Food Safety: అరటిపండ్లతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ..
ABN, Publish Date - Jul 14 , 2024 | 04:45 AM
అరటిపండ్లు, ఉప్పు, నాసిరకం అల్లం, వెల్లుల్లితో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
600 కేజీలు పట్టివేత.. వ్యాపారి అరెస్ట్
కంది, జూలై 13: అరటిపండ్లు, ఉప్పు, నాసిరకం అల్లం, వెల్లుల్లితో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ గ్రామ శివారులోని ‘తాహా ఫుడ్స్’పై పోలీసులు, ఆహారభద్రతా అధికారులతో కలిసి ఈ నెల 4న దాడులు నిర్వహించి 600 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలను సీజ్ చేశారు. శాంపిళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఆహార భద్రత ల్యాబ్‌కు పంపించారు.
ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో తాహా ఫుడ్స్‌లో తయారవుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నాసిరకమని తేలింది. అరటిపండ్లు, ఉప్పు, నాసిరకం అల్లం, వెల్లుల్లితో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారని ఆహార భద్రతా అధికారులు వెల్లడించారు. శనివారం తాహా ఫుడ్స్ యజమాని వసీంను అరెస్ట్ చేసి, ఆహార కల్తీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Jul 14 , 2024 | 04:45 AM