Jupalli : హుస్సేన్‌సాగర్ చుట్టూ వలయాకార స్కైవే
ABN, Publish Date - Sep 14 , 2024 | 04:42 AM
హుస్సేన్‌సాగర్ జలాశయం చుట్టుపక్కల ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మార్చేలా వలయాకార స్కైవే నిర్మిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ట్యాంక్‌బండ్ చుట్టూ స్కై వాక్
నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో బోటు షికారు
ఎకో-టూరిజం కేంద్రంగా చాకలిగట్టు
ఆకట్టుకునేలా పర్యాటక విధానం
‘ఆంధ్రజ్యోతి’తో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): హుస్సేన్‌సాగర్ జలాశయం చుట్టుపక్కల ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మార్చేలా వలయాకార స్కైవే నిర్మిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. స్కై వాక్ ద్వారా ట్యాంక్‌బండ్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలను చూసే వీలు కల్పిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన చరిత్రాత్మక, ఆధ్యాత్మిక, అటవీ ప్రాంతాల్లో వసతి సౌకర్యాలను మెరుగుపరిచేలా నూతన పర్యాటక విధానానికి రూపకల్పన చేస్తున్నట్టు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జూపల్లి చెప్పారు. ఎకో-టూరిజం, హెల్త్ టూరిజం తదితర రంగాలకు పర్యాటక ప్రాధాన్యతను విస్తరించేందుకు స్థానిక కళలకు, ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. పర్యాటక రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పర్యాటక రంగ నిపుణులతో చర్చించడంతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై పర్యాటక రంగం అభివృద్ధి కోసం తీసుకోవలిసిన అంశాలపై సమీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
ఖజానాకు ఆదాయవనరుగా పర్యాటక శాఖ
ప్రభుత్వ నిధులతో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడమే కాకుండా పర్యాటక శాఖ రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా గుర్తింపు పొందడానికి కృషి చేస్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పర్యాటకులకు అవసరమైన రుచికరమైన భోజనం, ఆహ్లాదంగా గడిపేందుకు అవసరమైన వసతి సౌకర్యాలు, ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు సరైన రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి ఆయా శాఖలు, సంస్థల సహకారం తీసుకోవాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. పర్యాటక శాఖ, సంస్థ ఆస్తులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా విస్తృత స్థాయిలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు, ఆదే స్థాయిలో ఆదాయాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ పర్యాటకులను ఆకట్టుకునేందుకు నాగార్జునసాగర్‌లో బుద్ధవనంను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. బుద్ధవనంలో మ్యూజియం అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయిస్తామన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో బోటు షికారుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. అలాగే కృష్ణానది నీటి ప్రవాహం మధ్య 400 ఎకరాల విస్తీర్ణంలోని ద్వీపం చాకలిగట్టు ప్రాంతాన్ని ఎకో-టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అమ్రాబాద్, కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాల్లో పర్యాటకుల విడిది కేంద్రాలుగా, రాత్రి వేళల్లో అక్కడే బసచేసే విధంగా కాటేజీలను నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వివరించారు.
Updated Date - Sep 14 , 2024 | 04:42 AM