Danam Nagender: పేదల ఇళ్ల జోలికి వెళ్లడం తొందరపాటే
ABN, Publish Date - Sep 30 , 2024 | 03:06 AM
పేదల ఇళ్ల జోలికి వెళ్లడం తొందరపాటు నిర్ణయమే అవుతుందని, బాధితుల్లో భరోసా కల్పించేందుకు నిజనిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరనున్నట్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.
హైడ్రాపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ది దుష్ప్రచారం: దానం నాగేందర్
బంజారాహిల్స్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల జోలికి వెళ్లడం తొందరపాటు నిర్ణయమే అవుతుందని, బాధితుల్లో భరోసా కల్పించేందుకు నిజనిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరనున్నట్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. బంజారాహిల్స్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చెరువులు, కుంటలను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారని, కానీ అధికారులు పేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. జలవిహార్, పార్క్ హోటల్.. శిఖం భూమిలో ఉన్నాయని వాటిని ఎందుకు కూల్చరని ప్రశ్నించారు. వీటి పక్కనే బఫర్ జోన్‌లో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్ పది అంతస్తులు.. శోభా బిల్డర్స్‌కు 15 అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయని.. అప్పట్లో కేటీఆర్ వీటికి ఎలా అనుమతులు ఇచారని నిలదీశారు.
హైడ్రా పేరిట బీఆర్‌ఎస్, బీజేపీ ప్రజలను భయపెడుతున్నాయని, అందరి ఇళ్లు కూల్చేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. గత సీఎం కేసీఆర్ కూడా భవిష్యత్తులో మూసీ నది పొంగితే తీవ్ర అనర్ధం వాటిల్లే ప్రమాదం ఉందని ఓ సర్వే ద్వారా గుర్తించారని చెప్పారు. అప్పట్లో 12వేల మంది నిర్వాసితులను వేరే చోటుకు తరలించాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు. గతంలో బఫర్ జోన్‌లో అక్రమ కట్టాడాలను కూల్చివేయాలని చెప్పిన హరీశ్ ఇప్పుడు మాట మార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 10మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే తమపై ఉన్న కేసును చూపించి బీఆర్‌ఎస్ అధిష్ఠానం వారిని ఆపుతోందని, ఆలస్యమైనా వారు కాంగ్రె్‌సలో చేరడం ఖాయమని చెప్పారు.
Updated Date - Sep 30 , 2024 | 03:06 AM