Jagadish Reddy: రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా..?
ABN, Publish Date - Aug 20 , 2024 | 01:53 PM
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ రాగానే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతామని స్పష్టం చేశారు.
హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ రాగానే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతామని స్పష్టం చేశారు.
ఈరోజు (మంగళవారం) తెలంగాణ భవన్‌లో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్లీ అధికారంలోకి వస్తే పెడదామని అనుకున్నామని చెప్పారు. ఆ విషయం ముందే ప్రకటించామని అన్నారు. రాజీవ్ గాంధీకి తెలంగాణ పేరు తెలుసా అని విమర్శించారు. రాజీవ్ గాంధీ తెలంగాణకు ఒక్కరూపాయి మేలు చేశారా అని నిలదీశారు. చిల్లర చేష్టలు తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన చోట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే నిర్ణయం జరిగిందని వెల్లడించారు.
రుణమాఫీపై కాంగ్రెస్ పగటి దొంగలా దొరికిందని విమర్శించారు. రూ.17లక్షల 13వేల మందికి ఇంకా రుణమాఫీ జరగలేదని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారని తెలిపారు. రుణమాఫీ పడని రైతులకు ఏ తేదీలోపు చేస్తారో చెప్పాలని నిలదీశారు. సీఎం రేవంత్ రుణమాఫీ పూర్తి అయిందని డ్యాన్స్ లు చేస్తున్నారని విమర్శలు చేశారు.
మంత్రులు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదని అంటున్నారని.. సీఎం రేవంత్ చెప్పింది పచ్చి అబద్దమని ఉత్తమ్ మాటలతో తేలిపోయిందన్నారు. అబద్దం చెప్పినందుకు సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముక్కు నేలకు రాసి చెంపలు వేసుకోవాలని అన్నారు. రుణమాఫీ కోసం రైతులకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని చెప్పారు. ఒక్కో మంత్రి ఒక్కో రకంగా చెబుతున్నారన్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని జగదీష్ రెడ్డి ఆరోపణలు చేశారు.
Updated Date - Aug 20 , 2024 | 01:53 PM