులు పునరాలోచనలో పడ్టట్టు సమాచారం.
అప్పటి సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ నక్సల్స్ గ్రూపు తన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేశంలో బలమైన నక్సల్స్ ఉద్యమాన్ని నడుపుతున్న మరో రెండు విప్లవ సంఘాలైన మావోయిస్టు, కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీ), సీపీఐ (ఎంఎల్) నక్సల్బరీ గ్రూపులతో విలీనమై సెప్టెంబరు 21, 2004లో సీపీఐ (మావోయిస్టు)గా ఏర్పడింది. ఉమ్మడి ఏపీలో బలమైన శక్తిగా ఉన్న పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీగా మారటంతో అప్పటి వైఎ్‌స ప్రభుత్వం నక్సలైట్లపై ఉక్కుపాదం మోపింది. ఫలితంగా అప్పట్లోనే మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో సెప్టెంబరు 21వ తేదీ నుంచి అక్టోబరు 30వ తేదీ వరకు 20 ఏళ్ల వార్షికోత్సవాలను మావోయిస్టులు జరుపుకొంటున్న నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీకి అత్యంత భారీ ఎదురుదెబ్బ తగిలింది.
నారాయణ్‌పూర్- దంతేవాడ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇది మావోయిస్టు పార్టీకి ఆవిర్భావ ఉత్సవాల వేళ భారీ షాక్‌గా భావిస్తున్నారు. ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ పెద్ద సంఖ్యలో కేడర్‌ను కోల్పోయింది. కారణం.. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా పలు ఆపరేషన్లు మొదలు పెట్టారు. వీటిలో ప్రధానంగా ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కగార్‌లతో కేంద్ర బలగాలు దండకారణ్యంలో మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. 2024 జనవరి నుంచి జూలై వరకే పోలీసు దాడుల్లో 171 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ 20ఏళ్లలో పోలీసు దాడుల్లో 5,285 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అంచనా. మూడున్నరేళ్లలో 475 మందిని కోల్పోయినట్లుగా మావోయిస్టులు పేర్కొంటున్నారు.
తెలంగాణలో ఆ ఐదుగురే కీలకం
దండకారణ్యంలో దశాబ్దకాలంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టులు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యమం బలహీన పడక ముందే తెలంగాణలో బలమైన స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెంలో గత సెప్టెంబరు 5న జరిగిన ఎన్‌కౌంటర్‌లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయస్టులు మృతిచెందారు. అంతకుముందు.. ఆగస్టు 20న ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్ గుట్టలు, కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు మధ్య అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ తృటిలో తప్పింది. బలగాలు అక్కడికి వెళ్లేసరికి మావోయిస్టులు నిష్క్రమించారు.
వంటపాత్రలు లభ్యమయ్యాయి. ఈ పరిణామాల ద్వారా ఛత్తీ్‌సగఢ్ నుంచి మావోయిస్టుల రాక మొదలైందని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ స్థావరాలపై పూర్తి స్థాయలో పట్టున్న ఐదుగురు అగ్రనేతలకే మావోయిస్టుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను పార్టీ అప్పగించిందనే చర్చ జరుగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. బీకేఏఎ్‌సఆర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, జేఎండబ్ల్యుపీ డివిజన్ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, ఏవోబీ కార్యదర్శి గాజర్ల గణేశ్ అలియాస్ ఆజాద్, కేంద్ర కమిటీ సభ్యులు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌కు సరిహద్దు పరిస్థితులపై పూర్తి స్థాయి అవగాహన ఉండటంతో వీరిపైనే తెలంగాణలో ఉద్యమ విస్తరణ బాఽధ్యతలను పార్టీ ఉంచినట్లు సమాచారం.
Updated Date - Oct 06 , 2024 | 04:20 AM