CM Revanth Reddy:సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. వరద బాధితులకు భరోసా
ABN, Publish Date - Sep 02 , 2024 | 03:51 PM
తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా పడుతున్న వానలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(సోమవారం) సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.
సూర్యాపేట: తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా పడుతున్న వానలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(సోమవారం) సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 30 సెం మీ వర్షం కురిసిందని అన్నారు. జిల్లాలో ఇద్దరు దుర్మరణం చెందగా 21 చెరువులు కట్టలు తెగాయని తెలిపారు. సాగర్ ఎడమ కాలువకు గండి పడటంతో 15 గ్రామాలకు వరద పొటెత్తిందని అన్నారు. 450 మంది నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు.
అధికారులు చక్కగా పనిచేశారు...
వరద ఉధృతికి 7 పక్కా ఇళ్లు కూలిపోయాయని, 33 ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. విపత్కర సమయంలో అధికారులు చక్కగా పనిచేశారని అన్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిస్థితులపై సహాయం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పరిపాలన నిర్ణయం తీసుకొని వరదల వల్ల చనిపోయిన వారికి రూ.5 లక్షల పరిహారం, పశువులు చనిపోతే రూ.50వేలు ఇస్తామని తెలిపారు. జిల్లాలో 20 వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రతీ రైతుకు ఎకరాకు రూ. 10వేల చొప్పున పంట నష్ట పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
బురద రాజకీయాలు చేయొద్దు..
ఇళ్లు కూలిన నిరాశ్రయులకు ఇందిరమ్మ ఇళ్లు, పీఎం నివాస్ యోజన కింద ఇళ్లను కట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించడానికి సూర్యాపేట కలెక్టర్కు రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. వర్షం ఇబ్బందులపై అమెరికాలో ఒకాయన ట్విట్టర్లో.. ఇంకొకరు ఫామ్ హౌస్లో ఉండి మరొకరు బురద రాజకీయాలు చేయొద్దు అని హితవు పలికారు. విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలను మాజీ మంత్రి కేటీఆర్ తీసుకొని పోయారని.... ప్రస్తుత పరిస్థితుల్లో వారిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ మాదిరిగా రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో బృందంలో 100 మంది ఉండేలా 8 బృందాలకు శిక్షణ ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
NRI: ముగిసిన ఆప్త 16వ వార్షికోత్సవం
Seethakka: భారీ వర్షాలపై మంత్రి సీతక్క సమీక్ష
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 02 , 2024 | 04:25 PM