Kaleshwaram: మేడిగడ్డకు నిపుణుల బృందం
ABN, Publish Date - May 23 , 2024 | 04:02 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ, అన్నారం సరస్వతి బ్యారేజీలను పుణేకు చెందిన కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నిపుణులు బుధవారం పరిశీలించారు. ఆ సంస్థలోని భూభౌతిక, భూసాంకేతిక, నాన్ డిస్ట్రక్టివ్ విభాగాలకు చెందిన ముగ్గురు నిపుణులు..
గంటన్నరపాటు బ్యారేజీ వద్ద పరిశీలన
అన్నారం సరస్వతి బ్యారేజీ వద్ద కూడా
డిజైన్లు, లీకేజీలపై వివరాల సేకరణ
నేడు సుందిళ్ల బ్యారేజీ పరిశీలనకు!
హైదరాబాద్, మహాదేవపూర్ రూరల్, భూపాలపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ, అన్నారం సరస్వతి బ్యారేజీలను పుణేకు చెందిన కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నిపుణులు బుధవారం పరిశీలించారు. ఆ సంస్థలోని భూభౌతిక, భూసాంకేతిక, నాన్ డిస్ట్రక్టివ్ విభాగాలకు చెందిన ముగ్గురు నిపుణులు.. జె.ఎ్‌స.ఎడ్లబాడ్కర్, డాక్టర్ ధనుంజయ్ నాయుడు, డాక్టర్ ప్రకాష్ పాలె మధ్యాహ్నం మూడున్నర గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుని.. ప్రాజెక్టు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో అరగంటపాటు భేటీ అయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత.. దెబ్బతిన్న బ్యారేజ్‌లోని ఏడవ బ్లాకులో 19, 20, 21 పియర్లను, ఆ ప్రాంతంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ముఖ్యంగా ఏడోబ్లాక్‌లో పియర్లు కుంగిపోవడానికి కారణాలపై అధ్యయనం చేశారు. తొలుత పైభాగంలో పిల్లర్లను, తర్వాత డ్యామ్ అంతర్భాగంలోని ఎగువ భాగాన కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత దిగువన జల ప్రవాహం వెళ్లే మార్గాలను, భూ భౌతిక స్థితిగతులను సాంకేతికంగా అధ్యయనం చేయడంతో పాటు... ఏడో బ్లాక్ మొత్తాన్నీ ఫొటోలు తీసి సమాచారాన్ని సేకరించారు.
బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటన్నరపాటు బ్యారేజీని పరిశీలించిన అనంతరం.. అన్నారం సరస్వతీ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్‌లలో దెబ్బతిన్న అఫ్రాన్లు, సీసీ బ్లాకులు చూశారు. ఏయే బ్లాకుల వద్ద సీపేజీలు ఏర్పడ్డాయి? వాటి పరిణామాలు ఏమిటనే వివరాలు సేకరించారు. లీకేజీల సమస్యకు సంబంధించి అధికారులు తీసుకున్న చర్యలపై రామగుండం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ద్వారా వివరాలు తెలుసుకున్నారు. గురువారం ఈ బృందం సుందిళ్ల బ్యారేజీని పరిశీలించే అవకాశం ఉంది. కాగా, లీకేజీలను సరిచేయడానికి చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇసుక, మట్టి తొలగించిన తర్వాత జియో టెక్నికల్ పరీక్షలను నిర్వహించి.. మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వారు వెల్లడించినట్టు సమాచారం. కాగా, బ్యారేజీ పరిశీలనకు శనివారం లేదా సోమవారం వస్తామని ఎన్‌జీఆర్‌ఐ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. ఢిల్లీకి చెందిన సీఎ్‌సఎంఆర్‌ఎస్ మాత్రం బ్యారేజీల మట్టి నమూనాలు పంపిస్తే.. పరీక్షలు చేసి, నివేదిక ఇస్తామని స్పష్టం చేసింది.
మేడిగడ్డకు షీట్ పైల్స్
మేడిగడ్డలో ఏడో బ్లాకులోని 11 గేట్లకుగాను ఇప్పటికే మూడు గేట్లను ఎత్తగా.. తాజాగా మరో గేటును ఎత్తారు. త్వరలో మిగిలిన గేట్లనూఎత్తనున్నారు. అంతకన్నా ముందు.. ఆ బ్లాకు కింద ఉన్న రంధ్రాలను గ్రౌటింగ్ చేయనున్నారు. సిమెంట్/కాంక్రీట్/ఇసుక మిశ్రమంతో పునాది కింద ఉన్న రంధ్రాలను పూడ్చి.. ఆ తర్వాతే మిగిలిన గేట్లను ఎత్తాలని నిర్ణయించారు. మరోవైపు.. ఏడో బ్లాకుకు దిగువ, ఎగువ భాగంలో షీట్‌పైల్స్‌ను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ల ఆర్డర్ ఇచ్చారు.
జియో ట్యూబ్‌పై రేపు బీవోసీఈ భేటీ
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో దానికి ఎగువ భాగంలో జియోట్యూబ్‌టెక్నాలజీతో నిర్మించతలపెట్టిన కట్టపై బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(బీవోసీఈ) చర్చించి, నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు.. శుక్రవారం(24న) ఈఎన్‌సీ(అడ్మిన్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలో జరిగే బీవోసీఈ భేటీలో దీనిపై చర్చించనున్నారు. జియోట్యూబ్ నిర్మాణం కోసం రూ.10 కోట్ల దాకా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్ల కమిటీలో సభ్యులుగా ఉన్న చీఫ్ ఇంజనీర్లందరి అభిప్రాయాలను తీసుకున్నాక దీనిపై ముందుకు వెళ్లనున్నారు. ఈ సమావేశానికి జియో ట్యూబ్ సంస్థల ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. ఈ భేటీలో చర్చించిన అనంతరం ఆర్నెల్లలోగా బీవోసీఈ నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయి.
Updated Date - May 23 , 2024 | 04:02 AM