New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. పేదల చుట్టం
ABN, Publish Date - Aug 05 , 2024 | 05:03 AM
రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం.. పేదలు, రైతులకు చుట్టంగా మారనుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సేవలు సులభంగా, వేగంగా అందడంతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఒకరిద్దరి అవసరాలకు కాకుండా భవిష్యత్తు తరాలకూ ఉపయోగపడేలా రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్) చట్టం-24 ముసాయిదా ఉందని అన్నారు.
దేశంలో భూ సంస్కరణల దిశగా ఇది పెను మార్పు.. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా రూపకల్పన
భూధార్, ఆబాదీకి హక్కుల రికార్డులు
ముసాయిదాపై చర్చలో వక్తలు
హైదరాబాద్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం.. పేదలు, రైతులకు చుట్టంగా మారనుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సేవలు సులభంగా, వేగంగా అందడంతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఒకరిద్దరి అవసరాలకు కాకుండా భవిష్యత్తు తరాలకూ ఉపయోగపడేలా రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్) చట్టం-24 ముసాయిదా ఉందని అన్నారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దీని రూపకల్పన జరిగిందని.. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీసీఎల్‌ఏ నవీన్ మిత్తల్ పాత్ర కీలకమని కొనియాడారు.
ఎన్నడూ లేని విధంగా ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం ఉంచడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆర్‌వోఆర్ చట్టం-24 ముసాయిదాపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథులుగా భూ చట్టాల నిపుణులు భూమి సునీల్‌కుమార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ విద్య ఆచార్యుడు జీబీ రెడ్డి, విశ్రాంత రెవెన్యూ అధికారులు రవీంద్రబాబు, బాలరాజు, డిప్యూటీ కలెక్టర్లు కె.రామకృష్ణ, రమేష్ మాట్లాడారు. కొత్త ఆర్‌వోఆర్ చట్టం కోసం 18 రాష్ట్రాల్లోని చట్టాలను నిశితంగా అధ్యయనం చేసి, వాటిలోని ఉత్తమ విధానాలకు చోటిచ్చినట్లు సునీల్ తెలిపారు. స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు ఉన్నప్పుడే ఏ రైతుకైనా భూమిపై సంపూర్ణ హక్కులు దక్కుతాయన్నారు. వీటి కేంద్రంగానే కొత్త చట్టం ఉంటుందని, వ్యవసాయేతర భూములకు కూడా రికార్డు రాబోతుందని చెప్పారు. దేశంలో వస్తున్న మార్పులకు, కేంద్రం తెస్తున్న విధానాలకు అనుగుణంగా కొత్త చట్టం ఉందన్నారు. దీనిపై సలహాలు, సూచనలు చేయాలని కోరారు.
కొత్త చట్టంలో అధికారాల వికేంద్రీకరణ
ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఏ చిన్న సమస్య వచ్చినా సీసీఎల్‌ఏకు రావాల్సిన పరిస్థితి ఉందని లచ్చిరెడ్డి ఆరోపించారు. కొత్త చట్టంలో అధికారాల వికేంద్రీకరణ కారణంగా ప్రజలకు గ్రామ, మండల స్థాయిలోనే ేసవలు అందుబాటులోకి వస్తాయన్నారు. క్షేత్రస్థాయిలో భూ పరిపాలన వ్యవస్థలను బలోపేతం చేస్తూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కొత్త చట్టం అవసరమైందని వివరించారు. గత పాలకులు చట్టాన్ని చేసి ప్రజల్లోకి తెచ్చారని.. ఇప్పుడు మాత్రం ప్రజల నుంచే చట్టం రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త చట్టం ముసాయిదాను అందరికీ అందుబాటులో ఉంచిందన్నారు.
పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను మార్చుకునే వెసులుబాటు ఇందులో ఉందని తెలిపారు. గ్రామానికో రెవెన్యూ అధికారి ేసవలందించే రోజులు కూడా రాబోతున్నాయన్నారు. అప్పీల్, రివిజన్ అవకాశం లేని ప్రస్తుత చట్టంతో.. ఏ చిన్న సమస్య వచ్చినా సివిల్ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఉందని ప్రొఫెసర్ జీబీరెడ్డి అన్నారు. ఇది ఇబ్బందికరమే కాక ఆర్థికంగా భారమని పేర్కొన్నారు. కొత్త చట్టం ముసాయిదా బాగుందని.. స్వల్ప మార్పులతో తక్షణమే అమల్లోకి తెస్తే అత్యున్నమైనదిగా నిలిచిపోతుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు, ప్రజలు, రైతులకు మేలు చేేసదిగా ఉంటుందన్నారు.
Updated Date - Aug 05 , 2024 | 05:03 AM