ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెద్దాస్పత్రులపై ‘శవ’ రాజకీయాలు!

ABN, Publish Date - Sep 23 , 2024 | 05:16 AM

రాష్ట్రంలో సర్కారీ దవాఖానాలపై రాజకీయాలు చేస్తున్నారు. పెద్దాస్పత్రులపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే ప్రాణాలు పోతాయన్న భయాన్ని పేదల్లో కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

  • మరణాలపై రోగుల్ని భయపెడుతున్న నేతలు

  • పేదల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న పార్టీలు

  • నాడు కాంగ్రెస్‌.. నేడు అదే దారిలో బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సర్కారీ దవాఖానాలపై రాజకీయాలు చేస్తున్నారు. పెద్దాస్పత్రులపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే ప్రాణాలు పోతాయన్న భయాన్ని పేదల్లో కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధర్మాస్పత్రుల్లో సరైన చికిత్స అందక రోగులు మరణిస్తున్నారంటూ ఆరోపణలు చేయడం, గణాంకాలు విడుదల చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో మరణాలపై నాలుగు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘ఒకే నెలలో గాంధీ ఆస్పత్రిలో 48 మంది పసిగుడ్డులు, 14 మంది బాలింతలు ప్రాణాలు కోల్పోయారని, ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోందని, రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా?’ అంటూ ప్రశ్నించారు. అలాగే ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తే భయంగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. కేటీఆర్‌ పోస్టుపై వైద్యమంత్రి దామోదర ఘాటుగా స్పందించారు. గాంధీ ఆస్పత్రిపై బురద జల్లి, అక్కడికి వచ్చే నిరుపేదల మనోస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని హితవు పలికారు.

కార్పొరేట్‌ ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చాలన్నదే ఆయన ప్రయత్నమని ఆరోపించారు. వైద్యమంత్రి కౌంటర్‌పై మళ్లీ కేటీఆర్‌ స్పందించారు. మరణాలపై సమీక్ష చేయాలని, సంఖ్యను ఎందుకు దాస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దానిపై మళ్లీ మంత్రి కౌంటరివ్వడంతో బీఆర్‌ఎస్‌ తిరిగి స్పందించింది. గాంధీలో మాతాశిశు మరణాలపై సర్కారు అమానవీయంగా స్పందిస్తోందని, ఈ అంశంపై పార్టీ తరఫున ఒక నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైద్య శాఖ మాజీ మంత్రి రాజయ్య, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌తో కమిటీ వేశారు. ఆదివారం కేటీఆర్‌ వారితో సమావేశమయ్యారు. సోమవారం ఆ కమిటీని గాంధీతో పాటు సర్కారీ దవాఖానాలకు వెళ్లాలని సూచించారు. గతంలో కొవిడ్‌ సమయంలో గాంధీలో రోజూ వందల సంఖ్యలో మరణాలు సంభవించగా..


నాడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కూడా మరణాలను దాచింది. అప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ కూడా గాంధీ మరణాలపై ప్రశ్నించింది. నాడు కాంగ్రెస్‌, నేడు బీఆర్‌ఎస్‌ పెద్దాస్పత్రులను తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఒకే బెడ్‌పై ఇద్దరు ముగ్గుర్ని ఉంచి వైద్యం చేస్తున్న ఫొటోలు మీడియాలో వస్తే.. నాటి సీఎం కేసీఆర్‌ డాక్టర్లు బాగా వైద్యం చేయడం వల్లనే అంతమంది వస్తున్నారని సమర్థించుకున్నారు. నేడు మళ్లీ అటువంటి కథనాలు, ఫొటోలు వస్తే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కారీ వైద్య వ్యవస్థలన్నీ విఫలం అయ్యాయన్న అభిప్రాయాల్ని పేద రోగుల్లో కల్పిస్తోంది. గాంధీ, ఉస్మానియాలాంటి ఆస్పత్రుల్లో మరణాలు పెద్దసంఖ్యలో ఉండడానికి కారణాలు లేకపోలేదు. కేటీఆర్‌ పేర్కొన్న 14 ప్రసూతి మరణాలన్నీ కూడా చివరి దశలో గాంధీకివచ్చినవేనని వారి రిపోర్టులను బట్టి తెలుస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొంది, డబ్బులు పెట్టలేక అక్కడి నుంచి చివరి దశలో గాంఽధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వచ్చే కేసులు భారీ సంఖ్యలో ఉంటాయి. సర్కారీ ఆస్పత్రులకు వచ్చిన ఒకట్రెండు రోజుల్లోనే వారు మరణిస్తున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 05:16 AM