BRS vs Congress: నిజామాబాద్‌లో సేమ్ సీన్ రిపీట్.. ఆ పార్టీ దుఖానం ఖాళీ..!
ABN, Publish Date - Jun 21 , 2024 | 02:02 PM
తెలంగాణను(Telangana) సాధించిన పార్టీ.. అప్రతీహతంగా పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ బీఆర్ఎస్‌కు(BRS) గడ్డుకాలం నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీ ఉనికినే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
హైదరాబాద్, జులై 21: తెలంగాణను(Telangana) సాధించిన పార్టీ.. అప్రతీహతంగా పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ బీఆర్ఎస్‌కు(BRS) గడ్డుకాలం నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీ ఉనికినే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో.. పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలో చేరేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కాంగ్రెస్, బీజేపీల్లోకి వలస వెళ్లగా.. ఇప్పుడు మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుగానే ఉందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అటు పాలనలో.. ఇటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్వయంగా కలిసిన ఆయన.. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
తాజాగా మాజీ మంత్రి, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలిశారు సీఎం రేవంత్. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం ఆహ్వానం మేరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి బాటలోనే బాన్సువాడ బీఆర్ఎస్ శ్రేణులు పయనిస్తున్నాయి. ఆయనతో పాటు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఫలితంగా త్వరలోనే బీఆర్ఎస్ శిబిరం ఖాళీ అవనున్నట్లు కనిపిస్తోంది.
ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గ నేతలు సైతం కాంగ్రెస్ వైపు తొంగి చూస్తున్నారు. పోచారం వెంట కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గతంలోనూ ఇదే సీన్ జరిగింది. అప్పట్లో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో(బీఆర్ఎస్) చేరిన మొదటి నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన తరువాత టీడీపీ నేతంలా టీఆర్ఎస్(బీఆర్ఎస్) బాట పట్టారు. ఇప్పుడు కూడా పోచారం వెంట అదే సీన్ రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
For More Telangana News and Telugu News..
Updated Date - Jun 21 , 2024 | 02:25 PM