Ponguleti: భూమికి భరోసా
ABN, Publish Date - Dec 19 , 2024 | 04:08 AM
ప్రభుత్వ భూములను ఆక్రమించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని.. ఆ భూములను స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ధరణిలో 33 మాడ్యూళ్లు ఉండేవి. ఇప్పుడు దాన్ని 6 మాడ్యూళ ్లకు కుదిస్తున్నాం. మాన్యువల్ పహాణీలో ఉండే 32 కాలమ్‌లను గత ప్రభుత్వం ఒకే కాలమ్‌కు కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేస్తున్నాం. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. భూభారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం ఉంది. - మంత్రి పొంగులేటి
సామాన్యుల భూహక్కులను పరిరక్షిస్తాం
ధరణితో అన్యాక్రాంతమైన భూముల గుట్టు రట్టు చేస్తాం
సభలో ‘భూభారతి’ బిల్లు ప్రవేశపెట్టిన పొంగులేటి
మ్యుటేషన్ సమస్యలు తీర్చేందుకు అప్పిలేట్ అథారిటీ
మళ్లీ రెవెన్యూ సదస్సులు, భూసమస్యల పరిష్కారం
భూవివాదాల అప్పీళ్లకు ‘ల్యాండ్ ట్రైబ్యునల్స్’ ఏర్పాటు
సాదా బైనామాలకు పరిష్కారం, భూధార్ నంబర్లు
బిల్లులోని ప్రత్యేకతలను వివరించిన మంత్రి పొంగులేటి
ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిని వదలబోమని..
ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకిస్తామని వెల్లడి
ప్రభుత్వ ఆస్తుల్ని తారుమారు చేసే అధికారులకు శిక్షలు
అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములను ఆక్రమించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని.. ఆ భూములను స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు వ్యక్తులు రెవెన్యూ చట్టం-2020ను ప్రజలపై రుద్దారని, పూర్తి అవినీతితో నిండిపోయిన ఆ చట్టానికి మూడేళ్లకే నూరేళ్లు నిండిపోయేలా ప్రజలు మార్గ నిర్దేశం చేశారని వ్యాఖ్యానించారు. దాని స్థానంలో తాము అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాన్ని తెస్తున్నామని పేర్కొంటూ.. ‘తెలంగాణ భూభారతి (భూమిపై హక్కుల రికార్డు) బిల్లు-2024’ను బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ చట్టంలోని కీలక అంశాలు వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో అనేక పొరపాట్లు ఉన్నాయని, ‘ధరణి’తో రైతులకు అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు.
అందులోని పొరపాట్లు, లోపాలన్నింటినీ సరిదిద్ది, మేధావులతో చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించామని, కాస్త ఆలస్యమైనా సమగ్రంగా తీసుకొచ్చామని పొంగులేటి వివరించారు. భూములున్న ప్రతి వ్యక్తికీ భద్రత కల్పించేలా, సామాన్యుల హక్కులను పరిరక్షించడమే ధ్యేయంగా ఈ చట్టాన్ని రూపొందించామని.. భూభారతి చట్టం వందేళ్లు వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. 1971లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్వోఆర్ చట్టం 49 ఏళ్లపాటు ఉపయోగపడిందని, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఏడేళ్ల పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా కొనసాగిందని అన్నారు.. అర్ధరాత్రి వేళ నాలుగు గోడల మధ్య రూపొందించిన ధరణి చట్టం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా లక్షలాది సమస్యలను తెచ్చిపెట్టిందని ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకే ఆర్వోఆర్ చట్టం- 2020ను ప్రక్షాళన చేసి భూభారతి చట్టాన్ని రూపొందించామన్నారు. ఆగస్టు 2న ముసాయిదాను ప్రవేశపెట్టడమే కాకుండా, 40 రోజుల పాటు వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, అధికారుల సలహాలు సూచనలు స్వీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశామన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు 7 పేజీల సలహాలు, సూచనలు ఇచ్చారని, వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
‘భూభారతి’లోని ప్రధానాంశాలు
భూభారతి చట్టంలోని ముఖ్యమైన అంశాల ను మంత్రి సభకు వివరించారు. ఆ విశేషాలు..
గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం స్థలాలు, భూములసమస్యలకు పరిష్కారం.
భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ఎంజాయ్‌మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం.
పాస్‌బుక్ ఒకరి పేరుపై.. భూమి మరొకరి ఆధీనంలో ఉండడం వంటి పొరపాట్లు లేకుండా భద్రత కల్పించేలా నిబంధనలు.
భూ క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే.. క్లియర్ టైటిల్ ఉంటే... మ్యుటేషన్ పూర్తవుతుంది. డాక్యుమెంట్‌లో ఏవైనా అనుమానాలు, పొరపాట్లు ఉంటే... ‘అప్పిలేట్ అథారిటీ’ పరిష్కరిస్తుంది.
