Ponguleti: కాపలా కుక్కలు కాదు.. వేటకుక్కలు!
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:24 AM
తెలంగాణ రాష్ట్రాన్ని కాపలాకుక్కలా కాపాడుతానని చెప్పుకొన్న కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతలు.. వేటకుక్కల్లా ప్రజల సొమ్మును కొల్లగొట్టారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజల
ఆస్తులను యథేచ్ఛగా కొల్లగొట్టారు
ధరణితోపాటు ఆర్థిక అవకతవకలపై ఆడిట్
భూ భారతి చట్టం.. ప్రజల నిజమైన చుట్టం
విస్తృత చర్చలతో తెచ్చాం: మంత్రి పొంగులేటి
రైతు భరోసాపై నేడు శాసనసభలో చర్చ
పథకంపై సీఎం ప్రకటన: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని కాపలాకుక్కలా కాపాడుతానని చెప్పుకొన్న కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతలు.. వేటకుక్కల్లా ప్రజల సొమ్మును కొల్లగొట్టారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ధరణితోపాటు, గత ప్రభుత్వం తీసుకున్న పలు ఆర్థికపరమైన నిర్ణయాలపై ‘ఫోరెన్సిక్ ఆడిట్’ నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం సభ ప్రారంభమైన అనంతరం ‘భూ భారతి-2024’ చట్టంపై చర్చను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. భూభారతి చట్టం ప్రజల చట్టమని, భూమి ఉన్న ప్రతి ఒక్కరి చుట్టమని అభివర్ణించారు. ‘విస్తృత స్థాయి ప్రజాభిప్రాయ సేకరణతో రూపొందించిన భూ భారతి చట్టం-2024 అక్షరాలా భూ యజమానులకు చుట్టం. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన రెవెన్యూ చట్టాలు, సంస్కరణలు రైతులు, ప్రజలకు ఎంతో మేలు చేశాయి. అదే నిబద్ధతతో భూ భారతి చట్టం తెచ్చాం’ అని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం రైతులు, కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం ఓ చారిత్రాత్మక ఘట్టమని, ఈ ఉద్యమానికి ప్రధాన కారణం నిజాం కాలంనాటి భూ సమస్యలేనని పొంగులేటి తెలిపారు. 80 వేలకుపైగా పుస్తకాలు చదివానని చెప్పుకొన్న గత ప్రభుత్వ పెద్ద, ధరణి సృష్టికర్త కూడా ఇదే విధంగా వ్యవహరించారని మాజీ సీఎం కేసీఆర్‌పై పొంగులేటి విమర్శలు గుప్పించారు. నాడు బ్రిటిష్ దొరలు జమీందారులు, భూస్వాముల వంటి దళారులను సృష్టించి శిస్తుల రూపంలో దోపిడీ చేస్తే ఈనాటి దొరలు భూముల డిజిటలైజేషన్ పేరుతో ధరణిని సృష్టించి భూదోపిడీకి పాల్పడ్డారన్నారు. ధరణిలో నా భూమి నేను చూసుకొనే వీల్లేదు.. ఆనాడు అంతా రహస్యమే.. కానీ, ఇందిరమ్మ ప్రభుత్వంలో దొరలు, సామాన్యులకు ఒకటే విధానం.. భూ భారతిలో అంతా పారదర్శకమేనని మంత్రి చెప్పారు.
ఆ అన్యాయం మరొకరికి జరగకుండా
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మద్దెల కృష్ణయ్య అనే దళిత రైతు ఆత్మహత్యను పొంగులేటి ప్రస్తావించారు. విజేందర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 35 ఏళ్ల క్రితం కృష్ణయ్య 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, ధరణి వచ్చిన తర్వాత ఆ భూమి వేరే వాళ్ల పేరుపై పట్టాకావడంతో మనస్తాపం చెంది గతేడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.. ఈ అన్యాయాలను అరికట్టటానికే భూ భారతి చట్టం రూపొందించామని పొంగులేటి చెప్పారు. ముఖం పగిలిపోయేలా ప్రజలు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తీర్పు ఇచ్చినా విపక్ష నేతల బుద్ధి మారడం లేదన్నారు. భూభారతి చట్టాన్ని సభలో ప్రవేశపెడుతుంటే సీనియర్లమని చెప్పుకొనే కొంతమంది విపక్ష సభ్యులు స్పీకర్‌తోపాటు తన మీద, ఇతర కాంగ్రెస్ సభ్యుల మీద కాగితాలు విసరడం దురదృష్టకరమన్నారు.
