GPS tracker: భద్రాద్రి జిల్లాలో ‘గూఢచార రాబందు’!
ABN , Publish Date - Oct 03 , 2024 | 04:51 AM
చర్ల అటవీ ప్రాంతంలో కెమెరా, జీపీఎస్ ట్రాకర్ అమర్చిన ‘గూఢచార రాబందు’ సంచారం కలకలం సృష్టించింది.
కెమెరా, జీపీఎస్ ట్రాకర్‌తో సంచారం..
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): చర్ల అటవీ ప్రాంతంలో కెమెరా, జీపీఎస్ ట్రాకర్ అమర్చిన ‘గూఢచార రాబందు’ సంచారం కలకలం సృష్టించింది. అయితే మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీసులే పంపి ఉంటారని తొలుత భావించగా.. తమది కాదని పోలీసులు స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం సమీపంలో గుట్టపై బుధవారం ఓ రాబందు ఎగరలేని స్థితిలో వచ్చి వాలింది. అది ఆకలి, అలసటతో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు ఆహారం అందించారు.
అయితే రాబందు కాళ్లకు కెమెరా, జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉండటంతో.. కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రాబందు ఆహారం ఆరగించిన కాసేపటికే ఎగురుకుంటూ వెళ్లిపోయింది. రాబందు సంచారంపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కాగా, చర్లలో సంచరించిన రాబందు మద్యప్రదేశ్‌లోని టైగర్ రిజర్వుకు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. రెండు డజన్ల రాబందుల కదలికల్ని పర్యవేక్షించేందుకు రెండేళ్ల క్రితం జీపీఎ్‌సతో ట్యాగ్ చేసినట్లు చెబుతున్నారు.