Allu Arjun: విచారణకు రండి..
ABN, Publish Date - Dec 24 , 2024 | 03:09 AM
మధ్యంతర బెయిల్‌పై ఉన్న నటుడు అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఉదయం 11 గంటలకు రావాలని అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసు
నేటి నుంచి రోజువారీ విచారణ?
బడ్జెట్ పెరిగితే టికెట్ రేట్లు పెంచాలి
సీఎంను కలిసే అంశంపై దిల్ రాజు
వచ్చాక నిర్ణయం: నిర్మాత నాగవంశీ
ధరల పెంపు మధ్యతరగతికి భారం
ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
ఏపీ ప్రభుత్వమూ ఇలాగే చెయ్యాలి
ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటన
శ్రీతేజ్‌కు ‘పుష్ప’ నిర్మాతల పరామర్శ
కోమటిరెడ్డితో కలిసి ఆస్పత్రికి వెళ్లి అతడి తండ్రికి రూ.50 లక్షల చెక్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మధ్యంతర బెయిల్‌పై ఉన్న నటుడు అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 18 మంది మీద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చారు. అయన్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండు విధించింది. అల్లు అర్జున్ దీనిపై హైకోర్టును ఆశ్రయించగా రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అనంతరం.. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం అల్లు అర్జునేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో.. అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ పతిక్రా సమావేశం నిర్వహించి, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన విషయం విదితమే. అసలు రేవతి మరణం గురించి తనకు మర్నాటిదాకా తెలియదని.. ఆరోజు రాత్రి థియేటర్‌లో పోలీసులు తనవద్దకు రాలేదని బన్నీ చెప్పగా.. థియేటర్ నుంచి ఆరోజు రాత్రి ఆయన్ను తాము దగ్గరుండి బయటకు తీసుకువస్తున్న దృశ్యాలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. అల్లు అర్జున్‌ను పోలీసులు విచారణకు పిలవడం గమనార్హం. జరిగిన దుర్ఘటన గురించి మర్నాడు ఉదయం వరకూ తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్పిన నేపథ్యంలో.. ఆయన్ను ఎంతసేపు విచారిస్తారు? ఏయేప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే అంశం ఆసక్తికరంగా మారింది. కాగా.. ఈ కేసు విషయమై పోలీసులు అల్లు అర్జున్‌ను మంగళవారం ఒక్కరోజే కాక.. రోజూ విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం.
సినీ వర్గాల సమావేశం..
సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఫిలిం చాంబర్ సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరై చర్చించారు. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని.. టికెట్ రేట్లు పెంచబోమని అంటే ఎలా అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సినిమాకు అనుకున్న బడ్జెట్‌కు మించి ఖర్చు అయినప్పుడు మాత్రమే టికెట్ రేట్లు పెంచాలని అడుగుతాం తప్ప.. ప్రతి సినిమాకూ అడగం’’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. దీనిపై సీఎంను కలిసే ఆలోచన ఏమైనా ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. ఫిలిం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, ఆయన ఇక్కడికి వచ్చాక ముందు ఆయనతో సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని నాగవంశీవెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోదని ఆయన పేర్కొన్నారు. కాగా.. టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్ రెడ్డి ప్రకటించారు. ‘‘సినిమా టికెట్ ధరలను పెంచడం వల్ల ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.
పెరిగిన టికెట్ రేట్లతో మధ్య తరగతి ప్రేక్షకులు, విద్యార్థులు సినిమాలకు రాలేకపోతున్నారు. ఇది కలెక్షన్లపైనా ప్రభావం చూపుతోంది. టిక్కెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లే ఏపీ ప్రభుత్వమూ బెనిఫిట్ షోస్, టికెట్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది’’ అని ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ ఎస్.రామ్ ప్రసాద్ అన్నారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి పరిణామం. సినిమాను ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేయడం ఎలా అనే దానిపై నిర్మాతలు దృష్టి పెట్టాలి’’ అని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలగోవింద్ రాజ్ సూచించారు. టీఎ్‌ఫపీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ కూడా.. టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల చిన్న సినిమాలకు మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచడం వల్ల చిన్న చిత్రాలపై భారం పడుతోంది. ఏడాదికి రిలీజయ్యే చిత్రాల్లో చిన్న చిత్రాలే 90 శాతం ఉన్నాయి. కేవలం 10 శాతం మాత్రమే పెద్ద చిత్రాలు ఉంటున్నాయి. చిన్న చిత్రాలకు డిజిటల్ రైట్స్ విషయంలో యూఎ్‌ఫవో క్యూబ్ ధరలు అధికంగా ఉన్నాయి. మిగతా రాష్ట్రాలో రూ.1500 ఉంటే మన దగ్గర పది వేలు వారానికి వసూలు చేస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాతల సాయం..
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ‘పుష్ప-2’ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి పరామర్శించారు. అతడి తండ్రికి రూ.50 లక్షల చెక్కు అందజేశారు. బాలుడికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘‘ఇక ఈ విషయాన్ని రాజకీయం చెయ్యొద్దు. సినీ హీరోల ఇళ్లపై దాడులు చెయ్యొద్దు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అన్నారు. సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదని.. వదంతులను ఎవరూ నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిని ఆయన ఖండించారు. దాడులు చేస్తే చట్టం ఊరుకోదని మంత్రి హెచ్చరించారు. కాగా.. తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతడు క్రమంగా కోలుకుంటున్నాడని, జ్వరం తగ్గుముఖం పడుతోందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపారు. కాగా.. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కోమటి రెడ్డి స్పందించిన తీరు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్య, వైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన ఆయన.. రేవతి కుటుంబాన్ని, శ్రీతేజ్‌ను ఆదుకోవడానికి ఆర్య, వైశ్య మహాసభ ముందుంటుందని తెలిపారు. కాగా.. శ్రీతేజ్‌కు చికిత్స తామే చేయిస్తున్నామంటూ అల్లు అర్జున్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తోందని తెలంగాణ ఆర్య, వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చామని చెబుతున్న అల్లు అర్జున్ ఇప్పటికి ఇచ్చింది రూ.10 లక్షలేనన్నారు.
ఓయూ జేఏసీ నేతలకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటి ఎదుట నిరసనకు దిగి, దాడికి పాల్పడిన ఆరుగురు ఓయూ జేఏసీ నేతలకు బెయిల్ మంజూరైంది. వారిని అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. వనస్థలిపురంలో ఉన్న న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి హాజరుపరచగా.. కేసు పూర్వాపరాలు విచారించిన న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరూ రూ.10 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని అదేశించారు. అడ్డగూడూరుకు చెందిన బైరు నగేష్, దౌలతాబాద్‌కు చెందిన రెడ్డి శ్రీనివాస్, కొడంగల్‌కు చెందిన మోహన్, చౌటుప్పల్‌కు చెందిన బి.నాగరాజు, చర్లపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్, షాద్‌నగర్‌కు చెందిన ప్రకాష్ జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటివద్ద ఆదివారం ఆందోళనకు దిగి పూలకుండీలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకొని ప్రతినిధులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
Updated Date - Dec 24 , 2024 | 03:09 AM