Minister Ponnam Prabhakar : ఏయ్.. జాగ్రత్త!
ABN , Publish Date - Feb 15 , 2024 | 04:15 AM
ఏయ్.. జాగ్రత్త.. ఏం.. కూర్చో అని మాట్లాడుతున్నావ్. నువ్వు భయపెడితే భయపడడానికి.. కూర్చో అనగానే కూర్చోవడానికి ఇక్కడ పాలేర్లు ఎవరూ లేరు’ అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై

నువు కూర్చోమంటే కూర్చునే పాలేర్లు లేరు.. కేటీఆర్ వ్యాఖ్యలపై పొన్నం ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘ఏయ్.. జాగ్రత్త.. ఏం.. కూర్చో అని మాట్లాడుతున్నావ్. నువ్వు భయపెడితే భయపడడానికి.. కూర్చో అనగానే కూర్చోవడానికి ఇక్కడ పాలేర్లు ఎవరూ లేరు’ అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా బీఆర్‌ఎస్ సభ్యుడు కడియం మాట్లాడుతూ.. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. కాళేశ్వరం గురించి మాట్లాడుతూ.. కరీంనగర్‌కు కూడా నీళ్లొచ్చాయన్నారు. ఆయన మాటలకు స్పందించిన పొన్నం.. కాలువలు ఇపుడేమీ రాలేదని.. గతంలోనే వచ్చాయని, నీళ్లు కూడా గత కాంగ్రెస్ హయాంలో పారాయని గుర్తు చేశారు. ఆ సమయంలో మంత్రిని ‘కూర్చో’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం.. భయపెడితే భయపడ్డానికి ఇక్కడ పాలేర్లు ఎవరూ లేరంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. గతంలో మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి సభలో మంత్రిగా ఉన్న తనను బెదిరించడం ఏంటంటూ మండిపడ్డారు. అదే సమయంలో పాడి కౌశిక్‌రెడ్డి కలుగజేసుకొని మాట్లాడుతుండగా.. ఓట్లేయకపోతే భార్యాపిల్లల శవయాత్ర చూడాల్సి వస్తుందని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసిన వ్యక్తి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. ఎన్నికల ప్రచారంలో చిన్న పాపను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి.. ప్రచారం చేయించారని, ఆ పాప మానసిక పరిస్థితి ఎలా ఉంటుందన్నారు. ఇటు కౌశిక్‌రెడ్డి వద్దకు హరీశ్‌రావు వెళ్లి సర్దిచెప్పారు. ప్రసంగం ముగించిన తర్వాత కూర్చుంటూ.. ‘అధ్యక్షా.. వాళ్లు కూర్చోమన్నారని కూర్చోవడం లేదు’ అని గుర్తుచేసి మరీ తన సీటులో ఆసీనులయ్యారు. మరోవైపు, మంత్రి పొన్నంను కేటీఆర్ ‘కూర్చో’ అంటూ చేసిన వ్యాఖ్యలపై కలుగజేసుకున్న స్పీకర్.. ఒక మంత్రి మాట్లాడుతున్నపుడు కలుగజేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానపర్చడం సమంజసం కాదని చెప్పారు.
కడియం వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
చర్చలో బీఆర్‌ఎస్ సభ్యుడు కడియం మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ చీకటి రోజులున్నాయని, ప్రాజెక్టులు బీఆర్‌ఎస్ హయాంలోనే నిర్మాణం అయ్యాయన్నారు. దానిపై స్పందించిన మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఎల్లంపల్లిని తాను చిన్నవాడిగా ఉన్నప్పుడే మొదలు పెట్టారని చెప్పారు. 2014నాటికే 80ు పూర్తయిన గౌరెల్లి ప్రాజెక్టును కేసీఆర్ కుర్చీ వేసుకుని కూర్చోని మరీ నిర్మిస్తామని చెప్పినా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అదే సమయంలో కేటీఆర్ కలుగజేసుకోగా.. పొన్నం స్పందిస్తూ.. ‘పదేళ్లుగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి.. అప్పర్ మానేరు 9వ ప్యాకేజీని పూర్తిచేయని యువరాజు ఇప్పుడు మాట్లాడితే ఎలా? గౌరెల్లి కంటే ముందే హరీశ్ ప్రాంతంలోని ప్రాజెక్టులు ఎలా పూర్తయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను మించింది. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కొత్త సభ్యులను తప్పుదోవ పట్టించే విధంగా చర్చ చేస్తున్నారు.. నేను కొత్తగా వచ్చిన సభ్యుడిని, సహకారం అందించాలి’ అని వ్యాఖ్యానించారు.