Ponguleti: కేసుల నుంచి రక్షణకే ఢిల్లీకి కేటీఆర్
ABN , Publish Date - Nov 12 , 2024 | 04:54 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఉన్న కేసుల నుంచి కాపాడాల్సిందిగా కేంద్రంలోని బీజేపీ పెద్దల కాళ్లు మొక్కేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.
ఫార్ములా ఈ-రేస్‌పై విచారణను అడ్డుకునేందుకు ప్రయత్న మంత్రులు పొంగులేటి, పొన్నం
త్వరలో పేలే బాంబు ఏంటో తెలిసే వెళ్లారు
తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకు?
ఆర్‌బీఐ అనుమతి లేకుండా విదేశాలకు
55 కోట్లను ఎలా పంపించారు?: పొంగులేటి
బీఆర్‌ఎస్‌ది గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ: పొన్నం
ఖమ్మం రూరల్/హైదరాబాద్ సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఉన్న కేసుల నుంచి కాపాడాల్సిందిగా కేంద్రంలోని బీజేపీ పెద్దల కాళ్లు మొక్కేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఫార్ములా ఈ-కార్ రేస్‌లో జరిగిన అవకతవకలపై కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి 13 రోజులు అయిందని తెలిపారు. రేపో మాపో గవర్నర్ అనుమతి వస్తుందని భావించే ఆయన ఢిల్లీకి వెళ్లారన్నారు. అమృత్ పథకంలో అవకతకలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారన్నది ప్రజల దృష్టి మరల్చేందుకు చెబుతున్న కథ అని, బీజేపీతో ఢిల్లీలో దోస్తి.. గల్లీలో కుస్తీ బీఆర్‌ఎస్ విధానమని చెప్పారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెల్లి కేసులో బెయిల్ సంపాదించుకున్నట్లే.. ఈ కేసులో తనకూ బెయిల్ కోసం కేటీఆర్ కేంద్ర పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. త్వరలో పేలబోయే బాంబు ఏంటో కేటీఆర్‌కు తెలుసునని, బండారం బయట పడుతుండడంతో ఢిల్లీలోని అదానీ, అంబానీతోపాటు బీజేపీ అగ్రనేతలకు పాదాభివందనం చేసి లబ్ధి పొందేందుకు వెళ్లారని ఆరోపించారు. ఏ తప్పూ చేయకపోతే ఎందుకు ఉలికి పడుతున్నారని ప్రశ్నించారు.
కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు?
ఈ-కార్ రేస్ కోసం నిజంగా రూ.55 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే కేటీఆర్ భయపడటం ఎందుకని పొంగులేటి ప్రశ్నించారు. ఒప్పందం కుదరకముందే రూ.55 కోట్లు పంపారని, ఎంవోయూ మీద సంతకాలు పెట్టడానికి ఆయనకు ఉన్న అర్హతేంటని నిలదీశారు. దేశానికి చెందిన డబ్బును ఇతర దేశాలకు పంపాలంటే ఆర్‌బీఐ గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ ఎవరి అనుమతి తీసుకుని విదేశాలకు పంపించారో ప్రజలకు చెప్పాలన్నారు. దొరల పదేళ్ల పాలనలో జరిగిన వ్యవహారాలన్నింటినీ ప్రజల ముందు పెడితే గత పాలకులంతా అంతరిక్షంలో దాక్కుంటారేమోనని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదన్నారు.
తనను బాంబుల మంత్రి అంటున్న మాజీ మంత్రి కేటీఆర్.. కాళేశ్వరం విషయంలో ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టాలని తమకు ఉండదని చెప్పారు. పేదలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోదన్నారు. కాగా, ఫార్ములా ఈ-కారు రేస్‌కు సంబంధించి ఏసీబీ విచారణ జరుగుతోందని మంత్రి పొన్నం తెలిపారు. కేటీఆర్ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా విచారణకు సహకరించాల్సింది పోయి.. తప్పించుకునే ప్రయత్నం చేయడం సబబు కాదన్నారు. రవాణా శాఖ కార్యాలయంలో పొన్నం విలేకరులతో మాట్లాడుతూ.. కారు రేసింగ్‌కు సంబంధించి డబ్బులు చెల్లించామని స్వయంగా కేటీఆరే చెప్పారని, దీనిపై చట్ట ప్రకారం విచారణ జరుగుతుంటే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేటీఆర్ తప్పును అంగీకరించాలన్నారు.