వారసత్వంగా, వంశపారంపర్య భూముల విషయంలో... ఆ భూమిపై ఎంత మందికి హక్కు ఉందో... వారికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి, పంపిణీ చేస్తారు. వెంటనే వారి పేర్లపై మ్యుటేషన్ చేస్తారు. ఏవైనా సమస్యలుంటే... కలెక్టర్, ఆర్‌డీవో పరిష్కరిస్తారు.
సేల్ డీడ్, వారసత్వ రిజిస్ట్రేషన్లు కాకుండా.. కోర్టు ద్వారా వచ్చే ఓఆర్సీ, 38-ఈ తదితర 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ అధికారాలు ఆర్‌డీవోలకు.
2020 నవంబరు10 వరకూ ఆన్‌లైన్‌లో వచ్చిన 9.24 లక్షల సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించారు.
పౌరులకు ఆధార్ నంబర్‌లాగానే..భూములకు భూధార్ నంబర్ కేటాయిస్తారు. భూసమస్యల పరిష్కారానికి అదే ఆధారం.
2020 చట్టానికి ముందు జమాబందీ సదస్సులు నిర్వహించి, భూసమస్యలను పరిష్కరించేవారు. సరైన వివరాలను రికార్డుల్లోకి ఎక్కించేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,956 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో గ్రామ రెవెన్యూసదస్సులు నిర్వహించాలని కొత్త చ ట్టంలో పొందుపర్చారు. త్వరలోనే ప్రతి రెవె న్యూగ్రామానికీఓ అధికారిని నియమిస్తారు.
భూ వివాదాల విజ్ఞప్తులు, అప్పీళ్ల కోసం ల్యాండ్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు. అవసరాన్ని, బట్టి వీటి సంఖ్యపై త్వరలో నిర్ణయం.
ప్రభుత్వ ఆస్తులను, రికార్డులను ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే... సీసీఎల్‌ఏ ద్వారా రివిజన్ చేసుకునే అవకాశం.
ప్రభుత్వ ఆస్తులను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసుకుని, శిక్షించే అధికారాన్ని ఈ చట్టంలో కల్పించారు.
2014కు ముందు పాస్‌బుక్‌లో ఉండే అనుభవదారుడి కాలమ్‌ను 2020 చట్టంలో తీసేశారు. అనుభవదారు కాలమ్‌ను కొత్త చట్టంలో పునరుద్ధరించారు. రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ కాకుండా, కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ కార్యాలయాలలో భద్రపరుస్తారు.
ఇవీ ప్రత్యేకతలు..
ధరణిలో 33 మాడ్యూళ్లు(ఆప్షన్లు) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ ్లకు కుదిస్తున్నామని... మాన్యువల్ పహాణీలో ఉండే 32 కాలమ్‌లను గత ప్రభుత్వం ఒకే కాలమ్‌కు కుదించిందని.. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేస్తున్నామని పొంగులేటి వివరించారు.. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించిందని.. భూభారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే ఎవరైనా భూభారతి ద్వారా తెలియజేయవచ్చని చెప్పారు. భూభారతి ద్వారా దరఖాస్తు చేసుకున్న భూయజమానుల మొబైల్ నెంబర్లకే అప్‌డేట్స్ వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ‘‘2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను, ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తాం. అలాగే.. గత ప్రభుత్వం ధరణి పేర తెచ్చిన చట్టానికి మూడేళ్లు దాటినా నియమాల(రూల్స్)ను రూపొందించలేదు. మేం 3నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేసి.. గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని, భూసమస్యలను పరిష్కరిస్తాం’’ అని పొంగులేటి వివరించారు.
కాగా.. కొత్త బిల్లుపై అధ్యయనానికి తమకు తగిన సమయం ఇవ్వలేదంటూ ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ దీనిపై ‘పాయింట్ ఆఫ్ ఆర్డర్’ లేవనెత్తారు. సభ నియమాల ప్రకారం అధ్యయనానికి 12 గంటల సమయం ఇవ్వాలని, బిల్లును ప్రవేశపెట్టి, వెంటనే ఆమోదింపజేసుకునే పరిస్థితి మంచిది కాదని ఆయన అభ్యంతరం వెలిబుచ్చారు. కొత్త బిల్లులో సవరణలు సూచించడానికి, సలహాలు ఇవ్వడానికి వీలుగా... బిల్లు కాపీని రెండు రోజుల ముందే సభ్యులకు అందజేయాలని, అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అయితే.. గతంలో బీఆర్‌ఎస్ సర్కారు బిజినెస్ రూల్స్‌లోని 97, 98, 99 నిబంధనలను సస్పెండ్ చేసి, సభ్యులకు ఎలాంటి సమయం ఇవ్వకుండా బిల్లులను ఆమోదింపజేసుకున్నదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. బిల్లు పరిశీలనకు స్పీకర్ సమయం ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. దాంతో స్పీకర్ ప్రసాద్‌కుమార్.. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు సభ్యులకు సమయం ఇచ్చారు. ఏవైనా సూచనలుంటే ఆలోగా ఇవ్వాలన్నారు.
ధరణి భూభారతి-2024
Updated Date - Dec 19 , 2024 | 04:08 AM