TG: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
ABN, Publish Date - May 21 , 2024 | 03:34 AM
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఈ అల్పపీడనం తొలుత వాయవ్య దిశగా కదిలి ఈనెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని తెలిపింది. ఇక మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని వివరించింది.
24న వాయుగుండంగా మారే చాన్స్
నేడు, రేపు వాన.. 40 డిగ్రీలపైనే ఎండ
హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో
వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఈ అల్పపీడనం తొలుత వాయవ్య దిశగా కదిలి ఈనెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని తెలిపింది. ఇక మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని వివరించింది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ రెండ్రోజులు రాష్ట్రంలోని సగానికిపైగా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్, వికారాబాద్‌లో వానలు!
హైదరాబాద్, వికారాబాద్ జిల్లాతో పాటు అక్కడక్కడ సోమవారం సాయంత్రం వర్షాలు కురిశాయి. పొద్దంతా ఎప్పటిలాగే ఎండలు మండిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యధికంగా 42.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, నాంపల్లి, మోతీనగర్, మూసాపేట, హైదరాబాద్ యూనివర్సిటీ, బాలాజీనగర్, జీడిమెట్ల, జియాగూడ, కూకట్‌పల్లి, బండ్లగూడ, హయత్‌నగర్, మియాపూర్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అకాల వర్షాలతో మర్పల్లి మండలంలోని ఉల్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలకు పొలాల దగ్గర నిల్వ చేసిన ఉల్లి పంట కుళ్లిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, వికారా బాద్ జిల్లాలోని రుద్రారం, తాండూరులలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు. యాలాల మండల పరిధిలోని హజీపూర్ శివారులో పిడుగు పడి మొగులప్పకు చెందిన ఐదు మేకలు మృతి చెందాయి.
Updated Date - May 21 , 2024 | 03:34 AM