Chegunta : గ్రామస్థుల సూటిపోటి మాటలు.. మనస్తాపంతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య
ABN, Publish Date - Aug 15 , 2024 | 03:03 AM
ఓ వైపు గ్రామస్థుల ఎత్తిపొడుపు మాటలు, మరో వైపు ఒంటరి బతుకులు భరించలేక ఆత్మహత్యే శరణ్యమని భావించిన తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
చేగుంట, ఆగస్టు 14: ఓ వైపు గ్రామస్థుల ఎత్తిపొడుపు మాటలు, మరో వైపు ఒంటరి బతుకులు భరించలేక ఆత్మహత్యే శరణ్యమని భావించిన తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి పోచవ్వ (75) కొన్ని సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయింది. ఆమె కూతరు ఎల్లవ్వ(55) కూడా లచ్చవ్వతోనే ఉంటోంది. ఎల్లవ్వకు పెళ్లై ముత్యం అనే కుమారుడు పుట్టిన తర్వాత ఆమె భర్త వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత ముత్యంకు మక్కరాజ్‌పేట గ్రామానికి చెందిన లావణ్య (రాణి)తో వివాహం జరిపించారు.
కొంతకాలం వీరి సంసారం సాఫీగానే సాగింది. కానీ కొన్నాళ్లకు లావణ్య ఆత్మహత్య చేసుకుంది. అయితే, అత్తింటి వారే అదనపు కట్నం కోసం వేధించారని, నిత్యం గొడవలు పడుతూ చిత్రహింసలకు గురి చేసి ఆమె మరణానికి కారణమయ్యారని కేసు నమోదు కావడంతో ముత్యం జైలుకు వెళ్లాడు. విడుదలైన తర్వాత తన పిల్లలను తీసుకుని ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. దీంతో లచ్చవ్వ, ఎల్లవ్వలు గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే, కోడలి మరణానికి కారణమయ్యారంటూ గ్రామస్థులు సూటిపోటి మాటలు అంటుండటాన్ని భరించలేకపోయారు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఇద్దరు వేర్వేరు గదుల్లో ఉరి వేసుకున్నారు. బుధవారం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా, ఇద్దరు వేర్వేరు గదుల్లో ఉరికి వేలాడుతూ కనిపించారు.
Updated Date - Aug 15 , 2024 | 03:03 AM