మూడేళ్లకే... నూరేళ్లు నిండిన చట్టం
ప్రముఖ న్యాయకోవిదులు పడాల రామిరెడ్డి భూ సంస్కరణలపై రాసిన పుస్తకం ఎప్పుడూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ టేబుల్‌పై కనిపించేదని తన సెల్‌ఫోన్‌లోని ఫోటోను మంత్రి పొంగులేటి సభలో ప్రదర్శించారు. 80 వేలకు పైగా పుస్తకాలు చదివానని చెప్పుకున్న కేసీఆర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి రెవెన్యూ చట్టం వస్తుందని భావించానని, అయితే నాలుగు గోడల నడుమ రూపొందించిన 2020 రెవెన్యూ చట్టం ప్రజా కంటకంగా మారిందన్నారు. మూడేళ్లకే ఈ చట్టానికి నూరేళ్లు నిండిపోయాయని ఎద్దేవా చేశారు. భూభారతిపై సలహాలు, సూచనల కోసం బిల్లును బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉంచామని తెలిపారు.
ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తాం
బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో వేలాది ఎకరాలు పక్కదారి పట్టాయని, దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర కుంభకోణాలు జరిగాయన్నారు. అయినప్పటికీ, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సీబీఐతో దర్యాప్తు జరిపించటంతోపాటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు ధరణితో పాటు పలు తప్పులు చేశారని, వాటన్నింటినీ కూలంకషంగా, శాస్త్రీయంగా విచారించిన తరువాత చర్యలు తీసుకోవాలని సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారని చెప్పారు. తాము హామీ ఇచ్చినట్లుగానే ధరణిని బంగాళాఖాతంలో పడేశామని, దాని స్థానంలో భూ భారతి తీసుకువచ్చామన్నారు. మహేశ్వరరెడ్డి కోరిక మేరకు.. ఽధరణి అవకతవకలతో పాటు, పేదల ఆస్తులను కొల్లగొట్టిన గత ప్రభుత్వ అవినీతిపై ‘ఫోరెన్సిక్ ఆడిట్’ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ధరణి సహా ఆర్థిక కుంభకోణాలు, భూములకు సంబంధించిన అంశాలపై ప్రజాప్రతినిధుల దగ్గర వివరాలుంటే లేఖల రూపంలో తనకు అందజేయాలని పొంగులేటి కోరారు.
సినిమా సన్నివేశాన్ని ప్రస్తావించిన ఏలేటి
చర్చ సమయంలో ఏలేటి లక్కీ భాస్కర్ సినిమాలోని ఓ సన్నివేశం గురించి ప్రస్తావించారు. హీరో కుమారుడు తన స్నేహితుడు చాక్లెట్ దొంగిలించడం చూసి టీచర్‌కు చెప్పకుండా ఉండేందుకు అతని నుంచి సగం చాక్లెట్ తీసుకుంటాడన్నారు. అలా ఎందుకు చేశావని తల్లి అడిగితే టీచర్‌కు చెబితే నాకేం వస్తుంది.. చెప్పకుండా ఉంటే సగం చాక్లెట్ వచ్చింది అని అంటాడని.. కాంగ్రెస్ కూడా ఇదే మాదిరిగా విషయాన్ని సెటిల్ చేస్తుందా అని ప్రశ్నించారు. కాగా, భూ భారతి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఆయన చాంబర్‌లో మంత్రి పొంగులేటి సన్మానించారు.
నన్ను మంత్రిగా గుర్తించడం లేదు: పొంగులేటి
‘ప్రతిపక్షం నన్ను మంత్రిగా గుర్తించడం లేదు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. సభ ప్రారంభ సమయంలో ఒక్క మంత్రి కూడా లేరంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన విమర్శపై మంత్రి స్పందించారు. ఆ సమయంలో తాను సభలోనే ఉన్నానని, అయినా తనను ప్రతిపక్ష సభ్యులు మంత్రిగా గుర్తించడం లేదన్నారు.
మరింత మెరుగ్గా రెవెన్యూ సేవలు అందిస్తాం: ట్రెసా
రైతులు, రెవెన్యూ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూసిన తెలంగాణ భూభారతి చట్టం-2024ను శాసన సభ ఆమోదించడంపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. రెవెన్యూ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి సంఘం తరఫున అధ్యక్షుడు కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం సభలో ఆమోదం పొందిన రోజు చారిత్రాత్మకమైన రోజు అని ట్రెసా రాష్ట్ర కార్యవర్గం పేర్కొంది. మరింత మెరుగ్గా సేవలందిస్తామని పేర్కొంది.
Updated Date - Dec 21 , 2024 | 03:25 AM