స్టైపెండ్ వివరాలివ్వకుంటే చర్యలు తప్పవు
ABN, Publish Date - Nov 30 , 2024 | 05:10 AM
వైద్య విద్య పూర్తి చేసి ఇంటర్నీలుగా పనిచేస్తున్న వారితోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మెడికోలకు సకాలంలో స్టైపెండ్ అందడంలేదని కొందరు విద్యార్థులు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ)కు ఫిర్యాదు చేశారు.
మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ షోకాజ్ నోటీసులు
రాష్ట్రంలో 12 ప్రభుత్వ, 13 ప్రైవేటు కాలేజీలకు.. దేశవ్యాప్తంగా 198 కళాశాలలకు జారీ
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య పూర్తి చేసి ఇంటర్నీలుగా పనిచేస్తున్న వారితోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మెడికోలకు సకాలంలో స్టైపెండ్ అందడంలేదని కొందరు విద్యార్థులు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ)కు ఫిర్యాదు చేశారు. అలాగే వారికి చెల్లించే స్టైపెండ్ వివరాలను సకాలంలో ఎన్‌ఎంసీకి మెడికల్ కాలేజీలు పంపడం లేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్‌ఎంసీ దేశవ్యాప్తంగా 198 మెడికల్ కాలేజీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటిలో తెలంగాణలో 12 ప్రభుత్వ, 13 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి.
నీలిమ, కామినేని, ఫాదర్ కొలొండో, అరుంధతి, ప్రతిమ, టీఆర్‌ఆర్, మహావీర్, మహేశ్వర, ఆర్వీఎమ్, మల్లారెడ్డి విమెన్స్, అపోలో, మల్లారెడ్డి మెడికల్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్టైపెండ్ వివరాలను ప్రతి నెలా ఐదో తేదీలోగా ఎన్‌ఎంసీకి మెయిల్ చేయాలి. అలాగే ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పూర్తి వివరాలనూ అందజేయాలి. ఈ వివరాలను అనేక కాలేజీలు పంపడంలేదని ఎన్‌ఎంసీ పేర్కొంది. అలాగే వాటిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసుల్లో కోరింది. షోకాజ్ నోటీసులందిన మూడు రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెడికోలకు చెల్లించిన స్టైపెండ్ వివరాలను పంపాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించింది.
Updated Date - Nov 30 , 2024 | 05:10 AM