Share News

లగచర్ల కేసులో కేటీఆర్‌ను ఇరికించాలనుకున్నారు

ABN , Publish Date - Dec 26 , 2024 | 03:29 AM

లగచర్ల ఘటనలో తనతోపాటు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కూడా ఇరికించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు.

లగచర్ల కేసులో కేటీఆర్‌ను ఇరికించాలనుకున్నారు

  • నేను జడ్జికి లేఖ రాయడంతో ఆగిపోయారు

  • దీంతో ఈ-రేస్‌ కేసులో అరెస్ట్‌కు యత్నం

  • నన్ను అక్రమంగా జైల్లో పెట్టి పైశాచికానందం పొందారు

  • అల్లు అర్జున్‌పై కూడా అక్రమ కేసే: పట్నం నరేందర్‌రెడ్డి

  • బొంరాస్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరైన మాజీ ఎమ్మెల్యే

పరిగి/బొంరా్‌సపేట్‌, , డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): లగచర్ల ఘటనలో తనతోపాటు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కూడా ఇరికించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. ఇది అక్రమ కేసు అని, తాను జైలు నుంచే స్వయంగా జడ్జికి లేఖ రాసి కుట్రను భగ్నం చేశానని తెలిపారు. తాను పంపిన లేఖను జడ్జి పరిశీలించిన తర్వాతే కేటీఆర్‌ అరెస్టును ఆపారని చెప్పారు. లగచర్ల ఘటనతో కేటీఆర్‌పై కక్ష సాధించే అవకాశం దక్కకపోవడంతో ఫార్ములా ఈ-రేస్‌ పేరుతో అరెస్ట్‌ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి నివాసంలో నరేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పాలన అంతా డైవర్షన్‌ పాలిటిక్స్‌, కక్ష సాధింపులేనని ఆరోపించారు. తనను 37 రోజులు జైల్లో పెట్టి పైశాచికానందం పొందారని మండిపడ్డారు.


దేశ చరిత్రలో ఓట్లు వేసి గెలిపించిన రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. లగచర్ల ఘటనకు నిఘా వ్యవస్థ, పోలీసుల వైఫల్యమే కారణమని, ఈ ఘటనతో ముఖ్యమంత్రి పరువు పోవడంతో దానిని బీఆర్‌ఎ్‌సపైకి మళ్లించే ప్రయత్నం చేశారని నరేందర్‌ రెడ్డి విమర్శించారు. సినీ నటుడు అల్లు అర్జున్‌పై పెట్టింది కూడా అక్రమ కేసేనన్నారు. రైతు రుణమాఫీ కేవలం 30-40 శాతం మందికి మాత్రమే అయిందని, మొత్తం మాఫీ అయిందని చెబుతున్న సీఎంది నోరేనా? అని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, లగచర్ల ఘటనలో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన పట్నం నరేందర్‌రెడ్డి.. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం బొంరా్‌సపేట్‌ పోలీ్‌సస్టేషన్‌లో హాజరయ్యారు. ప్రతి బుధవారం పోలీ్‌సస్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 26 , 2024 | 03:29 AM