మంచు ఫైటింగ్స్
ABN, Publish Date - Dec 11 , 2024 | 05:38 AM
సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో రచ్చకెక్కిన ఇంటి గొడవలు మరింత ముదిరి తారస్థాయికి చేరాయి.
మోహన్‌బాబు×మనోజ్
జల్‌పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్తత
భార్యతో కలిసి వెళ్లిన మనోజ్.. లోపలికి
రానివ్వని మోహన్‌బాబు, సెక్యూరిటీ
గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్లిన కుమారుడు
ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి
ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి
మైకు లాక్కొని కొట్టిన మోహన్‌బాబు
ఒక జర్నలిస్టుకు ఫ్రాక్చర్.. పలువురికి గాయాలు
జర్నలిస్టు సంఘాల ఆగ్రహం.. చర్యలకు డిమాండ్
మోహన్‌బాబు లైసెన్స్‌డ్ తుపాకీ సీజ్
నేడు విచారణకు రావాలని నోటీసులు
ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు
మనోజ్.. నా గుండెలపై తన్నావ్
కుమారుడిని ఉద్దేశించి మోహన్‌బాబు ఆడియో
హైదరాబాద్ సిటీ/పహాడీ షరీ్‌ఫ/హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో రచ్చకెక్కిన ఇంటి గొడవలు మరింత ముదిరి తారస్థాయికి చేరాయి. మోహన్‌బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ మధ్య చోటుచేసుకున్న వివాదం మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మనోజ్ బౌన్సర్లు, మోహన్‌బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్ దంపతులను మోహన్‌బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆయన గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఘర్షణను మరింత పెద్దది చేసింది. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటికి వచ్చిన మోహన్‌బాబు.. మీడియా ప్రతినిధులపై దాడి చేశా రు. ఈ దాడిలో ఓ చానల్ ప్రతినిధికి ఫ్రాక్చర్ కాగా, పులువురికి గాయాలు అయ్యాయి. దీంతో జర్నలిస్టు సంఘాలు మోహన్‌బాబు వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కాగా, జల్‌పల్లిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియ్‌సగా తీసుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫిల్మ్‌నగర్ పోలీసులు మోహన్‌బాబు, మనోజ్ లైసెన్స్ గన్‌లను స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు. బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మోహన్‌బాబుకు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు తన కుమారుడు మనోజ్‌ను ఉద్దేశించి మోహన్‌బాబు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో.. మనోజ్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్డారు. భార్య మాటలు విని తప్పుదారి పట్టావంటూ మనోజ్‌ను నిందించారు. ఇంట్లోకి వచ్చే అధికారం, హక్కు మనోజ్‌కు లేవని, తన కష్టార్జితమైన ఆస్తిని తనకు ఇష్టంవచ్చిన వారికి రాసిస్తానని పేర్కొన్నారు.
మనోజ్‌ను ఇంటి నుంచి వెళ్లగొట్టిన విష్ణు బౌన్సర్లు?
మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు దుబాయ్ నుంచి మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు రావడంతో అప్పటిదాకా ఉన్న వివాదం కాస్తా పెద్దదైంది. జల్‌పల్లిలోని నివాసానికి చేరుకున్న విష్ణు.. వస్తూనే తన బౌన్సర్‌లు, తన తండ్రి మోహన్‌బాబు సెక్యూరిటీ సిబ్బందితో కలిసి మనోజ్ బౌన్సర్లను బయటకు వెళ్లగొట్టినట్లు తెలిసింది. ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారంటూ బౌన్సర్‌లను ఆయన కొట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో విష్ణు, మనోజ్ బౌన్సర్ల మద్య గొడవ జరిగింది. దాంతో కాసేపు అక్కడ ఉధ్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత మనోజ్‌ను ఆయన భార్య మౌనికను ఇంటి నుంచి బయటకు పంపినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనోజ్ దంపతులు తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. తిరిగి రాత్రి 7 గంటల సమయంలో వారు నివాసానికి చేరుకున్నారు. అయితే మనోజ్ దంపతులను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్‌బాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని గేట్లు మూసివేశారు. దాంతో ఆగ్రహానికి గురైన మనోజ్.. గేట్లు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఇంట్లో తన పిల్లలు ఉన్నారని, వారి కోసం వచ్చానని చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. దాంతో కాసేపు కారులో వేచి చూసిన మనోజ్.. గేట్లను బద్దలు కొట్టుకొని ఇంట్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోపలికి వెళ్లిన మనోజ్‌ను సెక్యూరిటీ సిబ్బందితోపాటు మోహన్‌బాబు అడ్డుకున్నారు. అనంతరం మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు.
