Thummala: వడ్ల నిల్వ, మార్కెటింగ్ సమస్యలతోనే వ్యవసాయ సంక్షోభం
ABN, Publish Date - Jun 07 , 2024 | 02:58 AM
స్వాతం త్య్రం వచ్చాక దేశంలో ధాన్యం ఉత్పత్తి 8 రెట్లు పెరిగి, 14 కోట్ల టన్నులకు చేరుకున్నదని, వడ్ల ఉత్పత్తికి కావాల్సిన అన్ని వనరులు సాంకేతికత రైతుకి అందుబాటులోకొచ్చినా సాగు పరంగా సంక్షోభం ఇవాళ్టికీ పెద్ద సవాలుగానే మిగిలిపోయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
దిగుబడి పెరిగినా ఎగుమతుల్లో వెనుబడ్డాం
ఎగుమతులు పెరిగితే రైతాంగానికి సరైన ధర
నేడు హైదరాబాద్‌లో ప్రపంచ వరి సదస్సు
అధునాతన మిల్లులు వాడితే మరింత నాణ్యత
సదస్సులో మిల్లర్లకు అవగాహన: తుమ్మల
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): స్వాతం త్య్రం వచ్చాక దేశంలో ధాన్యం ఉత్పత్తి 8 రెట్లు పెరిగి, 14 కోట్ల టన్నులకు చేరుకున్నదని, వడ్ల ఉత్పత్తికి కావాల్సిన అన్ని వనరులు సాంకేతికత రైతుకి అందుబాటులోకొచ్చినా సాగు పరంగా సంక్షోభం ఇవాళ్టికీ పెద్ద సవాలుగానే మిగిలిపోయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయం పరంగా రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగే ప్రధాన కారణాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ‘ప్రపంచ వరి సదస్సు’ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం తుమ్మల ఓ ప్రకటన విడుదల చేశారు. దేశం నుంచి 5కోట్ల టన్నుల మేర ధాన్యం దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతుందని, ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా 45శాతంగా ఉందని చెప్పారు.
ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు, కొన్ని ఐరోపా దేశాలు సహా అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ధాన్యం కోసం భారత్‌వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాలను వినియోగించుకుంటే రైతులకు సరైన ధర లభిస్తుందని, మార్కెట్ నిల్వల పరంగా నెలకొన్న సమస్యనూ పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. ‘‘అంతర్జాతీయ కామోడిటీ సంస్థ వారు 22 ఏళ్లుగా ఏటా ఒక్కోదేశంలో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నారు. వరి ఎగుమతి, దిగుమతిదారులతో పాటు ప్రముఖ వరి శాస్త్రవేత్తలు, వరి పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి వరి అభివృద్థికి కావాలసిన విధానపరమైన అంశాలను సదస్సు చర్చిస్తుంది’’ అని తెలిపారు. సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 150 మంది ధాన్యం ఎగుమతిదారులు, దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (పిలిప్పైన్స్) నుంచి శాస్త్రవేత్తలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని, మన దేశీయ వరి ఎగుమతిదారులు, ఇతర దేశాల నుండి వచ్చే ధాన్యం దిగుమతిదారులతో నేరుగా సంప్రదింపులు జరిపుకొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అధునాతనమైన రైస్ మిల్లుల ద్వారా ఎగుమతికి కావాల్సిన నాణ్యతను ఎలా పాటించవచ్చనేది మిల్లర్లకు అవగాహన కలుగుతుందన్నారు. నాగార్జునసాగర్ పరీవాహక ప్రాంతంలో సాగయ్యే హెచ్‌ఎంటీ, సూర్యాపేట, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో పండించే 1010 బాయిల్డ్ రకం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పండే జై శ్రీరాం రకం, మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ చేేస ఐఆర్64 (స్టీమ్ రైస్)కు బయటి బయటి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, వీటి ఎగుమతుల అవకాశాలను కంపెనీల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాల ద్వారా పెంచడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. సదస్సుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ హాజరవుతారని వెల్లడించారు.
Updated Date - Jun 07 , 2024 | 02:58 AM