మీడియాపై మోహన్‌బాబు దాడి..
మోహన్‌బాబు నివాసం వద్ద గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు సుమారు 50 మంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో ఇంట్లోంచి గేటు వద్దకు చేరుకున్న మోహన్‌బాబు.. అక్కడ జరుగుతున్న పరిణామాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిదులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. లోగోలను లాక్కొని కోపంతో ఊగిపోతూ విరుచుకుపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో ఒకరిద్దరు కెమెరామెన్‌లు కిందపడ్డారు. దాడిలో ఓ ప్రతినిధికి తల భాగంలో ఫ్రాక్చర్ అయినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా.. అక్కడ ఉన్న పోలీసులు మోహన్‌బాబును అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తాను 70 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్‌ను అని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన మోహన్‌బాబు.. వారి ఎదుటే మీడియాపై దాడి చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడి ఘటనను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మోహన్‌బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ), టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేశాయి. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. మరోవైపు అయ్యప్ప మాలధారణలో ఉన్న మీడియా ప్రతినిధిని మోహన్‌బాబు కొట్టడంపై అయ్యప్ప భక్తులు మండిపడినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. మోహన్‌బాబు ఇంట్లో ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు: మనోజ్
భార్యా పిల్లలతో ఇంటి నుంచి బయటకు వచ్చాక మనోజ్ మీడియాతో మాట్లాడారు. తన పోరాటం డబ్బు కోసమో, ఆస్తుల కోసమో కాదని, ఆత్మగౌరవం కోసమని అన్నారు. తన భార్య పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తాను పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ఇంటికి వచ్చి అన్ని వివరాలు తెలుసుకున్న ఎస్సై.. రక్షణ కల్పిస్తానని చెప్పి పారిపోయారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే తన మనుషులను బెదిరించి భయపెట్టి బయటకు వెళ్లగొట్టారని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సోమవారం రాత్రే తన ఇంట్లో జరుగుతున్న గొడవను మనోజ్ తన ట్విటర్ (ఎక్స్) ఖాతాలో వివరించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఉప ముఖ్యమంత్రులు, తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు. ఇదిలా ఉండగా.. మూడు రోజులుగా మోహన్‌బాబు ఇంటి వద్ద ఇంత రచ్చ జరుగుతూ.. ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా.. పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తండ్రీ కొడుకులు నెట్టుకున్నారంతే: పనిమనిషి
ఆస్తుల పంపకంతో పాటు మనోజ్ రెండో వివాహం కూడా మోహన్‌బాబు కుటుంబంలో గొడవలకు ప్రధాన కారణమనే అభిప్రాయం మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోన్న నేపథ్యంలో వారి ఇంటి పనిమనిషి కూడా అదే విషయాన్ని ప్రస్తావించింది. మోహన్‌బాబు కుటుంబంలో గొడవలకు కారణాలను ఆమె చెబుతుండగా ఓ మీడియా సంస్థ సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటికే ఒక కుమారుడు ఉన్న మౌనికారెడ్డిని మనోజ్ వివాహం చేసుకోవడం మోహన్‌బాబుకు, విష్ణుకు నచ్చలేదని, ఆ వివాహం వల్ల వారు బాగా కలత చెందారని పనిమనిషి పేర్కొంది. ఆ పెళ్లి జరిగినప్పటి నుంచే కుటుంబంలో కలతలు మొదలయ్యాయని, దానికి కొనసాగింపుగానే సిబ్బందిని మందలించే క్రమంలో తాజా గొడవలు మొదలయ్యాయని ఆమె తెలిపింది. మోహన్‌బాబు వద్ద పనిచేసే ప్రసాద్‌ను మనోజ్ ఒక దెబ్బ కొట్టారని, దాంతో మోహన్‌బాబు అడ్డుపడి మనోజ్‌ను పక్కకు నెట్టేశారని, అయినా మనోజ్ వినకపోవడంతో ఇద్దరూ నెట్టుకున్నారని పనిమనిషి చెప్పింది. ఇందులో ఎవరికీ దెబ్బలు తగల్లేదని పేర్కొంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో పనిమనిషి ఆందోళనకు గురై, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మనోజ్.. నా గుండెలపై తన్నావ్: మోహన్‌బాబు
తన చిన్న కుమారుడు మనోజ్‌ను తాను ఎంతో గారాబంగా పెంచానని, ఇప్పుడు అతడే తన గుండెలపై తన్నాడని మోహన్‌బాబు అన్నారు. ఈ మేరకు మనోజ్‌ను ఉద్దేశించి ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతూ, ‘‘మనోజ్.. నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను. నీ చదువు కోసం చాలా ఖర్చుచేశాను. నీ భార్య మాటలు విని నా గుండెలపై తన్నావ్. నా మనసు ఆవేదనతో కుంగిపోతుందిరా. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చాను. నీకు అన్ని ఇచ్చినా నాకు అపకీర్తి తెచ్చి పెట్టావు. తాగుడుకు అలవాటుపడి చెడు మార్గంలో వెళ్తున్నావ్. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి. ఇంట్లో ఉన్న అందరినీ ఎందుకు కొడుతున్నావ్? బతుకుదెరువుకోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహాపాపం. నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి. అయినా కాపాడాను. విద్యా సంస్థల్లో ప్రతిది లీగల్‌గా ఉంది. నువ్వు అక్కడే చదువుకున్నావు. కుల మతాలకు తావులేకుండా మనం విద్యను అందిస్తున్నాం. మన దగ్గర చదువుకున్న వారు ఎంతో గొప్పవారు అయ్యారు. అన్నతో పాటు వినయ్‌ని కొట్టడానికి వచ్చావ్. నీ అన్నను చంపుతానని అన్నావు. నువ్వు నీ భార్య బిహేవ్ చేసే విధానం నీచం. ఎవరు తప్పు చేస్తున్నారనేది భగవంతుడు చూస్తున్నాడురా. అందరికీ మాట్లాడుకునేందుకు ఎంత అవకాశం ఇచ్చాం. నువ్వు ఎందుకిలా చేస్తున్నావ్? నా ఇంట్లో అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. రోడ్డుకెక్కి నా పరువు తీశావు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా..? వద్దా..? అనేది నా ఇష్టం. పిల్లలకు ఇస్తానా. దాన ధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. మా నాన్నలు నాకు ఆస్తులు ఇవ్వలేదు. అయినా నేను సంపాదించుకున్నా. మనోజ్ నన్ను కొట్టలేదు. మేం ఇద్దరం ఘర్షణ పడ్డాం. నా ఇంట్లోకి నువ్వే అక్రమంగా చొరబడ్డావు. నా మనుషులను కొట్లావు. నాకు రక్షణ కావాలని పోలీసులను కోరాను. నీ కూతురును వచ్చి తీసుకెళ్లు. నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదు. జరిగిన సంఘటనతో మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది. పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తా’’ అని తన ఆడియోలో మోహన్‌బాబు అన్నారు.
Updated Date - Dec 11 , 2024 | 05:41 AM